మొండిబకాయిల వసూలుకు బ్యాంకుల చర్యలు: జైట్లీ
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిలు(ఎన్‌పీఏ) భారీగా పెరగడం ఆందోళనకలిగిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల నుంచి బకాయిల వసూళ్ల కోసం బ్యాంకులు చట్టప్రకారం పలు చర్యలు చేపడుతున్నాయని శుక్రవారం పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లో పేర్కొన్నారు. సాధారణంగా బ్యాంకులకు తమ మొత్తం రుణాల్లో 2-3 శాతం ఎన్‌పీఏలు ఉంటుంటాయని.. అయితే, గడిచిన రెండుమూడేళ్లలో ఇవి భారీగా ఎగబాకి 6 శాతానికి చేరినట్లు ఆయన తెలిపారు.
కాగా, వేల కోట్ల రూపాయలు రుణాలను ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్ ప్రమోటర్లపై ఏవిధమైన చర్యలు తీసుకున్నారన్న సభ్యుల ప్రశ్నకు.. వాళ్లను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ప్రకటించడం, తనఖాపెట్టిన ఆస్తుల వేలం, భవిష్యత్తులో రుణాలు, ఏవిధమైన నిధుల సమీకరణ జరపకుండా నిషేధం విధించడం వంటి చర్యలను బ్యాంకులు తీసుకున్నాయని జైట్లీ వెల్లడించారు. కాగా, చిట్‌ఫండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కంపెనీల భరతం పట్టేందుకు ఇటీవలే సెబీ చట్టాన్ని సవరించామని.. మరిన్ని అధికారాలను కల్పించినట్లు చెప్పారు.
కరెన్సీ నోట్లపై ఇతర నేతల ఫొటోలకు ఆర్‌బీఐ కమిటీ నో...
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ మినహా ఇతర జాతీయ నేతల ఫొటోలను చేర్చే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కమిటీ తిరస్కరిందని లోక్‌సభలో జైట్లీ రాతపూర్వక సమాధానంలో చెప్పారు. భవిష్యత్తు కరెన్సీ నోట్ల డిజైనింగ్ కోసం ప్రభుత్వ సూచన మేరకు 2010 అక్టోబర్‌లో ఆర్‌బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. కొత్త డిజైన్‌లో ఇతర జాతీయ నాయకుల ఫోటోలను గాంధీ స్థానంలో చేర్చాలన్న ప్రతిపాదనలను పరిశీలించిన కమిటీ.. దీనికి నిరాకరించిందన్నారు. భారతదేశ విలువలు, సంస్కృతిని ప్రతిబింబించడంలో గాంధీ స్థాయి నేతలెవరూలేరని కమిటీ అభిప్రాయపడినట్లు జైట్లీ పేర్కొన్నారు.