దేశంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్‌సీబీ) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2018–19 నుంచి 2022–23) రూ.10.57 లక్షల కోట్లను మాఫీ (రైటాఫ్.. పద్దుల్లోంచి తొలగింపు) చేశాయని, అందులో రూ.5.52 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు సంబంధించిన రుణాలని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు గత ఐదేళ్ల కాలంలో రూ.7,15,507 కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) కూడా రికవరీ చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల కాలంలో మోసాలకు సంబంధించి జరిగిన రైటాఫ్‌ల విలువ రూ.93,874 కోట్లని ఈ సందర్భంగా వెల్లడించారు.
మాఫీతో రుణ గ్రహీతకు ప్రయోజనం ఉండదు...
సంబంధిత బ్యాంక్ బోర్డుల మార్గదర్శకాలు– విధానాలకు అనుగుణంగా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను క్లీన్ చేస్తాయని కరాద్ పేర్కొన్నారు. పన్ను ప్రయోజనాలను పొందేందడం, మూలధనాన్ని తగిన విధంగా వినియోగించుకోవడం వంటి అంశాలకు సంబంధించి బ్యాంకులు రైట్–ఆఫ్‌ల ప్రభావాన్ని క్రమం తప్పకుండా అంచనా వేస్తాయని కరాద్ చెప్పారు. ‘‘ఇటువంటి రైట్–ఆఫ్‌లు రుణగ్రహీతల తిరిగి చెల్లించాల్సిన బాధ్యతల మాఫీకి దారితీయదు. రైట్–ఆఫ్ రుణగ్రహీతలకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు. రుణగ్రహీతలు బ్యాంకులకు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిందే. బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న యంత్రాంగాల ద్వారా రికవరీ చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి’’ అని కరాద్ స్పష్టం చేశారు.
21,791 నకిలీ జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లు: నిర్మలా సీతారామన్
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అధికారులు 21,791 నకిలీ జీఎస్‌టీ రిజి్రస్టేషన్లను ఇందుకు సంబంధించి రూ.24,000 కోట్లకు పైగా పన్ను ఎగవేతలను గుర్తించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రెండు నెలలపాటు సాగిన స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు ఈ విషయాలను గుర్తించినట్లు వెల్లడించారు. గుర్తించిన నకిలీ రిజి్రస్టేషన్లలో స్టేట్ ట్యాక్స్ న్యాయపరిధిలోని రిజి్రస్టేషన్లు 11,392 కాగా (రూ.8,805 కోట్లు), సీబీఐసీ న్యాయపరిధిలోనివి 10,399 (రూ.15,205 కోట్లు) అని ఆమె వివరించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడటానికి, పన్ను చెల్లింపుదారులు ఎటువంటి తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ అవుతుంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అధికారాల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment