ఆ నోట్ల కోసం క్యూ కట్టారు
ఆ నోట్ల కోసం క్యూ కట్టారు
Published Fri, Aug 25 2017 1:13 PM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM
సాక్షి, న్యూఢిల్లీ : వినాయక చవితి కానుకగా కొత్త నోట్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. కొత్త రూ.50 నోటును, కొత్త రూ.200 నోటును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు(శుక్రవారం) విడుదల చేసింది. చిల్లర సమస్యకు అడ్డుకట్ట వేసి, నగదు చలామణిని సులభతరం చేయడానికి వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ నోట్లు విడుదలైనట్టు తెలియగానే, కొత్త నోట్ల కోసం జనాలు భారీగా క్యూ కట్టారు. ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ప్రజలు గంటల తరబడి క్యూ లైన్‌లో నిల్చుని మరీ కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ రెండు నోట్లను భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూపొందించింది.
కొత్త రూ.50 నోట్లపై ఒకవైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉంటే, మరొకమైపు హంపీ రథముంటుంది. అలాగే కొత్త రూ.200 నోట్లపై కూడా ఒకవైపు మహాత్మాగాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం.. మరొకవైపు స్వచ్ఛభారత్ లోగో, సాంచీ స్థూపం ఉన్నాయి. అంతేకాక ఈ రెండు నోట్ల రంగులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇప్పటివరకు భారత్‌లో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.50, రూ.100, రూ.500, రూ.2000 డినామినేషన్ నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి.
భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారి రూ.200 కొత్త నోటు మార్కెట్‌లోకి వచ్చింది. కొత్త రూ.50తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చట్టబద్ధంగా చలామణి అవుతాయని ఆర్బీఐ తెలిపింది. కాగా, 200, 50 నోట్ల వల్ల తక్కువ విలువ ఉన్న నోట్ల కొరత తీరనుంది. నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో పెద్ద నోట్ల చెలామణి 86 శాతం నుంచి 70 శాతానికి పడిపోయింది. ఈ 200, 50 నోట్లతో వాటి వాడకం మరింత తక్కువవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Advertisement