కోల్‌కతా: రుణ భారం తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచుకోవడం, టర్న్‌అరౌండ్ సాధించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వైజాగ్ స్టీల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్‌ఐఎన్‌ఎల్) సీఎండీ అతుల్ భట్ తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంటు, విశాఖలోని స్థలాల మానిటైజేషన్‌తో పాటు వ్యయ నియంత్రణ చర్యలతో దాదాపు రూ. 3,000– 4,000 కోట్లు సమీకరించుకోగలిగితే ఇందుకు సహాయకరంగా ఉండగలదని ఆయన చెప్పారు. ఉక్కు, మెటలర్జీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ అతుల్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మానిటైజేషన్ (విక్రయం, లీజుకివ్వడం తదితర మార్గాల్లో అసెట్లపై ఆదాయం ఆర్జించడం) చేపట్టగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
2022–23లో ఆర్‌ఐఎన్‌ఎల్ సుమారు రూ. 3,000 కోట్లు నష్టం నమోదు చేసింది. అంతర్జాతీయంగా మందగమనంతో నిల్వలు పేరుకుపోవడం, ఉక్కుపై ఎగుమతి సుంకాలు, ముడి వనరుల లభ్యతకు భద్రత లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని భట్ వివరించారు. ఓపెన్ మార్కెట్ నుంచి ముడి ఇనుము కొనాల్సి రావడం వల్ల ప్రతి టన్నుకు రూ. 6,000 మేర ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని, దీనికి తోడు రూ. 23,000 కోట్ల భారీ రుణ భారం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మానిటైజేషన్ ప్రణాళికతో రుణభారం తగ్గి, నిర్వహణ మూలధన పరిస్థితి మెరుగుపడగలదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉన్న ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంటుపై ఆర్‌ఐఎన్‌ఎల్ రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment