This is Not a Joke 3 banks given loan to Great Indian Nautanki Company - Sakshi
Sakshi News home page

గ్రేట్‌ ఇండియన్‌ తమాషా కంపెనీకి రూ.146 కోట్ల రుణం

Published Mon, Jun 20 2022 1:54 PM | Last Updated on Mon, Jun 20 2022 2:38 PM

This is not a joke 3 banks given loan to Great Indian Nautanki Company - Sakshi

విజయ్‌మాల్యా, మెహుల్‌ చోక్సీ, నీరవ్‌మోదీలను బ్యాంకులను మోసం చేశారు. దేశానికి ద్రోహం చేశారనే భావన ఇప్పటి వరకు చాలా మందిలో పేరుకు పోయింది. కానీ ఇప్పుడు చెప్పబోయే వివరాలు తెలిస్తే అవాక్కవడం ఖాయం. బ్యాంకులను డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లే ఎంతో నయం అనిపిస్తారు. ఎందుకంటే మన బ్యాంకులు అలా తయారయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ వార్తను మీరు చూడండి.

కంపెనీ పేరు గ్రేట్‌ ఇండియన్‌ నోటంకి కంపెనీ దీన్ని ప్రమోట్‌ చేసిన వ్యక్తులు అనుమోద్‌ శర్మ, విరాఫ్‌ సర్కారీ, సంజయ్‌ చౌధరీలు. ఈ కంపెనీ చేసే వ్యాపారం విస్తరణ కోసం ఐడీబీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంకు ఆఫ్‌ బరోడాల నుంచి భారీ ఎత్తున రుణం తీసుకుంది. గ్యారెంటీగా గ్రేట్‌ ఇండియన్‌ నోటంకి కంపెనీ పలు ఆస్తులను చూపించింది. ఇంతకీ ఈ ఆస్తులు కలిగి ఉన్న కంపెనీ పేరు గ్రేట్‌ ఇండియన్‌ తమాషా కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌

రూ. 147 కోట్లు
గ్రేట్‌ ఇండియన్‌ తమాషా కంపెనీ ఆస్తులను గ్యారెంటీగా ఉంచుకుని బ్యాంకు ఆఫ్‌ బరోడా 2015 ఫిబ్రవరి 13న ఏకంగా రూ.49.23 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదే ఏడాది డిసెంబరు 11న రూ 6.26 కోట్ల రుణం ఇచ్చింది. ఈ రెండు బ్యాంకులకు అసలు, వడ్డీ చెల్లించలేదు ది గ్రేట్‌ ఇండియన్‌ నోటంకి కంపెనీ. దీంతో ఈసారి అప్పు కోసం ఐడీబీఐ బ్యాంకును సంప్రదించాయి. గ్రేట్ ఇండియన్‌ తమాషానే గ్యారెంటీగా చూపుతూ 2021 నవంబరు 25న ఏకంగా రూ.86.48 కోట్ల రుణం పొందింది. 

ఆస్తుల వేలం
తమాషా కంపెనీ తమకు రుణం చెల్లించడం లేదంటూ హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు ఆలస్యంగా గుర్తించగా పెద్ద మొత్తంలో లోను ఇచ్చిన ఐడీబీఐ ఆలస్యంగా గమనించింది. చివరకు తమాషా కంపెనీకి కర్నాటకలో ఉన్న ఆస్తులు వేలం వేస్తామంటూ 2022 మేలో పేపర్‌ ప్రకటన ఇచ్చింది. కర్నాటకలో తమాషా కంపెనీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న 107 ఎకరాలు, ఇతర స్థిర ఆస్తులను వేలం వేసి నష్టాలను పూడ్చుకుంటామంటూ ప్రకటన ఇచ్చాయి. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంకు నుంచి ప్రకటన జారీ అయ్యింది. ఇదే ట్వీట్‌ను హర్షద్‌ మెహతా స్కామ్‌ను వెలికి తీసిన సుచేతా దలాల్‌ రీట్వీట్‌ చేయడంతో ఈ విషయం వైరల్‌ అవుతోంది. 

మోసగాళ్ల వల్లే
కంపెనీ పేర్లు ‘ది గ్రేట్‌ ఇండియన్‌ నోటంకి’ అని గ్యారెంటీగా చూపించిన ఆస్తులు ‘ది గ్రేట్ తమాషా కంపెనీ’ అని నేరుగా కనిపించినా అధికారులు కనీసం బ్యాక్‌ గ్రౌండ్‌ చెక్‌ చేయకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఎలా మంజూరు చేశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నోటంకి, తమాషా లాంటి పదాలు నేరుగా కనిపించినా కళ్లు మూసుకుని రుణాలు ఇచ్చారంటే వీళ్లకు అసలు బుద్ధి ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బ్యాంకు అధికారులు, మోసగాళ్లతో కుమ్మక్కయిన కారణంగానే ఈ తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు మరికొందరు.

మాఫీ చేస్తారు
మెహుల్‌ చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కి రెండువేల కోట్ల రూపాయలు ఎగనామ పెట్టాడు. విజయ్‌మాల్యా ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంకులకు పది వేల కోట్ల రూపాయలకు పైగా బాకీ పడ్డాడు.. ఈ జాబితాలో తమాషా లాంటి కంపెనీలు మరెన్నో ఉన్నాయి. ఇలా పేరుకుపోయిన అప్పులను అప్పుడప్పుడు బ్యాంకులు మాఫీ చేస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహాలో మాఫీ చేసిన అప్పుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలకుపై మాటే. 

చదవండి: రూ.3లకు కక్కుర్తి పడితే.. చివరకు ఏం జరిగిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement