Rs.200 notes
-
ఆర్బీఐ ఆర్డర్ : ఈ నోట్లు ఏటీఎంలలో పెట్టండి
ముంబై : పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరతను తగ్గించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను ప్రస్తుతం బ్యాంకుల ద్వారా మాత్రమే అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ నోట్లు ఏటీఎంలలోకి రానున్నాయి. ప్రజలకు రూ.200 డినామినేషన్ నోటును అందుబాటులోకి తీసుకురావడానికి ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేయాలని ఆర్బీఐ, బ్యాంకులను ఆదేశించింది. తక్కువ డినామినేషన్ కరెన్సీ సరఫరాను ప్రోత్సహించేందుకు త్వరలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. రెగ్యులేటరీ ఆదేశాలను అమల్లోకి తీసుకురావడానికి బ్యాంకింగ్ పరిశ్రమ దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. బ్యాంకులు, ఏటీఏం తయారీదారులు ఎంత వీలైతే అంత త్వరగా రూ.200 నోట్లను ఏటీఎంల ద్వారా అందించడం ప్రారంభించాలని ఆర్బీఐ ఆదేశించినట్టు ఓ బ్యాంకరు చెప్పారు. ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిసింది. ఇప్పటికే ఏటీఎంల రీక్యాలిబరేట్ ప్రారంభమైనట్టు హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఎండీ లోని ఆంటోని చెప్పారు. దీనికి ఖర్చు అధికంగానే ఉండనుందని, కానీ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు పోనున్నట్టు చెప్పారు. రూ.200 నోట్లను ఎక్కువగా అందించడం కోసం ఆర్బీఐ కూడా రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసింది.ఈ విషయంపై ఆర్బీఐ ఇంకా స్పందించలేదు. పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు తర్వాత సెంట్రల్ బ్యాంకు ఎక్కువగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. దీంతో చిల్లర నోట్ల కొరత ఏర్పడింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే నగదు విలువ కూడా పెరిగినట్టు తెలిసింది. 2016 సెప్టెంబర్‌లో రూ.2.22 లక్షల కోట్ల నగదును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకుంటే, 2017 సెప్టెంబర్‌లో రూ.2.44 లక్షల కోట్ల నగదు విత్‌డ్రా అయింది. -
ఆ నోట్ల కోసం క్యూ కట్టారు
సాక్షి, న్యూఢిల్లీ : వినాయక చవితి కానుకగా కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్త రూ.50 నోటును, కొత్త రూ.200 నోటును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు(శుక్రవారం) విడుదల చేసింది. చిల్లర సమస్యకు అడ్డుకట్ట వేసి, నగదు చలామణిని సులభతరం చేయడానికి వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నోట్లు విడుదలైనట్టు తెలియగానే, కొత్త నోట్ల కోసం జనాలు భారీగా క్యూ కట్టారు. ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుని మరీ కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ రెండు నోట్లను భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూపొందించింది. కొత్త రూ.50 నోట్లపై ఒకవైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉంటే, మరొకమైపు హంపీ రథముంటుంది. అలాగే కొత్త రూ.200 నోట్లపై కూడా ఒకవైపు మహాత్మాగాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం.. మరొకవైపు స్వచ్ఛభారత్ లోగో, సాంచీ స్థూపం ఉన్నాయి. అంతేకాక ఈ రెండు నోట్ల రంగులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇప్పటివరకు భారత్‌లో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.50, రూ.100, రూ.500, రూ.2000 డినామినేషన్ నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారి రూ.200 కొత్త నోటు మార్కెట్లోకి వచ్చింది. కొత్త రూ.50తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చట్టబద్ధంగా చలామణి అవుతాయని ఆర్బీఐ తెలిపింది. కాగా, 200, 50 నోట్ల వల్ల తక్కువ విలువ ఉన్న నోట్ల కొరత తీరనుంది. నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో పెద్ద నోట్ల చెలామణి 86 శాతం నుంచి 70 శాతానికి పడిపోయింది. ఈ 200, 50 నోట్లతో వాటి వాడకం మరింత తక్కువవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
నేడే మార్కెట్లోకి రూ.200 నోట్లు
♦ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ♦ ప్రకాశవంతమైన పసుపు రంగులో...స్వచ్ఛ భారత్ లోగో, అశోక స్తంభం, సాంచీ స్థూపాలకు చోటు ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందరికీ షాకిచ్చింది. తొలిసారిగా రూ.200 నోట్లను శుక్రవారం నుంచే మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ డినామినేషన్ కరెన్సీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రూ.200 నోట్లను వెంటనే చెలామణిలోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఈ కొత్త నోట్లు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటాయి. ‘ఆగస్ట్ 25 శుక్రవారం రోజున రూ.200 నోట్లను మార్కెట్లోకి తెస్తున్నాం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కలిగిన ఈ నోట్లు మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో ఉంటాయి’ అని బ్యాంక్ తాజా ప్రకటనలో తెలిపింది. కొత్త రూ.50 నోట్లపై హంపీ రథం మాదిరిగానే ఈ రూ.200 నోట్లపై కూడా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాంచీ స్థూపం ఉంటుందని పేర్కొంది. ఇక నోటుకు ఒకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం.. మరొకవైపు స్వచ్ఛభారత్ లోగో, సాంచీ స్థూపం వంటివి ఉంటాయని వివరించింది. ఎక్కడ లభ్యమవుతాయి? వాస్తవానికి రూ.200 నోట్లు అందరికీ ఏటీఎంల ద్వారానే అందుబాటులోకి రావాల్సి ఉంది. కాకపోతే ఈ నోట్లను పంపిణీ చేయడానికి వీలుగా ఏటీఎంలను రీక్యాలిబరేషన్ చేయాల్సి ఉంది. అప్పటిదాకా వీటిని ఇతర రూ.50, 20, 10 నోట్ల మాదిరిగా బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారానే పంపిణీ చేయనున్నట్లు ఆర్బీఐ వర్గాలు తెలియజేశాయి.