indradhanush
-
ఎన్పీఏలపై జూన్ 12న జైట్లీ సమీక్ష
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వచ్చే నెల 12వ తేదీన బ్యాంకింగ్‌పై ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొంటారు. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య, సవాళ్ల పరిష్కారంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. ఎన్పీఏ అంశంమీదే కాకుండా ఒత్తిడిలో ఉన్న నిరర్థక ఆస్తుల విషయంపైనా సమావేశం సమీక్ష జరుపుతుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. విద్యుత్, స్టీల్, రోడ్ ఇన్ప్రా, జౌళి వంటి రంగాల బలహీనతల నేపథ్యంలో ఎన్పీఏల విలువ రూ. 6 లక్షల కోట్లను దాటిన సంగతి తెలిసిందే. ఇంద్రధనుష్ ప్రణాళికసహా మార్కెట్ నుంచి బ్యాంకింగ్ నిధులు సమీకరించుకునే అంశంపైనా సమావేశం దృష్టి పెడుతుంది. విద్య, గృహ రంగాల్లో రుణ వృద్ధి, ప్రధాన్‌మంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి వివిధ పథకాల పనితీరు కూడా చర్చల్లో చోటుచేసుకోనుంది. -
‘ఇంద్రధనుష్’ మంచి ప్రయత్నం
ఇండియా రేటింగ్స్ కితాబు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఇంద్రధనుష్’ సంస్కరణ అభినందనీయమని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ సంస్థ పేర్కొంది. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీలకు ఇచ్చిన రుణాల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆందోళనలు తప్పవని తెలిపింది. ఇంద్రధనుష్ కార్యక్రమం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం అందుతుందని, దీంతో పాలనా సంబంధిత అంశాలు మెరుగుపడతాయని, తద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని వివరించింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల గురించి వివరిస్తూ.. పెరిగిపోతున్న మొండిబకాయిల సమస్యల గురించి ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన నాణ్యత సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని పేర్కొంది. కార్పొరేట్లకు ఇచ్చిన రుణాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి బ్యాంకులకు రూ.లక్ష కోట్ల కావాల్సి ఉందని తెలిపింది. -
బ్యాంకుల దశ మార్చే ఇంద్రధనుష్
- వృద్ధి, పనితీరు మెరుగుపడతాయ్ - రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడి ముంబై: ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుష్ బ్యాంకుల దశను పూర్తిగా మార్చివేస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. మొండి బకాయిల సమస్య తీరుతుందని, గతంలో అంచనా వేసినదానికంటే మెరుగైన వృద్ధిని బ్యాంకులు సాధిస్తాయని వివరించింది. బ్యాంకులకు నిధులందించే ప్రభుత్వ ప్రణాళిక, క్యాపిటల్ బఫర్ నిర్వహించాలన్న నిర్ణయం వంటి కారణాల వల్ల బ్యాంకుల క్రెడిట్ రేటింగ్‌లు సమీప భవిష్యత్తులో అత్యున్నత భద్రత కేటగిరిలో ఉంటాయని పేర్కొంది. ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,088 కోట్ల నిధులందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. బ్యాంక్ బ్యూరో ఏర్పాటుకు గడవును స్పష్టంగా నిర్దేశించడం, నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్లుగా ప్రొఫెషనల్స్‌ను తీసుకోనుండడం వంటి నిర్ణయాలు బ్యాంకుల పనితీరులో గణనీయమైన మార్పును తీసుకువస్తాయని క్రిసిల్ పేర్కొంది. బోనస్, స్టాక్ ఆప్షన్లను ఇవ్వడం వల్ల బ్యాంకులు ప్రతిభ గల ఉద్యోగులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడింది.