నేడే మార్కెట్‌లోకి రూ.200 నోట్లు
♦ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన
♦ ప్రకాశవంతమైన పసుపు రంగులో...స్వచ్ఛ భారత్ లోగో, అశోక స్తంభం, సాంచీ స్థూపాలకు చోటు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అందరికీ షాకిచ్చింది. తొలిసారిగా రూ.200 నోట్లను శుక్రవారం నుంచే మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ డినామినేషన్ కరెన్సీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రూ.200 నోట్లను వెంటనే చెలామణిలోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఈ కొత్త నోట్లు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటాయి. ‘ఆగస్ట్ 25 శుక్రవారం రోజున రూ.200 నోట్లను మార్కెట్‌లోకి తెస్తున్నాం. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కలిగిన ఈ నోట్లు మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో ఉంటాయి’ అని బ్యాంక్ తాజా ప్రకటనలో తెలిపింది. కొత్త రూ.50 నోట్లపై హంపీ రథం మాదిరిగానే ఈ రూ.200 నోట్లపై కూడా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాంచీ స్థూపం ఉంటుందని పేర్కొంది. ఇక నోటుకు ఒకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం.. మరొకవైపు స్వచ్ఛభారత్ లోగో, సాంచీ స్థూపం వంటివి ఉంటాయని వివరించింది.
ఎక్కడ లభ్యమవుతాయి?
వాస్తవానికి రూ.200 నోట్లు అందరికీ ఏటీఎంల ద్వారానే అందుబాటులోకి రావాల్సి ఉంది. కాకపోతే ఈ నోట్లను పంపిణీ చేయడానికి వీలుగా ఏటీఎంలను రీక్యాలిబరేషన్ చేయాల్సి ఉంది. అప్పటిదాకా వీటిని ఇతర రూ.50, 20, 10 నోట్ల మాదిరిగా బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారానే పంపిణీ చేయనున్నట్లు ఆర్‌బీఐ వర్గాలు తెలియజేశాయి.