మరోసారి కరెన్సీ బ్యాన్?
మరోసారి కరెన్సీ బ్యాన్?
Published Wed, Jul 26 2017 4:44 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
రూ.2000 నోట్ల రద్దుపై ఊహాగానాలు
మరోసారి నోట్ల రద్దును కేంద్రప్రభుత్వం చేపట్టబోతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రూ.2000 నోట్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు చాలామంది నుంచి అభిప్రాయాలు వెల్లువెత్తుతుండటంతో, ఈ విషయం పార్లమెంట్ వరకు వెళ్లింది. కొత్త రూ.2000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించారా? అంటూ విపక్షాలు సైతం బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రశ్నలు సంధించాయి. కానీ ఆయన మాత్రం ఎలాంటి స్పందన లేకుండా, కనీసం దీనిపై ఓ క్లారిటీ కూడా ఇవ్వలేదు. అంటే మరోసారి కేంద్రప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టడానికి సిద్దమవుతుందని టాక్.
ఇటీవల రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆపివేసింది. అసలు కొత్త రూ.2000 నోట్లు బ్యాంకులకు కొత్తగా ఏమీ తీసుకురావడం లేదు. చలామణిలో ఉన్న నోట్లే బ్యాంకుల వద్దకు వస్తున్నట్టు బ్యాంకు అధికారులు సైతం చెబుతున్నారు. అంతేకాక రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ ఆపివేసిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐదు నెలల క్రితం నుంచే ఈ ప్రింటింగ్‌ను ఆపివేసిందట. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక కొత్త రూ.2000 నోట్లను ముద్రించడకూడదని కూడా నిర్ణయించిందట. రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసి, కొత్తగా రూ.200 నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేస్తుందని తెలిపాయి. దీంతో మరో రౌండ్ డీమానిటైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టబోతుందని వార్తలు వస్తున్నాయి.
రూ.200 నోట్లను చలామణిలోకి తెస్తుండటంతో పాటు, కొత్త రూ.500 నోట్లు మార్కెట్‌లో లభ్యమవుతుండటంతో రూ.2000 నోట్లు రద్దు చేసిన అంత పెద్ద ప్రభావమేమీ ఉండదని తెలుస్తోంది. ఈ ప్రభావం బ్లాక్‌మనీ రూపంలో రూ.2000 నోట్లను కలిగి ఉన్నవారికే ఎక్కువ ప్రమాదమని పలువురంటున్నారు. నవంబర్ నెల మొదట్లో ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు రూ.1000, రూ.500 అన్నీ నిరూపయోగంగా మారిపోయాయి. ఈ రద్దు అనంతరం కొత్తగా రూ.2000 నోట్లను ఆర్బీఐ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఎక్కువగా రూ.2000 నోట్లనే ఆర్బీఐ చలామణిలోకి తేవడంతో, చిన్న నోట్ల సమస్య ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. ఈ ఇక్కట్లను తీర్చడానికి ఆర్బీఐ కొత్త రూ.200 నోట్లు తీసుకొస్తోంది.
Advertisement