కొన్ని నగరాల్లో రాత్రిపూట ఎటీఎంలు క్లోజ్!
ముంబయి : కొత్త ఏడాదిలో బ్యాంక్‌లు వినియోగదారులకు ఒక షాకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాయి. ఏటీఎంలు రాత్రిపూట పని చేయాలా వద్దా అనే దానిపై ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని నగరాల్లో రాత్రిసమయాల్లో ఏటీఎంలు మూసి వేయనున్నట్లు ఆర్బీఐకి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల బెంగళూరులో ఓ బ్యాంకు ఉద్యోగినిపై దాడి జరిగిన నేపథ్యంలో ఏటీఎంలలో భద్రత విషయం మీడియాకెక్కింది. దాంతో పలు బ్యాంకులు తమ ఏటీఎంలకు సెక్యూరిటీ కల్పించలేమని చేతులెత్తేయడంతో అక్కడ దాదాపు వెయ్యికిపైగా ఏటీఎంలు మూసివేశారు. మరోవైపు వీటి సంరక్షణ భారం తమది కాదన్నట్టు బ్యాంకులు ఆ భారాన్ని వినియోగదారుడిపైనే మోపేందుకు నడుం కడుతున్నాయి. వాడుకునేవాడికి వాడుకునేంత అన్నట్లు వినియోగదారుడి నెత్తినే బరుపు మోపనున్నాయని సమాచారం.
ఇక ఏటీఎంల వద్ద భద్రతకు కస్టమర్లే ప్రతి లావాదేవీకి ఆరు రూపాయలు చెల్లించాలనే ప్రతిపాదనను బ్యాంకులు చురుకుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భద్రత నేపథ్యంలో కొన్ని నగరాల్లో రాత్రి సమయాల్లో ఏటీఎంలను మూసివేయాలనే ప్రతిపాదనను తెరమీదకు తేవటం విశేషం. మరి దీనికి ఆర్బీఐ ఆమోదం తెలుపుతుందో లేదో చూడాలి.