Public Shareholder
-
పతంజలి ప్రమోటర్ల వాటాలు సీజ్
న్యూఢిల్లీ: ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలన్న నిబంధన అమలులో విఫలమైనందుకు పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ల వాటాలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్తంభింప (ఫ్రీజ్) చేశాయి. ఈ చర్య కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని పతంజలి ఫుడ్స్ పేర్కొంది. పతంజలి ఆయుర్వేద్ సహా 21 ప్రమోటర్ సంస్థల వాటాలను స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఫ్రీజ్ చేసినట్టు పతంజలి అంతకుముందు ప్రకటించింది. ‘డిస్క్లోజర్’ నిబంధనల కింద స్టాక్ ఎక్సేంజ్‌లకు తాజా విషయాన్ని తెలియజేసింది. కనీస ప్రజల వాటా నిబంధన అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రమోటర్ల నుంచి తమకు సమాచారం అందినట్టు పతంజలి ఆయుర్వేద్ తెలిపింది. ప్రజల వాటాను పెంచేందుకు మెరుగైనది ఏదనే విషయమై వారు చర్చిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే కొన్ని నెలల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82 శాతం వాటా ఉంది. నిబంధనల ప్రకారం 75% మించకూడదు. అంటే మరో 5.82% వాటా విక్రయించాల్సి ఉంటుంది. నేపథ్యం..: రుచి సోయా ఇండస్ట్రీస్ (పతంజలి ఫుడ్స్ పూర్వపు పేరు)ని దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2019 సెప్టెంబర్‌లో పతంజలి గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థలో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 98.87 శాతం వాటా లభించింది. 2022 మార్చిలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు పతంజలి ఫుడ్స్ వచ్చింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 648 చొప్పున 6.61 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో ప్రజల వాటా 19.18 శాతానికి పెరిగింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి ప్రజల వాటా 25%కి చేర్చాల్సి ఉంది. మరో ఎఫ్‌పీవో: బాబా రామ్‌దేవ్ ఏప్రిల్‌లో మరో విడత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) చేపట్టనున్నట్టు పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. తద్వారా ప్రజల వాటా కనీసం 25% ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని తెలిపింది. పతంజలి గ్రూప్ అధినేత బాబా రామ్‌దేవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదన్నారు. పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎక్సే్ఛంజ్‌ల చర్య ప్రభావం చూపించదని భరోసా ఇచ్చారు. తాము 6% వాటాలను తగ్గించుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే జాప్యానికి కారణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాక ఏప్రిల్‌లో ఎఫ్‌పీవో చేపడతామన్నారు. -
అమ్మగా.. సీఈవోగా అంజలీ సూద్..
అంజలీ సూద్ ‘వీమియో’ కంపెనీ సీఈవో. వీడియో హోస్టింగ్, షేరింగ్, సర్వీసెస్ ఇస్తుండే అమెరికన్ కంపెనీ వీమియో. ఆరేళ్ల క్రితం వీమియోలో చేరారు అంజలీ. మొదట మార్కెటింగ్ హెడ్, తర్వాత జనరల్ మేనేజర్, గత నాలుగేళ్లుగా సీఈవో. వీమియో ఈ నెల 25న పబ్లిక్ షేర్స్‌కి వెళ్లింది. ఆ ఘనమైన సందర్భాన్ని ట్విట్టర్లో చిన్న ఫొటోతో అతి శక్తిమంతంగా ప్రకటించారు అంజలీ సూద్. అది ఆమె నాస్డాక్ బిల్డింగ్ ఎదురుగా నిలుచుని ఉన్న ఫోటో అయితే కాదు. కొడుకును ఎత్తుకుని తన ఆఫీస్ క్యాబిన్ డోర్ దగ్గర నిలుచుని ఉన్న ఫొటో! వీమియోలో మొదట చేరినప్పుడు గానీ, తర్వాత ఆ కంపెనీకి సీఈవో అయినప్పుడు గానీ, రెండేళ్ల క్రితం ఫార్చూన్ అండర్ 40 జాబితాలో 14వ స్థానంలో ఉన్నప్పుడు గానీ అంజలీ సూద్ నుంచి వర్కింగ్ మదర్స్ పొందిన స్ఫూర్తి బయటికేమీ కనిపించలేదు. ఇప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ షేర్స్‌కి వెళ్లి నాస్డాక్లో లిస్ట్ అయినప్పుడు కూడా ఆమె తన రెండేళ్ల వయసున్న కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేయకపోయి ఉంటే అది కూడా ఒక మామూలు విషయంగానే నిలిచిపోయేది. ఫొటోతోపాటు అంజలి (37) పెట్టిన కామెంట్ ఎలా ఉందో చూడండి. ‘‘అమ్మ కాలింగ్ బెల్ కొట్టడానికి ముందే వచ్చి అదృష్టం ఆమెను హత్తుకుపోయింది’’ అని! పబ్లిక్ షేర్స్‌కి ఓపెనింగ్ బెల్ ఇవ్వడానికి ముందే తన కంపెనీ ప్రజల్లోకి వెళ్లిపోయింది అని చెప్పడం ఆమె ఉద్దేశం. ‘‘ఇలాంటి రోజు ఒకటి వచ్చిందంటే నమ్మలేక పోతున్నాను’’ అని కూడా ఆ పోస్ట్‌లో రాశారు అంజలి. ఒక పెద్ద కంపెనీ సీఈవో పింక్ సూట్, బూట్లు ధరించి ఆఫీస్‌లో తన కొడుకు ను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో మహిళా సాధికారతకు మాత్రమే కాదు, సంపూర్ణాధికారతకు ప్రతీకలా కనిపించింది. సాధారణ భాషలో చెప్పాలంటే వర్కింగ్ మదర్స్ అందరికీ ఆ ఫొటో భలే ముచ్చటగా అనిపించింది. బహుశా అంజలిలో ఎవరికి వారు తమను చూసుకుని ఉంటారు. శక్తి పొంది ఉంటారు. ఇంటి పనీ, ఆఫీస్ పనీ అంటూ మల్టీ టాస్కింగ్ చెయ్యడం ఏ తల్లికీ సాధ్యం అయ్యే పని కాదు. ‘‘కానీ పిల్లలు సాధ్యం చేయిస్తారు’’ అని ఒక నెట్ యూజర్ అంజలికి థమ్స్ అప్ ఇచ్చారు. ‘‘అలసిన శరీరానికి విశ్రాంతి, అలసిన మనసుకు పిల్లలు’’ అని మరొక మహిళ ట్వీట్ చేశారు. మొదటి ఫొటోను షేర్ చేసిన నాలుగు నిముషాలకు ఈ ఫొటోను షేర్ చేశారు అంజలి. కంపెనీ ‘పబ్లిక్’ షేర్స్‌కి వెళ్లిన సందర్భాన్ని డైరెక్టర్స్‌తో కలిసి షేర్స్ చేసుకుంటున్న ఆ మొదటి ఫొటో కన్నా, కొడుకును ఎత్తుకుని ఉన్న రెండో ఫొటోనే నెటిజన్స్‌ని ఎక్కువ ఆకట్టుకుంది. అనేక వందలసార్లు షేర్ అయింది. ఒక మదర్.. వర్కింగ్ ఉమన్‌గా తన కెరీర్లో అద్భుతాలు సాధించడానికి పిల్లలు శక్తినిస్తారు అనే సందేశాన్ని అంజలి ఆ ఫొటో ద్వారా అందించ తలచినట్లున్నారు. అది సరిగ్గా అందవలసిన వారికే అందింది. పిల్లల బాధ్యతలు తల్లి కెరీర్‌కు ప్రతిబంధకాలు కావని చెప్పలేం. కానీ కెరీర్లోఎదిగే క్రమంలో అవహించే నిస్సత్తువను పోగొట్టే మంత్రదండాలు పిల్లల చిరువ్వులూ, ఇంటికి వచ్చీరాగానే ఎత్తుకోమని ఏడుస్తూ వారు చేసే డిమాండ్లూ! -
మార్కెట్లో ‘వాటా’ ముసలం!
స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ తాజా ప్రతిపాదన స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. బడ్జెట్ రోజు, ఆ తర్వాతి రోజు కొనసాగిన నష్టాలకు ప్రధాన కారణాల్లో ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రతిపాదన కూడా ఒకటి. ఈ ప్రతిపాదన కారణంగా టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు, డిమార్ట్ రిటైల్ స్టోర్స్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ వంటి దిగ్గజ కంపెనీలు కనీసం 10–20 శాతం మేర వాటాను విక్రయించాల్సి వస్తుంది. బీఎస్ఈలో దాదాపు 4,000కు పైగా కంపెనీలు లిస్ట్‌కాగా, వీటిల్లో 1,100 మేర కంపెనీలు వాటా విక్రయం జరపాల్సి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. బహుళజాతి కంపెనీలు(ఎమ్ఎన్సీ) బాధ ఇంకొక ఎత్తు. చాలా ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం రేంజ్లో ఉంది. ఇవి 10 శాతం మేర వాటా విక్రయించాల్సి రావచ్చు. అయితే వాటా విక్రయానికి బదులుగా అసలు స్టాక్ మార్కెట్ నుంచే డీలిస్ట్ అయ్యే దిశగా ఈ ఎమ్ఎన్సీలు యోచిస్తున్నాయని సమాచారం. ఈ విషయమై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ.... లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్‌ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఒక లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్ హోల్డింగ్ పెంపు ప్రతిపాదనకు సెబీ త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని, రెండేళ్ల గడువుని ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన స్టాక్ మార్కెట్ నుంచి లిక్విడిటీని లాగేయడమే కాకుండా, ప్రమోటర్ వాటా అధికంగా ఉన్న బహుళ జాతి కంపెనీలు మన స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఇలాంటి కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఈ కంపెనీలు డీలిస్టింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక బిజినెస్ టు బిజినెస్(బీ2బీ)రంగంలో ఉన్న కంపెనీలు పూర్తిగా డీలిస్టింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి కంపెనీల వ్యాపారాలకు బ్రాండ్లతో పని లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజా ప్రతిపాదనలపై ఎమ్ఎన్సీలు ఇప్పటివరకైతే, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పడూ ఇదే పరిస్థితి... మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ 2010–13లో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను తెచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. పలు ఎమ్ఎన్సీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ తాజా ప్రతిపాదన ప్రకారం ప్రజలకు 35 శాతం వాటాను కేటాయించాల్సి వస్తే, ఎమ్ఎన్సీలు రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి రావచ్చు. ఎమ్ఎన్సీలు, ఇతర భారత కంపెనీలు కలసి మొత్తం మీద రూ. 4 లక్షల కోట్ల మేర షేర్లను విక్రయించే అవకాశాలున్నాయి. ఎమ్ఎన్సీలు...మంచి పనితీరు... మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నా, చాలా ఎమ్ఎన్సీలు మంచి పనితీరునే కనబరుస్తూ వచ్చాయి. మొత్తం గత 16 ఏళ్లకు గాను 11 ఏళ్లలో ఎమ్ఎన్సీ షేర్లు నిఫ్టీని మించిన రాబడులనిచ్చాయి. 2006 నుంచి చూస్తే, వరుసగా 13 ఏళ్ల పాటు నిఫ్టీని మించిన పనితీరును ఎమ్ఎన్సీలు చూపించాయి. తాజా ప్రతిపాదన తక్షణం అమలయ్యే అవకాశాల్లేవు. దశలవారీగానే ఈ ప్రతిపాదన అమల్లోకి రావచ్చు. కనీసం 3–4 ఏళ్లు పడుతుందని అంచనా. అయినప్పటికీ, ఇది ఆయా షేర్ల పనితీరుపై తీవ్రంగానే ప్రభావం చూపించవచ్చు. ప్రమోటర్ వాటా 75 శాతానికి పైగా ఉన్న సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ వంటి కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఇది ఆయా షేర్ల పనితీరుపై సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. అయితే సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఈ షేర్లు తగ్గితే అది కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆంటిక్ స్టాక్ బ్రోకింగ్ పేర్కొంది. ఓఎఫ్ఎస్ల వెల్లువ... ఈ ప్రతిపాదన కారణంగా ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్)లు వెల్లువెత్తుతాయని నిపుణులంటున్నారు. వాటా విక్రయానికి చౌకైన, వేగవంతమైన ప్రక్రియ ఇదేనని, దీంతో స్టాక్ మార్కెట్లో ఓఎఫ్ఎస్లు వెల్లువెత్తుతాయని, దీంతో సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందని వారంటున్నారు. ఈ ప్రతిపాదన కారణంగా కొన్ని ఉత్తమ ఫలితాలూ ఉంటాయని విశ్లేషకులంటున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల యాజమాన్యం మరింతగా విస్తరిస్తుందని, స్టాక్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని, షేర్లకు సరైన విలువ లభిస్తుందని, కార్పొరేట్ గవర్నెన్స్ మరింతగా మెరుగుపడగలదని వారంటున్నారు. అంతే కాకుండా నాణ్యత గల షేర్లు సమంజసమైన ధరకు లభించే అవకాశాలూ ఉన్నాయి. -
కొత్త ఇన్వెస్టర్లకు ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలను రుణదాతలు కొనుగోలు చేయడం, తిరిగి ఈ వాటాలను కొత్త ఇన్వెస్టర్లు విక్రయించే అంశానికి సంబంధించి నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. ఇలాంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసేటప్పుడు పబ్లిక్ షేర్హోల్డర్లకు కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ప్రకటించడం నుంచి మినహాయింపునిచ్చింది. అయితే, వాటాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్‌హోల్డర్ల అనుమతి పొందడం తదితర షరతులు దీనికి వర్తిస్తాయి. దాదాపు రూ. 8 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండిబాకీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సెబీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నష్టాల్లో ఉన్న లిస్టెడ్ కంపెనీలు కోలుకోవడానికి, తద్వారా వాటాదారులు.. రుణదాతలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ చర్యలు ఉద్దేశించినవని ఆగస్టు 14న జారీ చేసిన నోటిఫికేషన్లో సెబీ పేర్కొంది. ప్రస్తుతం వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) పథకం కింద నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు దక్కించుకున్న రుణదాతలకు మాత్రమే ఓపెన్ ఆఫర్ తదితర నిబంధనల నుంచి మినహాయింపులు ఉన్నాయి. అయితే, సదరు రుణదాతల నుంచి వాటాలు కొనుగోలు చేయాలంటే తాము కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుండటం వల్ల కొత్త ఇన్వెస్టర్లు (కొత్త యాజమాన్యం) ముందుకు రావడం లేదు. ఒకవేళ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తే.. కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలిగే నిధుల పరిమాణం తగ్గిపోతోంది. ఈ సమస్యలను రుణదాతలు .. తన దృష్టికి తీసుకురావడంతో సెబీ తాజాగా ఓపెన్ ఆఫర్ మినహాయింపులను కొత్త ఇన్వెస్టర్లకు కూడా వర్తించేలా నిర్ణయం తీసుకుంది.