తిరుపతి : పెద్దనోట్ల రద్దు సామాన్యులకు చుక్కలు చూపించింది. రద్దు చేసిన 1000, 500 నోట్లను మార్చుకోవడానికి జనాలు పడ్డ కష్టాలు వర్ణానాతీతం. ఆ సమయంలో పేదలు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి నగదును మార్చుకోడానికి తిప్పలు పడితే, ధనవంతులు తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని అటు మార్చుకోలేక, ఇటు ఎవ్వరికి ఇవ్వలేక ఏమి చేయాలో పాలుపోక చివరకు ఆ నగదును వెంకన్న హుండీలో వేశారు. ఒక్క ధనవంతులు అనే ఏముంది, పిల్లికి భిక్షం వేయని వారు సైతం దేవుని హుండీలో వేలకు వేలు వేశారు. ఎలాను చెల్లని నోట్లె కదా, పుణ్యం...పురుషార్థం కలసి వస్తాయని... ప్రస్తుతం వెంకన్న హుండీలో దాదాపు రూ.25కోట్ల రద్దయిన నోట్లు వేసినట్టు తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటించిన కొద్ది నెలల తరువాత వచ్చిన మొత్తం ఇది. 2016 నవంబర్ 8న మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీటీడీ వీటిని మార్చుకునే పనిలో నిమగ్నమై ఉంది. ‘భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మేము ఈ నగదును మార్చుకోవాలని అనుకుంటున్నాం. అందుకు అవకాశం కల్పించమని ఆర్‌బీఐని ఒక లేఖ ద్వారా కోరాం. ఆర్‌బీఐ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాం’ అని టీటీడీ అదనపు ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ ఓ. బాలాజీ అన్నారు. ఈ రద్దయిన నోట్ల స్టాక్‌ను ప్రస్తుతం ఆలయంలోనే సురక్షితంగా భద్రపరచి ఉంచినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment