సాక్షి, చెన్నై : నాలుగు రోజులు సెలవుల అనంతరం బుధవారం బ్యాంకులు తెరచుకున్నాయి. జనం ఒక్కసారిగా దూసుకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడంతో జనానికి తిప్పలు తప్పలేదు. పెద్ద నోట్ల రద్దుతో జనం పడిన పాట్లు వర్ణణాతీతం. కొత్త నోట్ల రాక, కొత్త రూ.ఐదు వందల నోటు దర్శనంతో చిల్లర పాట్ల నుంచి కొంతమేరకు ఉపశమనం కలిగింది. క్రమంగా నగదు విత్‌డ్రాకు విధించిన ఆంక్షలు సడలిస్తూ రావడం ప్రజలకు ఊరటే. అయితే, అందుకు తగ్గట్టుగా నోట్లు బ్యాంకుల్లో, ఏటీఎంలలో కరువే. ఇక రోజుకు రూ. 10 వేలు ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే విధంగా ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, ఏటీఎంలలో నగదు లేకపోవడంతో జనాలకు కరెన్సీ కష్టాలు తప్పలేదు. బ్యాంకులకు నాలుగు రోజులు వరుసగా సెలవులు రావడంతో జనానికి నోట్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. బుధవారం బ్యాంకులన్నీ తెరచుకున్నాయి. దీంతో ఖాతాదారులు నగదు కోసం బ్యాంకులకు పోటెత్తారు. జనం సంఖ్య పెరగడంతో మళ్లీ బ్యాంకుల ముందు బారులు తప్పలేదు. ఇక, ఏటీఎంలలో పది వేలు విత్ డ్రా చేసుకోవచ్చన్న ఆనందంతో వెళితే నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రజలు నిరుత్సాహపడ్డారు. అయితే, కొన్ని ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉండడంతో జనాలు అక్కడ క్యూ కట్టారు. వరుస సెలవుల పుణ్యమా అని జనానికి కరెన్సీ కష్టాలు మరో రెండురోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఆర్‌బీఐ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసే వాళ్లే అధికం.
బ్యాంకులు కిటకిట
Published Thu, Jan 19 2017 4:36 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
Advertisement