మొండి బకాయిలపై ఆర్‌బీఐ అస్త్రం | More power to RBI to address NPA issues: Arun Jaitley | Sakshi
Sakshi News home page

మొండి బకాయిలపై ఆర్‌బీఐ అస్త్రం

Published Fri, May 5 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

మొండి బకాయిలపై  ఆర్‌బీఐ అస్త్రం

మొండి బకాయిలపై ఆర్‌బీఐ అస్త్రం

బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
► ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు నియంత్రణ
► ఎన్‌పీఏల పరిష్కారంలో కీలక అడుగు
► ఎగవేతదారులపై విస్తృత చర్యలు చేపట్టే అధికారం


న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏల) సమస్య పరిష్కారం దిశగా ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఎన్‌పీఏల వసూలుకు సంబంధించి బ్యాంకులను ఆర్‌బీఐ ఇక నేరుగా ఆదేశించగలదు. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్‌ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర కేబినెట్‌ బుధవారం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్‌ రంగాన్ని భారీగా ప్రక్షాళన చేసేందుకు తాజా ఆదేశాలు దోహదపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా ఆర్డినెన్స్‌తో ‘‘రుణ ఎగవేత దారుల విషయంలో ‘ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్రప్టసీ కోడ్‌ 2016’ నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్‌బీఐ ఆదేశించగలదు’’ అని శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు అసాధారణంగా రూ.6 లక్షల కోట్లకుపైగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలను చేపట్టడం గమనార్హం. మొత్తం దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో 2016 డిసెంబర్‌ నాటికి ఎన్‌పీఏలు రూ.7లక్షల కోట్లను దాటాయి. విద్యుత్తు, స్టీల్, మౌలిక సదుపాయాలు, టెక్స్‌టైల్స్‌ రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా ఎన్‌పీఏలుగా మారాయి.

ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు సూచనలు ఇచ్చేందుకు ఒకటికి మించిన యంత్రాంగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్‌బీఐకి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్‌పీఏలు అసాధారణ స్థాయికి చేరాయని, సమస్య పరిష్కరానికి సత్వర చర్యలు అవసరమని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో  చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లో కొత్తగా సెక్షన్‌ 35ఏఏ, 35ఏబీలను చోటు కల్పించనుంది.

చట్ట సవరణ ఉద్దేశాలు
♦ భారీ రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్‌బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు తాజా రుణాలు ఇక లభించడం కష్టమే. వారిపై నిషేధం విధించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరవచ్చు. అంతేకాదు, రుణ ఎగవేతదారులను కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించుకోవడం కూడా ఇకపై కుదరదు.
♦ రంగాల వారీగా పర్యవేక్షణ కమిటీలను నియమించే అధికారం ఆర్‌బీఐకి ఇచ్చారు. ఒత్తిడిలో ఉన్న రుణాల వసూలుకు పరిష్కారాలు సూచించేందుకు కమిటీలు లేదా అధికారులను కూడా నియమించగలదు.
♦  మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాం కర్లు తీసుకునే నిర్ణయాల విషయంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, సీబీఐ, కాగ్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకర్లకు కొత్త చట్టం రక్షణ కల్పి స్తోంది. దర్యాప్తు సంస్థల విచారణ భయాలతో బ్యాంకర్లు.. ఎన్‌పీఏల పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. తాజా ఆర్డినెన్స్‌తో ఆ భయాలు తొలగుతాయి.
♦  ఒత్తిడిలో ఉన్న రుణాల విషయమై పరిష్కారానికి గాను ఆర్‌బీఐ సమయానుకూలంగా మార్గదర్శకాలు జారీ చేయగలదు. దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించగలదు.
♦ మొండి బకాయిల ఖాతాల విషయంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మరింత నియంత్రణ లభిస్తుంది.
♦ హెయిర్‌ కట్‌ (ఇచ్చిన రుణంలో బ్యాంకు నష్టపోయేందుకు అంగీకరించే మొత్తం) విషయంలో కేసును బట్టి పరిష్కారం సూచించే అధికారం ఆర్‌బీఐకి లభించింది.  అవసరమైతే మార్గదర్శకాల్లోనూ వెసులుబాటు ఇవ్వగలదు.
♦  కొత్త చట్టంతో రుణ ఎగవేతదారులను కంపెనీల యాజమాన్యం, ఓటింగ్‌ హక్కుల నుంచి తప్పుకోవాలని బ్యాంకులు ఆదేశించగలవు. వారి స్థానంలో కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి నిర్దేశిత కాలంలోగా పునరుద్ధరణ బాట పట్టించే చర్యలు చేపట్టొచ్చు.
♦ తాజా చట్టానికి అనుగుణంగా  రెండు వారాల్లో ఆర్‌బీఐ ఎన్‌పీఏలకు సంబంధించి తగిన చర్యల్ని నోటిఫై చేసే అవకాశం ఉంది. ఆర్‌బీఐ తొలుత 50 భారీ రుణ ఎగవేత కేసులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పరిష్కరించడంపై దృష్టి సారించనున్నట్టు సమాచారం.

ప్రస్తుత స్థితి ఇక ఎంత మాత్రం కొనసాగరాదు: జైట్లీ
బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి చేసిన సవరణలతో బ్యాంకులు వేగంగా నిర్ణయాలు తీసుకోగలవని, దాంతో ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో త్వరగా పరిష్కారాలు లభించగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ‘‘ఈ చట్టం యొక్క లక్ష్యం ప్రస్తుతమున్న యాథాతథ స్థితి (ఎన్‌పీఏలకు సంబంధించి) కొనసాగకూడదన్నదే. స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో అచేతనం చేయడమన్నది ఆర్థిక రంగానికి హానికరం. కనుక దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని జైట్లీ పేర్కొన్నారు.

ఎన్‌పీఏలుగా మారిన రుణాలను గుర్తించి సత్వర పరిష్కారాలను కనుగొనేందుకు ఆర్‌బీఐకి అధికారాలు కల్పించినట్టు జైట్లీ చెప్పారు. ఒత్తిడిలో ఉన్న రుణాల జాబితా ఇప్పటికే ఆర్‌బీఐ ముందుకు చేరింద ని, దాన్ని పరిశీలించి చర్యలు చేపడుతుందన్నారు. ఆస్తులను విక్రయించడం, లాభసాటిగా లేని బ్యాంకు శాఖలను మూసివేయడం, వ్యాపార పునర్వవ్యస్థీకరణ చర్యలు చేపట్టడం వంటివి కూడా పరిష్కారాల్లో భాగంగా ఉంటాయని స్పష్టం చేశారు.

మంచి చర్యే: బ్యాంకర్లు
ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం
బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు... దివాళా బాంక్రప్టసీ కోడ్, సర్ఫేసీ, రుణ రికవరీ ట్రిబ్యునల్‌ చట్టాలకు సవరణలు ఇవన్నీ కూడా ఎన్‌పీల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ బలమైన నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆర్‌బీఐకి అధికారాలు ఇవ్వడం సమస్యకు ప్రభావవంతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. బ్యాంకులు సత్వరమే ఈ నిబంధనల ఆసరాతో ప్రయోజనాలను అందుకోవాలి.
– అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్‌

పూర్తి పరిష్కారానికి సమయం
ఎన్‌పీఏలకు పరిష్కారానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టం పెద్ద అడుగు. పరిష్కార ప్రక్రియకు వెంటనే మొదలయ్యేలా చేస్తుంది. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి సమయం తీసుకుంటుంది. అయితే, పరిష్కారం కోసం ఓ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ మార్గంలో సాగిపోతే పురోగతి ఉంటుంది. – చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్‌

ఆర్‌బీఐ మరింత జోక్యం ఎందుకు: రేటింగ్‌ ఏజెన్సీలు
ఎన్‌పీఏల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో క్షేత్ర స్థాయిలో ఫలితం చూపించడానికి సమయం పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. వాణిజ్య బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో మరింత సునిశిత పరిశీలనకు ఆర్‌బీఐను అనుమతించడాన్ని ప్రశ్నించాయి. ఎన్‌పీఏల పరిష్కారం విషయంలో ఇప్పటి వరకూ నెలకొన్న ఉదాసీనతను తాజా ఆర్డినెన్స్‌ పరిష్కరించాల్సి ఉందని ఇండియా రేటింగ్‌ ఏజెన్సీ పేర్కొంది. వాణిజ్య రుణాల జారీ విషయంలో నియంత్రణ సంస్థ జోక్యానికి అవకాశం కల్పించడాన్ని వాటి సమర్థ నిర్వహణ విషయంలో ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందని తెలిపింది. క్రిసిల్‌ మాత్రం సానుకూలమని వ్యాఖ్యానించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement