ఐడీబీఐ బ్యాంకు ఇస్తున్న రుణాల్లో ప్రతి వంద రూపాయలకూ రూ.28 వరకూ నిరర్థక ఆస్తిగా (ఎన్‌పీఏ) మారిపోతోంది. అంటే తిరిగి చేతికొస్తున్నది 72 రూపాయలే. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇస్తున్న 100 రూపాయల అప్పులో దాదాపు రూ.12.26 వరకూ ఎన్‌పీఏగా మారి... రూ.77.74 మాత్రమే చేతికొస్తోంది. ఈ రెండు బ్యాంకుల మొత్తం ఎన్‌పీఏలెంతో తెలుసా..? అక్షరాలా లక్షా పన్నెండువేల కోట్లపైనే!!.
ఐడీబీఐ నష్టాలు రూ.5,663 కోట్లు
మొండిబాకీలకు భారీ కేటాయింపుల వల్ల ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు మరింతగా పెరిగాయి. క్యూ4లో నికర నష్టాలు రూ.5,663 కోట్లుగా నమోదయ్యాయి. 2016–17 జనవరి–మార్చి మధ్య నష్టాలు రూ.3,120 కోట్లు. తాజా క్యూ4లో బ్యాంకు ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.7,703 కోట్ల నుంచి రూ. 7,914 కోట్లకు చేరింది.
మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) వాటా 21.25 శాతం నుంచి ఏకంగా 27.95 శాతానికి ఎగిసింది. నికర ఎన్‌పీఏలు కూడా 13.21 శాతం నుంచి 16.69 శాతానికి పెరిగాయి. విలువ పరంగా ఎన్‌పీఏలు రూ.55,588 కోట్లు. నాలుగో త్రైమాసికంలో ఎన్‌పీఏల కోసం కేటాయింపులు రూ. 6,054 కోట్ల నుంచి రూ. 10,773 కోట్లకు పెరిగాయి.
ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు షేరు 3 శాతం క్షీణించి రూ. 65.10 వద్ద ముగిసింది.
బీఓబీ నష్టం రూ.3,102 కోట్లు
మొండి బాకీలకు కేటాయింపులు పెరగటంతో నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.3,102 కోట్ల నష్టం ప్రకటించింది. 2016–17 క్యూ4లో రూ.155 కోట్ల లాభం నమోదు చేయటం గమనార్హం. తాజా త్రైమాసికంలో మొండిబాకీల కేటాయింపు ఏకంగా రూ.2,425 కోట్ల నుంచి రూ.7,052 కోట్లకు పెరిగింది.
మొత్తం ఆదాయం రూ. 12,852 కోట్ల నుంచి రూ. 12,735 కోట్లకు తగ్గింది. రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 10.46% నుంచి 12.26 శాతానికి పెరిగింది. విలువపరంగా చూస్తే.. రూ. 42,719 కోట్ల నుంచి రూ. 56,480 కోట్లకు చేరింది. నికర ఎన్‌పీఏలు 4.72% నుంచి 5.49 శాతానికి పెరిగాయి.
శుక్రవారం బీఎస్‌ఈలో బీవోబీ షేరు 1.80 శాతం పెరిగి రూ. 141.20 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment