ముంబై : పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరతను తగ్గించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను ప్రస్తుతం బ్యాంకుల ద్వారా మాత్రమే అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ నోట్లు ఏటీఎంలలోకి రానున్నాయి. ప్రజలకు రూ.200 డినామినేషన్ నోటును అందుబాటులోకి తీసుకురావడానికి ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేయాలని ఆర్‌బీఐ, బ్యాంకులను ఆదేశించింది. తక్కువ డినామినేషన్ కరెన్సీ సరఫరాను ప్రోత్సహించేందుకు త్వరలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. రెగ్యులేటరీ ఆదేశాలను అమల్లోకి తీసుకురావడానికి బ్యాంకింగ్ పరిశ్రమ దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. బ్యాంకులు, ఏటీఏం తయారీదారులు ఎంత వీలైతే అంత త్వరగా రూ.200 నోట్లను ఏటీఎంల ద్వారా అందించడం ప్రారంభించాలని ఆర్‌బీఐ ఆదేశించినట్టు ఓ బ్యాంకరు చెప్పారు.
ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిసింది. ఇప్పటికే ఏటీఎంల రీక్యాలిబరేట్ ప్రారంభమైనట్టు హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఎండీ లోని ఆంటోని చెప్పారు. దీనికి ఖర్చు అధికంగానే ఉండనుందని, కానీ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు పోనున్నట్టు చెప్పారు. రూ.200 నోట్లను ఎక్కువగా అందించడం కోసం ఆర్‌బీఐ కూడా రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసింది.ఈ విషయంపై ఆర్‌బీఐ ఇంకా స్పందించలేదు. పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు తర్వాత సెంట్రల్ బ్యాంకు ఎక్కువగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. దీంతో చిల్లర నోట్ల కొరత ఏర్పడింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే నగదు విలువ కూడా పెరిగినట్టు తెలిసింది. 2016 సెప్టెంబర్‌లో రూ.2.22 లక్షల కోట్ల నగదును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకుంటే, 2017 సెప్టెంబర్‌లో రూ.2.44 లక్షల కోట్ల నగదు విత్‌డ్రా అయింది.
Comments
Please login to add a commentAdd a comment