బ్యాంకుల దశ మార్చే ఇంద్రధనుష్
- వృద్ధి, పనితీరు మెరుగుపడతాయ్
- రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడి
ముంబై: ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుష్ బ్యాంకుల దశను పూర్తిగా మార్చివేస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. మొండి బకాయిల సమస్య తీరుతుందని, గతంలో అంచనా వేసినదానికంటే మెరుగైన వృద్ధిని బ్యాంకులు సాధిస్తాయని వివరించింది. బ్యాంకులకు నిధులందించే ప్రభుత్వ ప్రణాళిక, క్యాపిటల్ బఫర్ నిర్వహించాలన్న నిర్ణయం వంటి కారణాల వల్ల బ్యాంకుల క్రెడిట్ రేటింగ్‌లు సమీప భవిష్యత్తులో అత్యున్నత భద్రత కేటగిరిలో ఉంటాయని పేర్కొంది. ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,088 కోట్ల నిధులందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. బ్యాంక్ బ్యూరో ఏర్పాటుకు గడవును స్పష్టంగా నిర్దేశించడం, నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌లుగా ప్రొఫెషనల్స్‌ను తీసుకోనుండడం వంటి నిర్ణయాలు బ్యాంకుల పనితీరులో గణనీయమైన మార్పును తీసుకువస్తాయని క్రిసిల్ పేర్కొంది. బోనస్, స్టాక్ ఆప్షన్లను ఇవ్వడం వల్ల బ్యాంకులు ప్రతిభ గల ఉద్యోగులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడింది.