
బ్యాంక్ ఆఫ్ బరోడా టర్న్ ఎరౌండ్
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా 2017 మార్చితో ముగిసిన క్వార్టర్‌లో టర్న్ ఎరౌండ్ అయ్యింది. గతేడాది ఇదేకాలంలో నికరనష్టాన్ని ప్రకటించిన బ్యాంకు తాజా త్రైమాసికంలో రూ. 155 కోట్ల నికరలాభాన్ని వెల్లడించింది.
ఎన్‌పీఏలకు కేటాయింపుల తగ్గుదల ప్రభావం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా 2017 మార్చితో ముగిసిన క్వార్టర్‌లో టర్న్ ఎరౌండ్ అయ్యింది. గతేడాది ఇదేకాలంలో నికరనష్టాన్ని ప్రకటించిన బ్యాంకు తాజా త్రైమాసికంలో రూ. 155 కోట్ల నికరలాభాన్ని వెల్లడించింది. మొండి బాకాయిలకు కేటాయింపులు భారీగా తగ్గడంతో బ్యాంకు నికరలాభాన్ని సాధించగలిగింది. 2016 మార్చి క్వార్టర్లో బ్యాంకు రూ. 3,230 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 12,789 కోట్ల నుంచి రూ. 12,852 కోట్లకు పెరిగింది.
ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ. 6,867 కోట్ల నుంచి రూ. 2,623 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. స్థూల ఎన్‌పీఏలు మాత్రం 9.99 శాతం నుంచి 10.46 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 5.06 శాతం నుంచి 4,72 శాతానికి తగ్గాయి. బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 1.20 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 2 శాతం క్షీణతతో రూ. 187 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి.