ప్రభుత్వ సంస్థలకు ‘మొండి’ ప్రాజెక్టులు
► వ్యూహరచనలో కేంద్రం
► ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ)అప్పగించే కీలక వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దిశలో బుధవారం బ్యాంకింగ్ యాక్ట్ సవరణకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపిన కేంద్రం, ఇదే క్రమంలో మరింత ముందుకు వెళ్లడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌యూలకు ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను అప్పగించడానికి తగిన నిబంధనల సవరణపై కేంద్రం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో కేబినెట్ సెక్రటేరియట్ వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం చేస్తుంది.
ప్రధాని కీలక సమీక్ష
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గత వారం ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఒక నిర్ధిష్ట రంగం ప్రాజెక్టులను సంబంధిత మంత్రిత్వశాఖకు అప్పగించే వ్యూహంపై కేంద్రం ప్రత్యేకించి దృష్టి పెట్టింది. వివిధ రంగాలకు సంబంధించి భారీ ఎన్‌పీఏలను గుర్తించాలని, ఆయా రంగాల వివరాలను సంబంధిత మంత్రిత్వశాఖలకు తెలియజేయాలని ఇప్పటికే బ్యాంకింగ్‌కు కూడా సంకేతాలు అందాయి. అలాగే ఆయా అంశాలకు సంబంధించి వ్యూహాలను రూపొందించే పనిలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బిజీగా ఉన్నాయి.
పరస్పర ప్రయోజనం లక్ష్యం...
తక్కువ స్థాయి ధర వద్ద... ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టుల కొనుగోలు ప్రభుత్వ రంగ సంస్థలకు లాభదాయక అంశమయితే, ఎన్‌పీఏల భారం తగ్గడం బ్యాంకులకు సానుకూల అంశమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ పరస్పర ప్రయోజన లక్ష్యంగా సమస్య ఎన్‌పీఏల పరిష్కార ప్రణాళికలు రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్‌పీఏలు 2015 మార్చిలో రూ.2.67 లక్షల కోట్లు ఉంటే,, 2016 మార్చి నాటికి ఈ మొత్తం రూ.5.02 లక్షలకోట్లకు పెరగడంతో దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌పీఏల పరిష్కారం దిశలో ఆర్‌బీఐకి కీలక అధికారాలను అప్పగించే నిర్ణయాలను బుధవారం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు ప్రత్యేకించి బ్యాంకింగ్ చట్ట సవరణలు ఎన్‌పీఏల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయని ఫైనాన్స్ కార్యదర్శి అశోక్ లవాసా గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు.