5,000 కోట్ల ఎన్‌పీఏల విక్రయం | IDBI Bank identifies ₹5000-cr non-core assets for sale | Sakshi
Sakshi News home page

5,000 కోట్ల ఎన్‌పీఏల విక్రయం

Published Fri, Jun 9 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

5,000 కోట్ల ఎన్‌పీఏల విక్రయం

5,000 కోట్ల ఎన్‌పీఏల విక్రయం

2017–18 ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్‌ లక్ష్యమిది
150 మందితో నిరర్ధక ఆస్తుల నిర్వహణ బృందం
ఎన్‌పీఏల్లో తెలుగు రాష్ట్రాలే టాప్‌; వ్యవసాయ, కార్పొరేట్‌ రుణాలే అధికం
ఏపీ, తెలంగాణల్లో ఎన్‌పీఏల రికవరీ కోసం 20 మంది నియామకం
కొన్నాళ్లు కార్పొరేట్‌ రుణాలకు బ్రేక్‌; రిటైల్, ఎస్‌ఎంఈలపై ఫోకస్‌
వచ్చే త్రైమాసికంలో ఈక్విటీ, బాండ్ల అమ్మకంతో రూ.8–9 వేల కోట్ల సమీకరణ
ఐడీబీఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పోతుకూచి సీతారాం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  భారీగా ఎన్‌పీఏల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్‌... నికర నిరర్ధక ఆస్తుల(ఎన్‌పీఏ)S రికవరీపై దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల ఎన్‌పీఏలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో 150 మంది ఉద్యోగులతో కలిసి నిరర్ధక ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్, రిటైల్‌ విభాగాల్లో ప్రతి ఎన్‌పీఏను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వీరి బాధ్యత అని ఐడీబీఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పోతుకూచి సీతారాం చెప్పారు.

2017 మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు రూ.44 వేల కోట్లు కాగా.. ఇందులో నికర ఎన్‌పీఏల విలువ రూ.28 వేల కోట్లు. ఐడీబీఐ బ్యాంక్‌ తెలంగాణ, ఏపీ సీజీఎం దాస్‌గుప్తాతో కలిసి గురువారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘78% ఎన్‌పీఏలు పెద్ద కార్పొరేట్‌ సంస్థలవే. ఈ రుణాల్లో అధికం ఇతర బ్యాంకుల కన్సార్షియం ద్వారా అందించాం. వాటి రికవరీ అంత సులభం కాదు. సాధారణ రికవరీ ప్రక్రియ ద్వారా దీన్ని పరిష్కరించలేం. ఈ వర్గం ఎన్‌పీఏ తగ్గింపు ప్రాథమికంగా ఖాతాల అప్‌గ్రేడ్‌ ద్వారానే అవుతుంది. ఇందుకు మరో ఏడాది సమయం పడుతుంది’’ అని ఆయన వివరించారు.

త్వరలోనే ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌తో ఒప్పందం..
‘‘ఇతర రంగాల మల్లే బ్యాంకింగ్‌ వ్యవస్థలోనూ ఉద్యోగుల ఎంపిక విధానం మారింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో 16 వేల మంది ఉద్యోగులున్నారు. ఇందులో అధికులు 33–35 మధ్య వయస్సు వాళ్లే. ఈ మధ్య కాలంలో పదవీ విరమణలుండవు కాబట్టి కొత్త ఉద్యోగుల ఎంపిక కూడా లేనట్టే. కానీ, డిజిటల్‌ లావాదేవీలు, డిజిటల్‌ అనలిటిక్ట్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో నిపుణులైన ఉద్యోగుల అవసరముంది’’ అని సీతారాం తెలిపారు. డిజిటల్‌లో భాగంగా ఆర్థికS సేవల స్టార్టప్స్, ఎస్‌ఎంఈలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని, ఒకటిరెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకునే దిశగా చర్చలూ జరుగుతున్నాయని చెప్పారాయన.

కార్పొరేట్‌ రుణాలకు బ్రేక్‌..
అధిక కార్పొరేట్‌ రుణాల్లో రిస్క్, ఒత్తిడి ఎక్కువగా ఉందని, అందుకే కొద్దికాలం ఈ విభాగంలో రుణాల మంజూరులో లిమిట్‌ పెట్టి, రిటైల్, ఎస్‌ఎంఈ విభాగాలపై దృష్టిపెట్టామని సీతారామ్‌ వివరించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం (2017–18)లో రూ.13,500 కోట్ల రిటైల్, రూ.6,500 కార్పొరేట్‌ రుణాలందించాం. మొత్తం రుణాల్లో రిటైల్‌ వాటా 43 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 3–4 శాతం మేర పెంచాలనేది లక్ష్యం. ఏప్రిల్‌లో కేంద్రం నుంచి రూ.1,900 కోట్ల నిధులను సమీకరించాం. మరో 3 నెలల్లో ఈక్విటీ, బాండ్ల విక్రయం ద్వారా సుమారు రూ.8–9 వేల కోట్లు సమీకరిస్తాం. త్వరలో అమల్లోకిరానున్న జీఎస్‌టీలో ఉత్తరాదికి చెందిన కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మినహా మిగిలినవన్నీ నమోదు చేశాం. సాఫ్ట్‌వేర్‌ పునరుద్ధరణ కోసం పలువురు వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. జూలై 1 నాటికి జీఎస్‌టీకి సిద్ధంగా ఉంటాం. అయితే పన్ను విధానం, చెల్లింపుల్లో కాసింత గందరగోళంగా ఉంది’’ అని చెప్పారు.

ఏపీ, తెలంగాణల్లోనే ఎన్‌పీఏలెక్కువ..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఎన్‌పీఏల వాటా కాసింత ఎక్కువవని ఇందులోనూ వ్యవసాయ, కార్పొరేట్‌ విభాగంలోనే ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్నాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలంగాణ, ఏపీ సీజీఎం బీ దాస్‌గుప్తా ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌పీఏల రికవరీ కోసం ప్రత్యేకంగా 20 మందిని నియమించుకున్నామని.. రోజూ కరెంట్, సేవింగ్‌ అకౌంట్స్‌ (సీఏఎస్‌ఏ) నివేదికలను సమర్పించడం వీరి బాధ్యతని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కాసింత ఎక్కువగా కనిపించిందని చెప్పారు. ‘‘ఆ సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి నగదును తెప్పించి పరిస్థితిని సర్దుమణిపించాం. వచ్చే 2 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఐడీబీఐ ఏటీఎంలను తిరిగి ప్రారంభిస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement