సాక్షి, హైదరాబాద్: ఏటీఎంకు వెళ్తే నో క్యాష్.. బ్యాంకుకు వెళ్తే గంటలకొద్దీ పడిగాపులు.. అంతసేపు నిరీక్షించినా పది వేలు దక్కితే అదే మహాభాగ్యం.. ముందురోజు వ్యాపారం ద్వారా వచ్చిన నగదును గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తెచ్చి డిపాజిట్ చేస్తేగానీ సేవింగ్స్ ఖాతాదారులకు డబ్బులివ్వని పరిస్థితి.. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో ఇదీ దుస్థితి! మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా నో క్యాష్ బోర్డులే కనిపిస్తుండటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బ్యాంకులకు వాటికిచ్చే నిష్పత్తి ప్రకారమే నగదు అందజేస్తున్నామని, హైదరాబాద్‌లోని బ్యాంకులకు ఈ నెల మొదటి వారంలో రమారమి రూ.3000 కోట్ల పైచిలుకు అందజేశామని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది.
మరి అంత డబ్బు వచ్చినా ఖాతాదారులకు ఎందుకు చేరడం లేదన్న ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానం చెప్పలేకపోతోంది. ‘‘బ్యాంకు మేనేజర్లు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నట్లు కొన్ని కేసులను పరిశీలిస్తే అర్థమైంది. ఆబిడ్స్‌లో ఓ బ్యాంకుకు వారి ప్రధాన కార్యాలయం నుంచి ఈ నెల 6న రూ.175 కోట్లు వెళ్లాయి. ఆ మొత్తం నగదును సదరు బ్యాంకు మేనేజర్ కేవలం ముగ్గురు ఖాతాదారులకే పంపిణీ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది’’అని ఆర్‌బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు కొరతకు బ్యాంకుల మధ్య సమన్వయ లోపం కూడా ఓ కారణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం నుంచి నగదు కొరత రాకుండా కొన్ని చర్యలు తీసుకోబోతున్నామని, అందుకు ప్రధాన బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశామని ఆ అధికారి చెప్పారు.
మూతపడుతున్న ఏటీఎంలు
అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటీఎంల సంఖ్య ఏటికేటా పెరిగిపోతోంది. ప్రతి వంద మీటర్లకు ఓ ఏటీఎం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడ మాత్రం బ్యాంకులు తిరోగమనంలో పయనిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ తన 30 శాతం ఏటీఎంలలో నెలల తరబడి నగదును లోడ్ చేయడం లేదు. పెద్దనోట్ల రద్దు నాటి నుంచీ ఆ ఏటీఎంలను నిరర్థకంగా ఉంచింది. వాటిలో నగదు విచారణ, చెక్ బుక్ రిక్వెస్ట్ వంటి సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణలో అన్ని బ్యాంకులకు కలిపి 8,781 ఏటీఎంలు ఉండగా.. అందులో పెద్దనోట్లు రద్దయినప్పట్నుంచీ దాదాపు 40 శాతం అంటే 3,800 ఏటీఎంల్లో నగదు లోడ్ చేయడం లేదు. మరో 20 శాతం ఏటీఎంలలో వారానికి ఒకసారి మాత్రమే నగదు ఉంచుతున్నారు. మొత్తంగా 40 శాతం ఏటీఎంల్లోనే నగదు లోడ్ చేస్తున్నారు. క్రమేపీ వాటి సంఖ్య కూడా తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా పరిశీలిస్తే వెయ్యి లోపు ఏటీఎంల్లోనే నగదు అందుబాటులో ఉంచినట్టు స్పష్టమవుతోంది. అదీ క్యాష్ పెట్టిన గంటలోపే అయిపోతోంది. కొన్ని ఏటీఎంల్లో రూ.4 వేలకు మించి రాకుండా మార్పులు చేశారు. దీంతో ఖాతాదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మరో నాలుగైదు రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒకరు చెప్పారు.
జైట్లీకి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరతపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిసూ.. ఇది ఆకస్మాత్తుగా ఏర్పడ్డ ఇబ్బంది అని వివరణ ఇచ్చారు. అయితే దీనికి మంత్రి కె.తారక రామారావు కౌంటర్ ఇచ్చారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగా ఏర్పడ లేదంటూ ట్వీటర్‌లో బదులిచ్చారు. నగదు కొరతపై గత మూడు నెలలుగా పదేపదే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న ఈ సమస్యపై ఆర్థిక శాఖ, ఆర్బీఐ లోతుగా పరిశీలన జరపాలని సూచించారు.
ఎందుకీ కటకట..?
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్–2017 (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు చట్ట రూపం దాలిస్తే బ్యాంకుల్లో తమ సొమ్ముకు భద్రత ఉండదని ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. బ్యాంకుల్లో జరుగుతున్న భారీ స్కామ్‌లతో ఆ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోతోంది. దీంతో ఖాతాల్లోంచి డబ్బులు తీసేవారే తప్ప వేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 15.3 శాతంగా ఉంటే.. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి కేవలం 6.7 శాతం మాత్రమే డిపాజిట్లు వచ్చాయి.
- కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంలో నగదు అవసరం అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నోట్ల కట్టలు ఆ రాష్ట్రానికి తరలుతున్నాయి.
- ఈ ఏడాది మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండడంతో చాలా చోట్ల రాజకీయ నేతలు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్న రాజకీయ పార్టీలు ఇప్పటికే భారీ సంఖ్యలో రెండు వేల నోట్లను అక్రమంగా నిల్వ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment