అమ్మగా అంజలీ సూద్..
అంజలీ సూద్ ‘వీమియో’ కంపెనీ సీఈవో. వీడియో హోస్టింగ్, షేరింగ్, సర్వీసెస్ ఇస్తుండే అమెరికన్ కంపెనీ వీమియో. ఆరేళ్ల క్రితం వీమియోలో చేరారు అంజలీ. మొదట మార్కెటింగ్ హెడ్, తర్వాత జనరల్ మేనేజర్, గత నాలుగేళ్లుగా సీఈవో. వీమియో ఈ నెల 25న పబ్లిక్ షేర్స్‌కి వెళ్లింది. ఆ ఘనమైన సందర్భాన్ని ట్విట్టర్‌లో చిన్న ఫొటోతో అతి శక్తిమంతంగా ప్రకటించారు అంజలీ సూద్. అది ఆమె నాస్డాక్ బిల్డింగ్ ఎదురుగా నిలుచుని ఉన్న ఫోటో అయితే కాదు. కొడుకును ఎత్తుకుని తన ఆఫీస్ క్యాబిన్ డోర్ దగ్గర నిలుచుని ఉన్న ఫొటో!
వీమియోలో మొదట చేరినప్పుడు గానీ, తర్వాత ఆ కంపెనీకి సీఈవో అయినప్పుడు గానీ, రెండేళ్ల క్రితం ఫార్చూన్ అండర్ 40 జాబితాలో 14వ స్థానంలో ఉన్నప్పుడు గానీ అంజలీ సూద్ నుంచి వర్కింగ్ మదర్స్ పొందిన స్ఫూర్తి బయటికేమీ కనిపించలేదు. ఇప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ షేర్స్‌కి వెళ్లి నాస్డాక్‌లో లిస్ట్ అయినప్పుడు కూడా ఆమె తన రెండేళ్ల వయసున్న కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేయకపోయి ఉంటే అది కూడా ఒక మామూలు విషయంగానే నిలిచిపోయేది. ఫొటోతోపాటు అంజలి (37) పెట్టిన కామెంట్ ఎలా ఉందో చూడండి. ‘‘అమ్మ కాలింగ్ బెల్ కొట్టడానికి ముందే వచ్చి అదృష్టం ఆమెను హత్తుకుపోయింది’’ అని! పబ్లిక్ షేర్స్‌కి ఓపెనింగ్ బెల్ ఇవ్వడానికి ముందే తన కంపెనీ ప్రజల్లోకి వెళ్లిపోయింది అని చెప్పడం ఆమె ఉద్దేశం.
‘‘ఇలాంటి రోజు ఒకటి వచ్చిందంటే నమ్మలేక పోతున్నాను’’ అని కూడా ఆ పోస్ట్‌లో రాశారు అంజలి. ఒక పెద్ద కంపెనీ సీఈవో పింక్ సూట్, బూట్లు ధరించి ఆఫీస్‌లో తన కొడుకు ను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో మహిళా సాధికారతకు మాత్రమే కాదు, సంపూర్ణాధికారతకు ప్రతీకలా కనిపించింది. సాధారణ భాషలో చెప్పాలంటే వర్కింగ్ మదర్స్ అందరికీ ఆ ఫొటో భలే ముచ్చటగా అనిపించింది. బహుశా అంజలిలో ఎవరికి వారు తమను చూసుకుని ఉంటారు. శక్తి పొంది ఉంటారు. ఇంటి పనీ, ఆఫీస్ పనీ అంటూ మల్టీ టాస్కింగ్ చెయ్యడం ఏ తల్లికీ సాధ్యం అయ్యే పని కాదు. ‘‘కానీ పిల్లలు సాధ్యం చేయిస్తారు’’ అని ఒక నెట్ యూజర్ అంజలికి థమ్స్ అప్ ఇచ్చారు. ‘‘అలసిన శరీరానికి విశ్రాంతి, అలసిన మనసుకు పిల్లలు’’ అని మరొక మహిళ ట్వీట్ చేశారు.
మొదటి ఫొటోను షేర్ చేసిన నాలుగు నిముషాలకు ఈ ఫొటోను షేర్ చేశారు అంజలి. కంపెనీ ‘పబ్లిక్’ షేర్స్‌కి వెళ్లిన సందర్భాన్ని డైరెక్టర్స్‌తో కలిసి షేర్స్ చేసుకుంటున్న ఆ మొదటి ఫొటో కన్నా, కొడుకును ఎత్తుకుని ఉన్న రెండో ఫొటోనే నెటిజన్స్‌ని ఎక్కువ ఆకట్టుకుంది. అనేక వందలసార్లు షేర్ అయింది. ఒక మదర్.. వర్కింగ్ ఉమన్‌గా తన కెరీర్‌లో అద్భుతాలు సాధించడానికి పిల్లలు శక్తినిస్తారు అనే సందేశాన్ని అంజలి ఆ ఫొటో ద్వారా అందించ తలచినట్లున్నారు. అది సరిగ్గా అందవలసిన వారికే అందింది. పిల్లల బాధ్యతలు తల్లి కెరీర్‌కు ప్రతిబంధకాలు కావని చెప్పలేం. కానీ కెరీర్‌లోఎదిగే క్రమంలో అవహించే నిస్సత్తువను పోగొట్టే మంత్రదండాలు పిల్లల చిరువ్వులూ, ఇంటికి వచ్చీరాగానే ఎత్తుకోమని ఏడుస్తూ వారు చేసే డిమాండ్లూ!
Comments
Please login to add a commentAdd a comment