కొత్త ఇన్వెస్టర్లకు ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలను రుణదాతలు కొనుగోలు చేయడం, తిరిగి ఈ వాటాలను కొత్త ఇన్వెస్టర్లు విక్రయించే అంశానికి సంబంధించి నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. ఇలాంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసేటప్పుడు పబ్లిక్ షేర్‌హోల్డర్లకు కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ప్రకటించడం నుంచి మినహాయింపునిచ్చింది. అయితే, వాటాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్‌హోల్డర్ల అనుమతి పొందడం తదితర షరతులు దీనికి వర్తిస్తాయి.
దాదాపు రూ. 8 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండిబాకీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సెబీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నష్టాల్లో ఉన్న లిస్టెడ్ కంపెనీలు కోలుకోవడానికి, తద్వారా వాటాదారులు.. రుణదాతలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ చర్యలు ఉద్దేశించినవని ఆగస్టు 14న జారీ చేసిన నోటిఫికేషన్‌లో సెబీ పేర్కొంది. ప్రస్తుతం వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ (ఎస్‌డీఆర్) పథకం కింద నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు దక్కించుకున్న రుణదాతలకు మాత్రమే ఓపెన్ ఆఫర్ తదితర నిబంధనల నుంచి మినహాయింపులు ఉన్నాయి.
అయితే, సదరు రుణదాతల నుంచి వాటాలు కొనుగోలు చేయాలంటే తాము కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుండటం వల్ల కొత్త ఇన్వెస్టర్లు (కొత్త యాజమాన్యం) ముందుకు రావడం లేదు. ఒకవేళ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తే.. కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలిగే నిధుల పరిమాణం తగ్గిపోతోంది. ఈ సమస్యలను రుణదాతలు .. తన దృష్టికి తీసుకురావడంతో సెబీ తాజాగా ఓపెన్ ఆఫర్ మినహాయింపులను కొత్త ఇన్వెస్టర్లకు కూడా వర్తించేలా నిర్ణయం తీసుకుంది.