Banking Regulation Act
-
జేపీ మోర్గాన్ చేతికి ఫస్ట్ రిపబ్లిక్
న్యూయార్క్: ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో తలెత్తిన సంక్షోభం మొత్తం వ్యవస్థకు వ్యాపించకుండా చూసేందుకు అమెరికా బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, అసెట్లలో చాలా మటుకు భాగాన్ని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌నకు విక్రయించాయి. అమెరికా చరిత్రలో ఓ భారీ స్థాయి బ్యాంకు విఫలం కావడం ఇది రెండోసారి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో వాషింగ్టన్ మ్యూచువల్ కుప్పకూలింది. ప్రస్తుత ఫస్ట్ రిపబ్లిక్ తరహాలోనే అప్పట్లో వాషింగ్టన్ మ్యూచువల్‌ను కూడా జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంకే టేకోవర్ చేసింది. సోమవారం నుంచి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 84 శాఖలు .. జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్ బ్రాంచీలుగా పనిచేయడం ప్రారంభమవుతుందని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది. ఏప్రిల్ 13 గణాంకాల ప్రకారం ఫస్ట్ రిపబ్లిక్కు 229 బిలియన్ డాలర్ల అసెట్లు, 104 బిలియన్ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. పరిమాణం ప్రకారం అమెరికన్ బ్యాంకుల్లో 14వ స్థానంలో ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సమస్య పరిష్కారానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల భారం పడగా, ఫస్ట్ రిపబ్లిక్పరంగా మరో 13 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడవచ్చని ఎఫ్‌డీఐసీ అంచనా వేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు సంక్షోభంలో చిక్కుకున్న ప్రభావంతో మార్చి నుంచి ఫస్ట్ రిపబ్లిక్ సైతం సవాళ్లు ఎదుర్కొంటోంది. తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువగా రుణాలివ్వడం, అధిక శాతం డిపాజిట్లకు బీమా భద్రత లేకపోవడం వంటి అంశాల కారణంగా బ్యాంకుపై డిపాజిటర్లలో నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా బిలియన్ల కొద్దీ డాలర్ల విత్‌డ్రాయల్స్ వెల్లువెత్తాయి. ఒక దశలో ఫస్ట్ రిపబ్లిక్కి సహాయం చేసేందుకు ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత వారాంతంలో భేటీ అయిన అమెరికా నియంత్రణ సంస్థలు పరిష్కార మార్గాన్ని అమలు చేశాయి. -
కోపరేటివ్ సోసైటీలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తామంటే కుదరదు
ముంబై: సహకార సంఘాలు తమ పేర్లలో ‘బ్యాంక్’ ను జోడించుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం స్పష్టం చేసింది. తమ పేర్లలో ‘బ్యాంక్’ను తగిలించుకోవడం, సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడే సహకార సొసైటీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 29 నుంచీ అమలులోకి వచ్చిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ 1949 సవరణ చట్టం ప్రకారం సహకార సంఘాలు తమ పేర్లలో భాగంగా ‘బ్యాంక్‘, ‘బ్యాంకర్‘ లేదా ‘బ్యాంకింగ్‘ అనే పదాలను నిబంధనల ఉల్లంఘించి వినియోగించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్ట నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సహకార బ్యాంకులు తమ పేర్లలో ‘బ్యాంక్’ పదాన్ని జోడించుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటన తెలిపింది. సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు సేకరించవద్దు.. కొన్ని సహకార సంఘాలు సభ్యులు కానివారు/ నామమాత్రపు సభ్యులు/ అసోసియేట్ సభ్యుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నాయని పేర్కొన్న ఆర్బీఐ, ఇది నిబంధనలను ఉల్లంఘించి బ్యాంకింగ్ వ్యాపారం చేయడంతో సమానమని స్పష్టం చేసింది. సహకార సొసైటీలకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఎటువంటి లైసెన్స్‌లు జారీ కాలేదని, వాటికి బ్యాంకింగ్ వ్యాపారం చేయడానికి ద్వారా అధికారం లేదని పేర్కొంది. ఈ సొసైటీలలో ఉంచిన డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్– క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుండి బీమా రక్షణ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఏదైనా సొసైటీ ‘బ్యాంక్’ అని క్లెయిమ్ చేసుకుంటే, అటువంటి సహకార సంఘాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆయా సొసైటీలతో లావాదేవీలు నిర్వహించే ముందు ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకింగ్ లైసెన్స్ ఏమిటన్నది పరిశీలించాలని కూడా సూచించింది. ఆ తరహా సొసైటీల కార్యకలాపాలను తన దృష్టికి తీసుకురావాలని పేర్కొంది. -
సహకార బ్యాంకింగ్ ‘విలీనాల్లో’ ముందడుగు
ముంబై: వివిధ షరతులకు లోబడి రాష్ట్ర సహకార బ్యాంకుతో (ఎస్టీసీబీ) జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) విలీనాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా రావాలన్నది ఈ షరతుల్లో ఒకటి. ఎస్టీసీబీ, డీసీసీబీల విలీనానికి ఉద్దేశించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 గత నెల (ఏప్రిల్) 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా నోటిఫై అయిన సంగతి తెలిసిందే. విలీన నేపథ్యం... సహకార బ్యాంకులు ప్రధానంగా మూడు అంచెల్లో పనిచేస్తాయి. ఇందులో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. జిల్లా స్థాయిలో సహకార కేంద్ర బ్యాంక్ పనిచేస్తుంది (దీని తరఫున మండల కేంద్రాల్లో బ్రాంచీలు పనిచేస్తాయి) మూడవ స్థాయి రాష్ట్ర సహకార బ్యాంక్. రైతుకు వడ్డీ భారం తగ్గించాలన్న ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర స్థాయి సహకార బ్యాంకులో జిల్లా స్థాయి సహకార బ్యాంకుల విలీన నిర్ణయం జరిగింది. తద్వారా రెండంచెల సహకార బ్యాంక్ వ్యవస్థకు మార్గం సుగమం అయ్యింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 ప్రకారం ఇందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా ఆర్బీఐని సంప్రదించాలి. రెండంచెల సహకార వ్యవస్థకు (షార్ట్–టర్మ్ కో–ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్) పలు రాష్ట్రాలు ఆర్బీఐని సంప్రదిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనల్లో ముఖ్యాంశాలు ► రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుని ‘న్యాయ, ద్రవ్యపరమైన అంశాలపై’ సమగ్ర అధ్యయనం అనంతరం ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ► అదనపు మూలధనం సమకూర్చడం, అవసరమైతే ద్రవ్య పరమైన మద్దతు, లాభదాయకతతో కూడిన వ్యాపార నమూనా, పాలనా పరమైన నమూనా వంటి అంశాలు విలీన అంశ పరిశీలనలో ప్రధానంగా ఉంటాయి. ► విలీన పథకానికి మెజారిటీ వాటాదారుల మద్దతు అవసరం. ► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) కూడా పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. నాబార్డ్‌తో తగిన సంప్రదింపుల అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. ► విలీనానికి సంబంధించి నికర విలువ ఆధారంగా షేర్ల మార్పిడి రేషియో విషయంలో కొన్ని డీసీసీబీ షేర్హోల్డర్లకు ఎటువంటి షేర్లనూ కేటాయించలేని పరిస్థితి ఉంటే, అటువంటి డీసీసీబీలకు ప్రభుత్వం తగిన మూలధనం సమకూర్చాలి. తద్వారా షేర్హోల్డర్లకు కనీసం ఒక షేర్ చొప్పున కేటాయింపు జరగాలి. -
‘కార్పొరేట్’ బ్యాంకులకు సై..!
ముంబై: దేశంలో అంబానీ, అదానీ వంటి దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది. స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ ఒకటి ప్రతిపాదించింది. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేయాలని సూచించింది. పటిష్ట నిఘా ఇక్కడ కీలకాంశమని స్పష్టం చేసింది. అంతర్గతంగా గ్రూప్ సంస్థలకు రుణాలు, పరస్పర ప్రయోజనాలకు విఘాతాలు వంటి పలు అంశాల నేపథ్యంలో ఒక భారీ స్థాయి కార్పొరేట్ సంస్థకు పూర్తిస్థాయి బ్యాంకింగ్ లైసెన్సు మంజూరు చేయడానికి ఆర్బీఐ ఇప్పటివరకూ వెనకడుగు వేస్తూ వస్తోంది. ఈ అడ్డంకులు తొలగాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ యాక్ట్‌కు సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాను ప్రస్తుత 15% నుంచి 26%కి పెంచవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు 15 సంవత్సరాల కాల వ్యవధిని సూచించింది. దీనివల్ల పెయిడ్ అప్ క్యాపిటల్‌కు సంబంధించి ఓటింగ్ హక్కులు పెరుగుతాయి. భారత ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించి కార్పొరేట్ నిర్మాణం, యాజమాన్య మార్గదర్శకాల సమీ క్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. బ్యాంకులుగా పెద్ద ఎన్బీఎఫ్సీలు: రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 ఏళ్లకు పైగా చక్కటి నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులుగా మార్చే అంశాన్ని పరిశీలించవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ సూచించింది. కార్పొరేట్లు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలకూ దీన్ని వర్తింపజేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై ఎన్‌బీఎఫ్‌సీలకు మరికొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించాలని సిఫారసు చేసింది. ఆదిత్య బిర్లా, బజాజ్, మహీంద్రా, టాటా గ్రూపులు ఇప్పటికే దశాబ్దానికి పైగా ఎన్బీఎఫ్సీలను నిర్వహిస్తున్నాయి. నిజానికి దేశంలో మధ్య మధ్య స్థాయి బ్యాంకులకన్నా ఈ ఎన్బీఎఫ్సీలు పెద్దవి కావడం గమనార్హం. కనీస ప్రారంభ మూలధనం పెంపు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కనీస ప్రారంభ మూలధన్నాన్ని పెంచాలని ఆర్బీఐ కమిటీ సూచించింది. బ్యాంకుల విషయంలో ఈ మొత్తాలను రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు... అలాగే చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచాలని పేర్కొంది. పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకింగ్ వాటా... మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో ప్రైవేటు రంగం వాటా గణనీయంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 2000లో మొత్తం బిజినెస్‌లో ప్రైవేటు రంగం వాటా డిపాజిట్లకు సంబంధించి 12.63 శాతం ఉంటే, రుణాల విషయంలో ఈ రేటు 12.56 శాతంగా ఉండేదని వివరించింది. 2020లో ఈ శాతాలు వరుసగా 30.35 శాతం, 36.04 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులకు కోల్పోతున్నాయని తెలిపింది. మొండిబకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న ప్రభుత్వ రంగ బ్యాలెన్స్ షీట్లే దీనికి కారణమని నివేదిక వివరించింది. ప్రైవేటు రంగానికి మూలధనం కూడా పెద్ద సమస్యగా ఉండడం లేదని తెలిపింది. గడచిన ఐదేళ్లలో మార్కెట్ నుంచి ప్రైవేటు బ్యాంకులు రూ.1,15,328 కోట్లు సమీకరించగలిగితే, ప్రభుత్వ బ్యాంకుల విషయంలో ఈ మొత్తం రూ.70,823 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇందుకు అదనంగా ప్రభుత్వం నుంచి రూ.3,18,997 కోట్ల మూలధనం అందినట్లు వివరించింది. బ్యాంకింగ్ రంగంలో మార్పు! మొత్తంగా పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రూ.10 లక్షల కోట్లకుపైగా బ్యాలెన్స్ షీట్ల పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆరేడు బ్యాంకులతో విలీనం అయ్యాయి. దీనికితోడు ఇప్పటికే 3–4 బడా ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్బీఐ బడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడమో లేక, వాటి ఎన్బీఎఫ్సీలను పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చడమో చేస్తే అవి మరింత పోటీని ఇస్తాయి. దేశంలో పలు మధ్య తరహా బ్యాంకులకన్నా పెద్దవిగా మారతాయి. పెద్ద ఎన్బీఎఫ్సీల్లో ఏదైనా ఆర్థిక సమస్యలు తలెత్తితే అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రభావం పడుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం, ఆర్బీఐ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) వంటి సంస్థలు దివాలా తీయడం తెలిసిందే. -
ఇకపై ఆర్బీఐ పర్యవేక్షణలో సహకార బ్యాంకులు
ఢిల్లీ : బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుల నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 24న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1540 సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకులతోపాటు 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాకులు ఉన్నాయి. దీంతో కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకువచ్చే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫ్రిబవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ, కరోనా కేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దీంతో తాజాగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం సహకార బ్యాంకులకు కూడా బ్యాంకింగ్ రెగ్యలేషన్ యాక్ట్, 1949 వర్తించే విధంగా సవరణలు చేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి సహకార బ్యాంకులను మరింత బలోపేతం చేయనుంది. ఇతర బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లో పాలన, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు బ్యాంకింగ్ నియంత్రణ కోసం ఆర్బీఐతో ఇప్పటికే అందుబాటులో ఉన్న అధికారాలను ఈ ఆర్డినెన్స్ మరింత విస్తరించనుంది. అయితే ఈ సవరణలు రాష్ట్ర సహకార చట్టాల కింద ఉన్న సహకార సంఘాల రాష్ట్ర రిజిస్ట్రార్లతో పాటు ప్రాథమిక వ్యయసాయ క్రెడిట్ సొసైటీలకు(పీఏసీఎస్) వర్తించదు. బ్యాంకింగ్ రెగ్యలేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 45 ప్రకారం బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూడాలి. ప్రజల ఆసక్తి , డిపాజిటర్లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడటానికి చర్చలు పాటు ఎలాంటి మారిటోరియం లేకుండా బ్యాంకింగ్ పునర్నిర్మాణం లేదా సమ్మేళనం కోసం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. (ఆర్డినెన్స్ గెజిట్ నోటిఫికేషన్ కొరకు) -
ఐదు బ్యాంకులపై రూ. 10 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్– ఆర్బీఐ ఐదు బ్యాంకులపై రూ.10 కోట్ల జరిమానా విధించింది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నోస్ట్రో ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంవల్ల ఆర్బీఐ అలహాబాద్ బ్యాంక్‌పై జరిమానా విధించింది. ఒక బ్యాంక్ వేరే బ్యాంక్‌లో విదేశీ కరెన్సీలో నిర్వహించే ఖాతాను నోస్ట్రో ఖాతాగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ మెసేజింగ్ సాఫ్ట్వేర్..స్విఫ్ట్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకుగాను ఈ రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ చెరో కోటి రూపాయలు జరిమానా విధించింది. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం ► ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు నియంత్రణ ► ఎన్పీఏల పరిష్కారంలో కీలక అడుగు ► ఎగవేతదారులపై విస్తృత చర్యలు చేపట్టే అధికారం న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్య పరిష్కారం దిశగా ఆర్బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఎన్పీఏల వసూలుకు సంబంధించి బ్యాంకులను ఆర్బీఐ ఇక నేరుగా ఆదేశించగలదు. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగాన్ని భారీగా ప్రక్షాళన చేసేందుకు తాజా ఆదేశాలు దోహదపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఆర్డినెన్స్‌తో ‘‘రుణ ఎగవేత దారుల విషయంలో ‘ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ కోడ్ 2016’ నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్బీఐ ఆదేశించగలదు’’ అని శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు అసాధారణంగా రూ.6 లక్షల కోట్లకుపైగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలను చేపట్టడం గమనార్హం. మొత్తం దేశీయ బ్యాంకింగ్ రంగంలో 2016 డిసెంబర్ నాటికి ఎన్పీఏలు రూ.7లక్షల కోట్లను దాటాయి. విద్యుత్తు, స్టీల్, మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా ఎన్పీఏలుగా మారాయి. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు సూచనలు ఇచ్చేందుకు ఒకటికి మించిన యంత్రాంగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్బీఐకి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్పీఏలు అసాధారణ స్థాయికి చేరాయని, సమస్య పరిష్కరానికి సత్వర చర్యలు అవసరమని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లో కొత్తగా సెక్షన్ 35ఏఏ, 35ఏబీలను చోటు కల్పించనుంది. చట్ట సవరణ ఉద్దేశాలు ♦ భారీ రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు తాజా రుణాలు ఇక లభించడం కష్టమే. వారిపై నిషేధం విధించాలని బ్యాంకులను ఆర్బీఐ కోరవచ్చు. అంతేకాదు, రుణ ఎగవేతదారులను కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించుకోవడం కూడా ఇకపై కుదరదు. ♦ రంగాల వారీగా పర్యవేక్షణ కమిటీలను నియమించే అధికారం ఆర్బీఐకి ఇచ్చారు. ఒత్తిడిలో ఉన్న రుణాల వసూలుకు పరిష్కారాలు సూచించేందుకు కమిటీలు లేదా అధికారులను కూడా నియమించగలదు. ♦ మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాం కర్లు తీసుకునే నిర్ణయాల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, కాగ్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకర్లకు కొత్త చట్టం రక్షణ కల్పి స్తోంది. దర్యాప్తు సంస్థల విచారణ భయాలతో బ్యాంకర్లు.. ఎన్పీఏల పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. తాజా ఆర్డినెన్స్‌తో ఆ భయాలు తొలగుతాయి. ♦ ఒత్తిడిలో ఉన్న రుణాల విషయమై పరిష్కారానికి గాను ఆర్బీఐ సమయానుకూలంగా మార్గదర్శకాలు జారీ చేయగలదు. దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించగలదు. ♦ మొండి బకాయిల ఖాతాల విషయంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మరింత నియంత్రణ లభిస్తుంది. ♦ హెయిర్ కట్ (ఇచ్చిన రుణంలో బ్యాంకు నష్టపోయేందుకు అంగీకరించే మొత్తం) విషయంలో కేసును బట్టి పరిష్కారం సూచించే అధికారం ఆర్బీఐకి లభించింది. అవసరమైతే మార్గదర్శకాల్లోనూ వెసులుబాటు ఇవ్వగలదు. ♦ కొత్త చట్టంతో రుణ ఎగవేతదారులను కంపెనీల యాజమాన్యం, ఓటింగ్ హక్కుల నుంచి తప్పుకోవాలని బ్యాంకులు ఆదేశించగలవు. వారి స్థానంలో కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి నిర్దేశిత కాలంలోగా పునరుద్ధరణ బాట పట్టించే చర్యలు చేపట్టొచ్చు. ♦ తాజా చట్టానికి అనుగుణంగా రెండు వారాల్లో ఆర్బీఐ ఎన్పీఏలకు సంబంధించి తగిన చర్యల్ని నోటిఫై చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ తొలుత 50 భారీ రుణ ఎగవేత కేసులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పరిష్కరించడంపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ప్రస్తుత స్థితి ఇక ఎంత మాత్రం కొనసాగరాదు: జైట్లీ బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి చేసిన సవరణలతో బ్యాంకులు వేగంగా నిర్ణయాలు తీసుకోగలవని, దాంతో ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో త్వరగా పరిష్కారాలు లభించగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ‘‘ఈ చట్టం యొక్క లక్ష్యం ప్రస్తుతమున్న యాథాతథ స్థితి (ఎన్పీఏలకు సంబంధించి) కొనసాగకూడదన్నదే. స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో అచేతనం చేయడమన్నది ఆర్థిక రంగానికి హానికరం. కనుక దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎన్పీఏలుగా మారిన రుణాలను గుర్తించి సత్వర పరిష్కారాలను కనుగొనేందుకు ఆర్బీఐకి అధికారాలు కల్పించినట్టు జైట్లీ చెప్పారు. ఒత్తిడిలో ఉన్న రుణాల జాబితా ఇప్పటికే ఆర్బీఐ ముందుకు చేరింద ని, దాన్ని పరిశీలించి చర్యలు చేపడుతుందన్నారు. ఆస్తులను విక్రయించడం, లాభసాటిగా లేని బ్యాంకు శాఖలను మూసివేయడం, వ్యాపార పునర్వవ్యస్థీకరణ చర్యలు చేపట్టడం వంటివి కూడా పరిష్కారాల్లో భాగంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంచి చర్యే: బ్యాంకర్లు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు... దివాళా బాంక్రప్టసీ కోడ్, సర్ఫేసీ, రుణ రికవరీ ట్రిబ్యునల్ చట్టాలకు సవరణలు ఇవన్నీ కూడా ఎన్‌పీల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ బలమైన నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆర్బీఐకి అధికారాలు ఇవ్వడం సమస్యకు ప్రభావవంతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. బ్యాంకులు సత్వరమే ఈ నిబంధనల ఆసరాతో ప్రయోజనాలను అందుకోవాలి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ పూర్తి పరిష్కారానికి సమయం ఎన్పీఏలకు పరిష్కారానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టం పెద్ద అడుగు. పరిష్కార ప్రక్రియకు వెంటనే మొదలయ్యేలా చేస్తుంది. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి సమయం తీసుకుంటుంది. అయితే, పరిష్కారం కోసం ఓ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ మార్గంలో సాగిపోతే పురోగతి ఉంటుంది. – చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆర్బీఐ మరింత జోక్యం ఎందుకు: రేటింగ్ ఏజెన్సీలు ఎన్పీఏల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో క్షేత్ర స్థాయిలో ఫలితం చూపించడానికి సమయం పడుతుందని రేటింగ్ ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. వాణిజ్య బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో మరింత సునిశిత పరిశీలనకు ఆర్బీఐను అనుమతించడాన్ని ప్రశ్నించాయి. ఎన్పీఏల పరిష్కారం విషయంలో ఇప్పటి వరకూ నెలకొన్న ఉదాసీనతను తాజా ఆర్డినెన్స్ పరిష్కరించాల్సి ఉందని ఇండియా రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. వాణిజ్య రుణాల జారీ విషయంలో నియంత్రణ సంస్థ జోక్యానికి అవకాశం కల్పించడాన్ని వాటి సమర్థ నిర్వహణ విషయంలో ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందని తెలిపింది. క్రిసిల్ మాత్రం సానుకూలమని వ్యాఖ్యానించింది. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం