న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారు, బ్యాంకులకు బకాయి పడిన ఖాతాదారులు (ఎన్‌పీఏ) దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా... వేలానికి వచ్చే ఆస్తులకు బిడ్డింగ్ వేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సవరణల ఆర్డినెన్స్‌కు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ ముద్రపడింది.
ఈ ఆర్డినెన్స్‌ను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిం దే. ఐబీసీ చట్టంలో నిబంధనలను దుర్వినియోగం చేయకుండా మోసపూరిత వ్యక్తులను అడ్డుకోవడమే ఆర్డినెన్స్ ఉద్దేశమని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఐబీసీలో చేసిన మార్పులకు వచ్చే నెల 15 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది.
తొలి దశలో బ్యాంకులకు రూ.5,000 కోట్లకుపైగా బకాయిలు పడిన 12 భారీ ఎన్‌పీఏ కేసుల్లో దివాలా పరిష్కార చర్యలు ఇప్పటికే ఐబీసీ కింద మొదలయ్యాయి. వీటిలో పలు ఖాతాల కు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీల ప్రమోటర్లు బిడ్డర్లుగా ఉండడం గమనార్హం. ఈ విధమైన అనైతిక చర్యలను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌లో కేంద్రం మార్పులు చేసింది.
ఆరు సెక్షన్లలో మార్పులు
ఎన్‌పీఏ ఖాతాలుగా వర్గీకరించి ఏడాది, అంతకుమించినా, లేదా దివాలా పరిష్కారం కింద నమోదు చేసేలోపు వడ్డీ సహా బకాయిలను చెల్లించ లేకపోయిన వారిపై అనర్హత అమలవుతుంది. వీరు ఆస్తుల వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉండదని ఆర్డినెన్స్ స్పష్టం చేస్తోంది. దీంతో ఐబీసీ కింద దివాలా పరిష్కారానికి నివేదించిన ఖాతాల తాలూకూ కార్పొరేట్లు, ప్రమోటర్లు హోల్డింగ్ కంపెనీలు లేదా సంబంధిత పార్టీలు మొండి బకాయిల ఆస్తుల బిడ్డింగ్‌లో పాల్గొనలేరు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డు (ఐబీబీఐ)కు అదనపు అధికారాలు కల్పించారు. ఐబీసీ నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై రూ.2 కోట్ల వరకు జరిమానా విధించొచ్చు. మొత్తం మీద ఐబీసీ కోడ్‌లో ఆరు సెక్షన్లలో సవరణలు చేయగా, కొత్తగా రెండు సెక్షన్లు జోడించారు.
ఆస్తుల విలువపై ప్రభావం ఉండదు: ఎస్‌బీఐ
దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటున్న ఎన్‌పీఏ ఆస్తుల విలువపై తాజా ఆర్డినెన్స్ ప్రభావం చూపించకపోవచ్చని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘చట్టంలో మార్పులతో ఆ ఆస్తుల విలువ పడిపోదు. ఎందుకంటే వీటి కొనుగోలుకు ఎంతో ఆసక్తి ఉంది. ప్రస్తుత ప్రమోటర్లను బిడ్డింగ్‌కు అనుమతించకపోయినా, అనుమతించినా విలువలో మార్పుండదు. సరసమైన ధర ప్రకారమే వేలం ఉంటుంది’’ అని రజనీష్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment