‘ఇంద్రధనుష్’ మంచి ప్రయత్నం
ఇండియా రేటింగ్స్ కితాబు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఇంద్రధనుష్’ సంస్కరణ అభినందనీయమని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ సంస్థ పేర్కొంది. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీలకు ఇచ్చిన రుణాల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆందోళనలు తప్పవని తెలిపింది. ఇంద్రధనుష్ కార్యక్రమం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం అందుతుందని, దీంతో పాలనా సంబంధిత అంశాలు మెరుగుపడతాయని, తద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని వివరించింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల గురించి వివరిస్తూ.. పెరిగిపోతున్న మొండిబకాయిల సమస్యల గురించి ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన నాణ్యత సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని పేర్కొంది. కార్పొరేట్లకు ఇచ్చిన రుణాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి బ్యాంకులకు రూ.లక్ష కోట్ల కావాల్సి ఉందని తెలిపింది.