ఫార్మాలో వెయ్యి స్టార్టప్‌లకు చాన్స్ | Pharma sales to rise by over one- fifth in March quarter | Sakshi
Sakshi News home page

ఫార్మాలో వెయ్యి స్టార్టప్‌లకు చాన్స్

Published Tue, Apr 15 2014 1:36 AM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM

ఫార్మాలో వెయ్యి స్టార్టప్‌లకు చాన్స్ - Sakshi

ఫార్మాలో వెయ్యి స్టార్టప్‌లకు చాన్స్

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విర్కో ల్యాబరేటరీస్..సల్ఫామెథాక్జలీన్ జనరిక్ ఔషధ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నంబర్ వన్. ఫైజర్, గ్లాక్సో, తెవా ఫార్మా లాంటి ఫార్మా దిగ్గజాలు ఈ సంస్థకు  క్లయంట్లు.  డాక్టర్ రెడ్డీస్ కన్నా రెండేళ్లు ముందే ఈ రంగంలో అడుగిడిన విర్కో ల్యాబరేటరీస్ తాజా టర్నోవర్ రూ. 2,000 కోట్లు దాటింది. ఇటీవల సన్ ఫార్మా జపాన్ కంపెనీ దైచీ నుండి రాన్‌బాక్సీ సంస్థను కొనుగోలు చేయడంతో బల్క్ డ్రగ్స్ జనరిక్స్ మార్కెట్లో ఈ రంగంపై ఫోకస్ పెరిగింది.

గత 20 ఏళ్లుగా బల్క్‌డ్రగ్స్‌లో గట్టి పోటీ ఇచ్చిన చైనా కంటే ఇండియాలోనే ఉత్పత్తి వ్యయాలు తక్కువ కావడంతో ప్రపంచదృష్టి భారత్ ఫార్మాపై పడిందని ఫార్మా రంగ నిపుణులు అంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాల్లోనూ ఫార్మా రంగంలో  వందలాది స్టార్టప్ కంపెనీలు రానున్నాయని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో   సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. నారాయణరెడ్డితో సాక్షి ప్రతినిధి ఫార్మా రంగంలో రాబోయే పరిణామాలపై జరిపిన ఇంటర్వ్యూ వివరాలివీ...
 బల్క్‌డ్రగ్స్ పరిశ్రమపై ఫోకస్ పెరిగినట్లుంది?
 సన్‌ఫార్మా సంస్థ దైచీ నుండి రాన్‌బాక్సీని కొనుగోలు చేయడంతో రాన్‌బాక్సీ సంస్థ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని భావిస్తున్నాం. ఒక ఇండియన్ కంపెనీ ఇండియన్ చేతుల్లో ఉండటం శుభపరిణామం.  బల్క్‌డ్రగ్ కేపిటల్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో కొనుగోళ్లు,విలీనాలకు అవకాశాలెక్కువ. మైలాన్, సనోఫీ అవెంటిస్ సంస్థలు అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.  ఫైజర్, గ్లాక్సో లాంటి సంస్థలు ఎంతకాలంగానో సరైనజోడీ కోసం చూస్తున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. 40 పైచిలుకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతులున్న ఫ్యాక్టరీలు హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.

 బల్క్‌డ్రగ్స్‌లో కొత్త ట్రెండ్స్?
 ఆఫ్ పేటెంటెడ్ డ్రగ్స్. పేటెంట్ల గడువు తీరిపోయిన డ్రగ్స్ గత రెండు మూడేళ్లుగా బాగా వచ్చాయి. దీంతో పరిశ్రమకు మంచి రాబడి అవకాశం దొరికింది. జనరిక్స్ మార్కెట్లో వీటిని విక్రయించటం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం సంస్థలు వినియోగించుకుంటున్నాయి.

 కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా, సీమాంధ్ర రాష్ట్రాల్లో పరిశ్రమ ఎలా నిలదొక్కుకోవాలంటారు?
 కొత్త రాష్ట్రాల్లో ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి పునాదులు వేయాలి. కొత్త పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉద్యోగ అశకాశాలు వస్తాయి. పన్నుల రూపేణా ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది.  కొత్త ప్రభుత్వాలు ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఫార్మా మినహాయిస్తే...మాన్యుఫ్యాక్చరింగ్ అంటూ మనకు పెద్దగా ఇతర రంగాలు లేవు. పరిశ్రమల స్థాపనకోసం కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాల్లోనూ పోటీ వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షిం చడం కోసం పోటాపోటీ రాయితీలు ప్రకటిస్తారు. స్థల కేటాయిం పుల్లో రాయితీలు, విద్యుత్, పన్ను ప్రోత్సాహకాలు...ఇలాంటి తాయిలాలు రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ధీటుగా ప్రకటించే అవకాశం ఉంది.

 ఫార్మాలో స్టార్టప్ కంపెనీలొస్తాయంటారా?
 తప్పకుండా..ఫార్మాలో చిన్నతరహా పరిశ్రమలు బాగా పుంజుకోవాలి. పరిశ్రమ అలానే అభివద్ధి చెందుతుంది. ఒక చక్కటి మార్కెట్ ఆలోచనతో కొన్ని ప్రత్యేకతలతో రూపుదిద్దుకొనే స్టార్టప్ కంపెనీలదే భవిష్యత్తు. నేటి స్టార్టప్ కంపెనీలే రేపటి పరిశ్రమ దిగ్గజాలు. డాక్టర్ రెడ్టీస్, అరబిందో, హెటిరో... ఇవన్నీ ఒకప్పుడు స్టార్టప్ కంపెనీలే. పరిశ్రమ అభివృద్ధి కేవలం స్టార్టప్ కంపెనీలతోనే సాధ్యం. కొత్త రాష్ట్రాల్లో. అటు వైజాగ్ కానీ ఇటు హైదరాబాద్‌లో కానీ ఓ వెయ్యి స్టార్టప్ కంపెనీలు.. నంబర్ చెప్పటం కష్టం కానీ ఆ స్థాయిలో అయితే కొత్త యూనిట్లు రావచ్చు.

రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే ప్రభుత్వాలుఎవరైనా సరే... అది టీఆర్‌ఎస్ కావచ్చు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు...ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని పారిశ్రామిక విధానాలను రూపొందించాలి.  చిన్న కంపెనీ నుండి భారీ స్థాయి యూనిట్ వరకు రకరకాల పరిశ్రమలను పెట్టుకొనే అవకాశం కేవలం ఫార్మా రంగంలోనే ఉంది. సిమెంట్, చక్కెర,ఉక్కు పరిశ్రమలకైతే భారీ పెట్టుబడులు కావాలి. ఫార్మా విషయంలో అలా కాదు. ఇక్కడ మినిమం పది కోట్ల రూపాయల నుండి వెయ్యి కోట్ల రూపాయల మేర వారి వారి స్థాయి, సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి చేసుకోవచ్చు. ఎంతచెట్టుకు అంతగాలి అన్నట్లు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా  ఫార్మా ఉత్పత్తులు చేపట్టవచ్చు. వృద్థి అవకాశాలున్నాయి. నైపుణ్యంగల మానవవనరులు అందుబాటులో ఉన్నాయి. విస్తృతమైన మార్కెట్ కూడా ఉంది.

 కొత్త రాష్ట్రాల్లో పరిశ్రమ అభివృద్ధికి కలిసొచ్చే అంశాలు?
 తెలంగాణలో భూమి విలువ తక్కువ. సీమాంధ్రలో ఎక్కువ. సీమాంధ్రలో పారిశ్రామికీకరణ అంటే పంట పొలాలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఇది బాధాకరమైన విషయం.  తెలంగాణలో అయితే చవుడు భూములు, బంజర్ భూములు వినియోగంలోకి తీసుకురావచ్చు. తెలంగాణలో ఇండస్ట్రీ అభివృద్ధి చేయడం చాలా ఈజీ. సీమాంధ్రలో భూమి విలువ ఎక్కువ అయినప్పుటికీ పెట్టుబడి పెట్టగలిగిన పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఉన్నారు. నౌకాశ్రయాలుండటంతో ఎగుమతి దిగుమతులకు అనువైన రాష్ర్టంగా సీమాంధ్ర ఎదుగుతుంది.

 చైనా సవాలును ఎలా ఎదుర్కొంటారు?
 బల్క్ డ్రగ్ విషయంలో చైనాకు మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యం ఎక్కువ. గత ఇరవై ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లో చైనా విసిరిన సవాలును తట్టుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా వేతనాలు పెరిగాయి. ఉత్పత్తి వ్యయం పెరిగింది. చైనాకు ఏ మాత్రం అడ్వాంటేజ్ లేదు.  ఇండియాలో కనీస వేతనాలు పెరిగినప్పటికీ ఉత్పత్తి వ్యయం తక్కువగానే ఉంది. ఇది రాబోయే రోజుల్లో మనకు కలిసొచ్చే అంశం.  అంతర్జాతీయ మార్కెటింగ్ విషయంలో చైనా కన్నా మనమే బెటర్.

 ఫార్మా అంటే కాలుష్యం అంటారు కదా...దీన్నెలా పరిష్కరిస్తారు?
 ఫార్మా యూనిట్లతో కాలుష్యం పెరుగుతోందని 15 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించటంతో కొత్త యూనిట్లు రావడం ఆగింది. దాని మూలాన మన వృద్ధి ఆగిపోయింది. నంబర్ వన్ పొజిషన్లో ఉండాల్సిన వాళ్లం ఇప్పుడు నంబర్ త్రీ పొజిషన్‌కు వచ్చాం. ఇది మనం చేజేతులా చేసుకున్నదే. కాలుష్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా కొత్త యూనిట్ల ఏర్పాటును ప్రభుత్వం అడ్డుకోవడంతో ఒక  దశలో పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమయింది. అయితే ఇన్ని ప్రతిబంధకాల మధ్య కూడా  అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, విర్కో ల్యాబ్స్ లాంటి కొన్ని కంపెనీలు బాగా డెవలప్ అయ్యాయి. అభిలషణీయ ఉత్పత్తి విధానాలు పాటిస్తూ, కాలుష్యాన్ని తగ్గించే స్వీయ నియంత్రణ విధానాలు పాటించటం వల్ల ఇది కొంతమేర సాధ్యపడింది.  కొత్త రాష్ట్రంలో కాలుష్య సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement