ఫార్మా అమ్మకాలు భేష్‌ | Indian Pharma Market Sustains Double-Digit Growth In March 2023 | Sakshi
Sakshi News home page

ఫార్మా అమ్మకాలు భేష్‌

Published Thu, Apr 13 2023 4:00 AM | Last Updated on Thu, Apr 13 2023 4:00 AM

Indian Pharma Market Sustains Double-Digit Growth In March 2023 - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఫార్మా రంగం గత నెల(మార్చి)లో పటిష్ట వృద్ధిని సాధించింది. 2022 మార్చితో పోలిస్తే 13 శాతం పురోగతిని అందుకుంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ రెండంకెల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా మూడు రకాల చికిత్సలు దోహదపడ్డాయి. నిజానికి గతేడాది మార్చిలో ఫార్మా అమ్మకాలు 2 శాతం నీరసించాయి. కాగా.. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఈ ఫిబ్రవరిలో 20 శాతంపైగా జంప్‌చేశాయి. దీంతో 2022–23లో మొత్తం ఫార్మా విక్రయాల్లో 9.3 శాతం పురోభివృద్ధి నమోదైంది.

అంతక్రితం ఏడాది 14.6 శాతం పుంజుకోగా.. 2020–21లో అమ్మకాలు 2.1 శాతమే బలపడ్డాయి. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రయివేట్‌ వెల్లడించిన వివరాలివి. యాంటీఇన్‌ఫెక్టివ్స్, శ్వాససంబంధ(రెస్పిరేటరీ), నొప్పి నివారణ(పెయిన్‌ మేనేజ్‌మెంట్‌) విభాగాల నుంచి 30% ఆదాయం నమోదైనట్లు ఇండియా రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కృష్ణనాథ్‌ ముండే పేర్కొన్నారు. ఇతర విభాగాలు అంతంతమాత్ర అమ్మకాలు మాత్రమే సాధించినప్పటికీ టాప్‌–10 థెరపీల నుంచి పరిశ్రమ ఆదాయంలో 87 శాతం లభించినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలోనూ 10–11 శాతం వృద్ధికి వీలున్నట్లు ఈ సందర్భంగా అంచనా వేశారు.

జూన్‌ నుంచీ స్పీడ్‌
గతేడాది(2022) జూన్‌ నుంచి ఫార్మా రంగంలో రికవరీ ఊపందుకున్నట్లు ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రతికూల అమ్మకాలు నమోదుకాగా.. 2022 జూన్‌ నుంచి 2023 మార్చి కాలంలో 12.6 శాతం పురోగతిని సాధించాయి. అక్టోబర్, జనవరిల్లో అమ్మకాలు కొంతమేర మందగించినప్పటికీ పటిష్ట వృద్ధి నమోదైంది. పరిమాణంరీత్యా అమ్మకాలు 4.5 శాతం పుంజుకోగా.. ధరలు 5.6 శాతం మెరుగుపడ్డాయి. కొత్త ప్రొడక్టుల విడుదల 2.9 శాతం మెరుగుపడింది.  

విభాగాలవారీగా
ఏఐవోసీడీ గణాంకాల ప్రకారం 2023 మార్చిలో రెస్పిరేటరీ విభాగం 50 శాతం జంప్‌చేయగా.. యాంటీఇన్‌ఫెక్టివ్స్‌ అమ్మకాలు 32 శాతం ఎగశాయి. పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ 18 శాతం వృద్ధి చూపింది. ఈ బాటలో గ్యాస్ట్రోఎంటరాలజీ, విటమిన్ల విభాగాలు 8 శాతం చొప్పున బలపడ్డాయి. గుండెసంబంధ(కార్డియాలజీ), మెదడు, నాడీసంబంధ(సీఎన్‌ఎస్‌) థెరపీ అమ్మకాలు 6 శాతం, చర్మవ్యాధులు 4 శాతం, స్త్రీసంబంధ ప్రొడక్టుల విక్రయాలు 3 శాతం చొప్పున పెరిగాయి. అయితే యాంటీడయాబెటిక్‌ విక్రయాలు 2 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి.

కంపెనీల జోరిలా
ఏఐవోసీడీ వివరాల ప్రకారం మార్చిలో కొన్ని ఫార్మా కంపెనీలు మార్కెట్‌ను మించి వృద్ధిని చూపాయి. ఇండొకొ రెమిడీస్‌ 28 శాతం, సిప్లా, ఎఫ్‌డీసీ 27 శాతం, అలెంబిక్‌ ఫార్మా 24 శాతం, గ్లెన్‌మార్క్‌ 22 శాతం చొప్పున పురోగతిని సాధించాయి. ఇక అబాట్‌ ఇండియా, ఆల్కెమ్‌ లేబొరేటరీస్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, జీఎస్‌కే ఫార్మా అమ్మకాల్లో 14–18 శాతం మధ్య వృద్ధి నమోదైంది. ఇతర సంస్థలలో ఇప్కా ల్యాబ్‌ 13 శాతం, టొరెంట్‌ ఫార్మా, లుపిన్‌ 9 శాతం, ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ 7 శాతం, అజంతా ఫార్మా, జేబీ కెమ్, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ అమ్మకాలు 4–5 శాతం స్థాయిలో బలపడ్డాయి. సన్‌ ఫార్మా, ఫైజర్‌ అమ్మకాలు 3–2 శాతం పుంజుకోగా, గతేడాది మార్చితో పోలిస్తే సనోఫీ ఇండియా అమ్మకాలు వార్షికంగా 9 శాతం నీరసించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement