మొండిబాకీలపై ఆర్‌బీఐ వాచ్‌లిస్ట్‌లో ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దిశగా రిజర్వ్ బ్యాంక్ చర్యలు మొదలుపెట్టింది. ఎన్‌పీఏలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు విషయంలో సత్వర దిద్దుబాటు చర్యలకు ఆర్‌బీఐ ఉపక్రమించింది. దీంతో కొత్త రుణాలు మంజూరు చేయడం, డివిడెండ్ పంపిణీ తదితర కార్యకలాపాలపై పరిమితులు అమల్లోకి రానున్నాయి. తమ సంస్థలో అధిక ఎన్‌పీఏలు, ఆస్తులపై రాబడులు ప్రతికూలంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్‌బీఐ మే 5న సత్వర దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు ఐడీబీఐ బ్యాంకు వెల్లడించింది.
అయితే, వీటివల్ల బ్యాంకు పనితీరుపై ప్రతికూల ప్రభావమేమీ ఉండదని, సంస్థ కార్యకలాపాలను మెరుగుపర్చుకునేందుకు ఇవి దోహదపడగలవని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 80 శాతం ఎగసి రూ. 35,245 కోట్లకు ఎగియగా, నష్టాలు రూ. 2,255 కోట్ల మేర నమోదయ్యాయి.
రుణ రేట్లు పావుశాతం కోత
ఐడీబీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను మంగళవారం పావుశాతం వరకూ తగ్గించింది. 2016 ఏప్రిల్ నుంచీ తమ తాజా డిపాజిట్లు– రుణాలు– మార్జిన్లు ఆధారంగా దాదాపు నెలకోసారి బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను సవరిస్తున్నాయి.