ఏటీఎంలకు నో క్యాష్
న్యూఢిల్లీ: కరెన్సీ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పట్లో కష్టాలు తీరేలాలేవు. ఏటీఎంలలో మరికొన్ని రోజుల పాటు నగదు అందుబాటులో ఉండదు. డబ్బును బ్యాంకులకే పంపాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
దేశ వ్యాప్తంగా 2.10 లక్షల ఏటీఎంలు ఉండగా కొన్నింటిలోనే నగదు అందుబాటులో ఉంటోంది. కేవలం 27 వేల ఏటీఎంలలో మాత్రమే డబ్బు లభిస్తోంది. గత నెలలో 30 శాతం ఏటీఎంలలో డబ్బు నింపగా, ప్రస్తుతం 13 శాతం ఏటీఎంలలోనే నగదు అందుబాటులో ఉంటోంది.
గత నెల 8న కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కరెన్సీ సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్తగా ముద్రించిన 500, 2000 రూపాయల నోట్లు డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూలు ఉంటున్నాయి. చాలా ఏటీఎంలు మూతపడగా, చాలా చోట్ల బ్యాంకుల్లో కూడా డబ్బు లేదని చెబుతున్నారు.