ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ నష్టం
రెట్టింపైన మొండిబకాయిలు...
ముంబై: మొండి బకాయిలకు భారీ కేటాయింపులు చేయాల్సిరావడంతో ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో భారీనష్టాన్ని చవిచూసింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 1,735 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించగా, తాజా త్రైమాసికంలో ఈ నష్టం రూ. 3,199 కోట్లకు పెరిగిపోయింది.బ్యాంకు మొత్తం ఆదాయం 2.74 శాతం క్షీణతతో రూ. 8,274 కోట్ల నుంచి రూ. 8,048 కోట్లకు తగ్గింది. స్థూల, నికర మొండిబకాయిలు రెట్టింపయ్యాయి. స్థూల ఎన్‌పీఏలు 10.98 శాతం నుంచి 21.25 శాతానికి పెరగ్గా, నికర ఎన్‌పీఏలు 6.78 శాతం నుంచి 13.21 శాతానికి చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపుల్ని బ్యాంకు రూ. 3,331 కోట్ల నుంచి రూ. 4,590 కోట్లకు పెంచింది. పూర్తి సంవత్సరంలో బ్యాంకు నికరనష్టం రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,158 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 31,453 కోట్ల నుంచి రూ. 31,758 కోట్లకు చేరింది. ఫలితాల కారణంగా ఈ షేరు గురువారం 8 శాతం పతనమై రూ. 69 వద్ద ముగిసింది.