SDR
-
అంబానీ సరికొత్త ప్లాన్స్: ఆర్‌కాం హై జంప్
సాక్షి, ముంబై: అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీ మీడియా సమావేశం నిర్వహించారు. రుణభారాన్ని తగ్గించుకోవడానికి అనుసరించనున్న ప్రణాళికలు, వ్యూహాలను ఆయన వివరించారు. ఇన్ స్పెక్ట్రమ్, టవర్, రియల్ ఎస్టేట్ ఆస్తుల అమ్మకం ద్వారా మొత్తం అప్పులను రూ.45వేలకోట్లనుంచి రూ.6వేలకోట్ల దిగువకు తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. జనవరి -మార్చి నాటికి అన్ని అప్పులను దశలవారీగా చెల్లిస్తామని వెల్లడించారు. ప్రీ పేమెంట్స్ ద్వారా రూ.25వేల కోట్లను అప్పులను తగ్గించుకోనున్నామని తెలిపారు. ఈ విషయంలో రుణదాతలు, బాండ్ హోల్డర్లు, వాటాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) ప్లాన్స్‌పై మంగళవారం నిర్వహించిన ఈ సమావేశం నేపథ్యంలో ఆర్‌కాం షేర్ విలువ 41 శాతానికిపైగా లాభపడింది. కంపెనీ వైర్లెస్ డివిజన్, 39.98 శాతం ఎస్.డి.ఆర్ మెకానిజం నుండి బయటికి వస్తోందని, దీంతో రుణభారాన్ని రూ .25,000కోట్ల మేర తగ్గించుకుంటామని పేర్కొన్నారు. కష్టకాలం ముగిసింది..ఇక ముందున్నదంతా మంచికాలమే అన్ని సంకేతాలివ్వడంతో మిగిలిన అడాగ్ గ్రూపు షేర్లు కూడా ఇదే బాటపట్టాయి. రిలయన్స్ కేపిటల్ 5 శాతం , రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 శాతం రిలయన్స్ పవర్ 3.2 శాతం పుంజుకున్నాయి. -
కొత్త ఇన్వెస్టర్లకు ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలను రుణదాతలు కొనుగోలు చేయడం, తిరిగి ఈ వాటాలను కొత్త ఇన్వెస్టర్లు విక్రయించే అంశానికి సంబంధించి నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. ఇలాంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసేటప్పుడు పబ్లిక్ షేర్హోల్డర్లకు కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ప్రకటించడం నుంచి మినహాయింపునిచ్చింది. అయితే, వాటాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్‌హోల్డర్ల అనుమతి పొందడం తదితర షరతులు దీనికి వర్తిస్తాయి. దాదాపు రూ. 8 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండిబాకీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సెబీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నష్టాల్లో ఉన్న లిస్టెడ్ కంపెనీలు కోలుకోవడానికి, తద్వారా వాటాదారులు.. రుణదాతలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ చర్యలు ఉద్దేశించినవని ఆగస్టు 14న జారీ చేసిన నోటిఫికేషన్లో సెబీ పేర్కొంది. ప్రస్తుతం వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) పథకం కింద నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు దక్కించుకున్న రుణదాతలకు మాత్రమే ఓపెన్ ఆఫర్ తదితర నిబంధనల నుంచి మినహాయింపులు ఉన్నాయి. అయితే, సదరు రుణదాతల నుంచి వాటాలు కొనుగోలు చేయాలంటే తాము కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుండటం వల్ల కొత్త ఇన్వెస్టర్లు (కొత్త యాజమాన్యం) ముందుకు రావడం లేదు. ఒకవేళ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తే.. కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలిగే నిధుల పరిమాణం తగ్గిపోతోంది. ఈ సమస్యలను రుణదాతలు .. తన దృష్టికి తీసుకురావడంతో సెబీ తాజాగా ఓపెన్ ఆఫర్ మినహాయింపులను కొత్త ఇన్వెస్టర్లకు కూడా వర్తించేలా నిర్ణయం తీసుకుంది. -
బ్యాంకుల చేతికి జేపీ!
♦ కంపెనీ ఖాతాను ఎన్పీఏగా ప్రకటించిన రుణదాతలు ♦ ఎస్డీఆర్ ప్రక్రియను ప్రారంభించిన ఐసీఐసీఐ ♦ త్వరలో విధివిధానాలను చర్చించనున్న బ్యాంకర్లు ♦ అల్ట్రాటెక్‌తో సిమెంట్ ప్లాంట్ల విక్రయం ఒప్పందానికి బ్రేక్! ముంబై: భారీ అప్పుల్లో కూరుకుపోయిన.. జేపీ అసోసియేట్స్ గ్రూప్‌ను బ్యాంకులు తమ ఖాతాలో వేసుకోనున్నాయి. జేఏఎల్‌కు భారీస్థాయిలో రుణాలిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు ఈ దిశగా చర్యలు మొదలుపెట్టాయి. దీంతో జేపీ గ్రూప్ ప్రధాన కంపెనీ జేఏఎల్ తమ సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించడం కోసం కుదుర్చుకున్న రూ.15,900 కోట్ల ఒప్పందానికి బ్రేక్ పడ్డట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ అకౌంట్‌ను మొండిబకాయి(ఎన్పీఏ) ల్లోకి చేర్చామని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక తమ అప్పులకు సరిపడా కంపెనీలో వాటాను తీసుకోవడం కోసం వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఏ) ప్రక్రియను ఆరంభించినట్లు ఆయన తెలిపారు. ఎస్డీఆర్ ప్రక్రియ పూర్తయితే జేఏఎల్లో మెజారిటీ వాటా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లినట్లే లెక్క. కంపెనీ యాజమాన్య, నియంత్రణ అధికారాలన్నీ ఇక రుణదాతలు నియమించే వ్యక్తులే చూసుకుంటారు. కాగా, ఎస్డీఆర్ విధివిధానాలు, షరతులతో పాటు జేపీ-అల్ట్రాటెక్ సిమెంట్ డీల్‌పై చర్చించేందుకు త్వరలో జాయింట్ లెండర్స్ ఫోరమ్(జేఏఎఫ్) మరోసారి సమావేశం కానుందని ఎస్బీఐ అధికారి వెల్లడించారు. అల్ట్రాటెక్‌తో డీల్‌ను ఆమోదించాలా వద్దా అనేది ఫోరమ్ నిర్ణయిస్తుందన్నారు. జేఏఎఫ్కు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వం వహిస్తోంది. రుణ భారం రూ.58 వేల కోట్లపైనే... జేపీ అసోసియేట్స్‌కు ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం రూ.58,250 కోట్ల అప్పులు లెక్కతేలాయి. ఇందులో ఎస్బీఐ వాటా రూ.7,000 కోట్లుగా అంచనా. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుకు జేఏఎల్ రుణ బకాయిని చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్డీఆర్ ప్రక్రియకు తెరతీసింది. ఎస్డీఐఆర్కు జూన్ 28 రిఫరెన్స్ తేదీగా కూడా పేర్కొన్నట్లు జేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఎస్డీఆర్ను అమోదించడం లేదా తిరస్కరించేందుకు జేపీ అసోపసియేట్స్కు బ్యాంకర్లు మూడు నెలల గడవు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సిమెంట్ ప్లాంట్ల విక్రయంపై అనిశ్చితి ఎఫెక్ట్... అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు జేఏఎల్ ఆస్తుల విక్రయంపై దృష్టిసారించింది. అయితే, ఈ ప్రయత్నాలేవీ సజావుగా సాగకపోవడంతో కంపెనీ బకాయిల చెల్లింపు విషయంలో చేతులేత్తేసేందుకు దారితీసింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో తమకున్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మార్చి 31న దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. ఎస్డీఆర్ నేపథ్యంలో దీనిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. -
బ్యాంకుల చేతికి...జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ!
♦ 55 శాతం మెజారిటీ వాటా... ♦ ఎస్డీఆర్ అమలుకు బ్యాంకుల కన్సార్షియం నిర్ణయం.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో సంస్థ బ్యాంకుల చేతికి చేరింది. ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ (జీఆర్‌ఈఎల్)కి ఇచ్చిన లోన్లకు సంబంధించి వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక (ఎస్డీఆర్)ను అమలు చేయాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాలు (ఎఫ్ఎస్ఏ), దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడంతో బ్యాంకుల కన్సార్షియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. జీఆర్‌ఈఎల్ మొత్తం రుణ భారం (వడ్డీ బకాయిలు కూడా కలిపి) రూ. 3,780 కోట్లు ఉండగా, ఇందులో రూ. 1,414 కోట్ల మొత్తాన్ని బ్యాంకులు ఈక్విటీలు కింద మార్చుకున్నాయి. దీంతో జీఆర్ఈఎల్లో బ్యాంకుల కన్సార్షియంనకు 55 శాతం వాటాలు దక్కనుండగా, మిగతా 45 శాతం జీఎంఆర్ వద్ద ఉంటుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సమావేశంలో షేర్లను కేటాయించినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. మిగతా రూ. 2,366 కోట్ల రుణ మొత్తాన్ని 10.75 శాతం వడ్డీ రేటుతో 20.5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 1.75 సంవత్సరాల మారటోరియం లభిస్తుందని వివరించింది. ఎస్డీఆర్ అనంతరం ప్రాజెక్టులో మొత్తం ఈక్విటీ విలువ రూ. 2,571 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ ఇన్ఫ్రా పేర్కొంది. రుణ భారంతో పాటు వడ్డీ వ్యయాలు కూడా తగ్గడమనేది దీర్ఘకాలికంగా ప్రాజెక్టు లాభదాయకతకు తోడ్పడగలదని తెలిపింది. రుణాల భారంతో కుదేలైన ఐవీఆర్సీఎల్ ఇప్పటికే బ్యాంకుల చేతికి చేరగా, మరోఇన్ఫ్రా సంస్థ ల్యాంకో గ్రూప్‌లోనూ బ్యాంకులు ఎస్డీఆర్ అమలు యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీఆర్ఈఎల్లో ఎస్డీఆర్ అమలు ప్రాధాన్యం సంతరించుకుంది. జీఆర్‌ఈఎల్ .. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 768 మె.వా. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంటును జీఆర్‌ఈఎల్ నిర్వహిస్తోంది. 2012లోనే ప్రాజెక్టు పూర్తి అయింది. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి అనూహ్యంగా పడిపోవడంతో ఇంధన సరఫరా లేక విద్యుదుత్పత్తి ప్రారంభించడంలో జాప్యం జరిగింది. ఫలితంగా వ్యయాలూ భారీగా పెరిగిపోయాయి. ఈ-ఆర్ఎల్ఎన్జీ బిడ్డింగ్ స్కీము కింద గ్యాస్ లభించడంతో 2015 అక్టోబర్‌లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. నిల్చిపోయిన గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశంతో కేంద్రం ప్రతిపాదించిన ఈ-ఆర్ఎల్ఎన్జీ బిడ్డింగ్ స్కీములో మూడో దశ కింద గెయిల్ నుంచి సంస్థకు గ్యాస్ సరఫరాకు హామీ దక్కింది. దీంతో 30 శాతం దాకా పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సామర్ధ్యం మేర విద్యుదుత్పత్తికి వీలు కానుంది.