ఎన్‌పీఏలపై జూన్ 12న జైట్లీ సమీక్ష
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వచ్చే నెల 12వ తేదీన బ్యాంకింగ్‌పై ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొంటారు. మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య, సవాళ్ల పరిష్కారంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. ఎన్‌పీఏ అంశంమీదే కాకుండా ఒత్తిడిలో ఉన్న నిరర్థక ఆస్తుల విషయంపైనా సమావేశం సమీక్ష జరుపుతుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
విద్యుత్, స్టీల్, రోడ్ ఇన్‌ప్రా, జౌళి వంటి రంగాల బలహీనతల నేపథ్యంలో ఎన్‌పీఏల విలువ రూ. 6 లక్షల కోట్లను దాటిన సంగతి తెలిసిందే. ఇంద్రధనుష్ ప్రణాళికసహా మార్కెట్ నుంచి బ్యాంకింగ్ నిధులు సమీకరించుకునే అంశంపైనా సమావేశం దృష్టి పెడుతుంది. విద్య, గృహ రంగాల్లో రుణ వృద్ధి, ప్రధాన్‌మంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి వివిధ పథకాల పనితీరు కూడా చర్చల్లో చోటుచేసుకోనుంది.