సరికొత్త గరిష్టాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
సరికొత్త గరిష్టాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
Published Mon, Jul 24 2017 3:04 PM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అంచనాలకు తగ్గ ఫలితాలను విడుదల చేసింది. రెవెన్యూలో అన్ని వైపుల నుంచి బ్యాంకు గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. దీంతో బ్యాంకు లాభాలు 2017-18 తొలి క్వార్టర్‌లో 20.2 శాతం పైకి ఎగిసి, రూ.3,893.84 కోట్లగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు పెరిగినప్పటికీ, బ్యాంకు ఈ మేర లాభాలు నమోదుచేయడం గమనార్హం. తొలుత స్టాక్ మార్కెట్‌లో బ్యాంకు అసెట్ క్వాలిటీపై ఆందోళనలు రేకెత్తడంతో షేర్లు పడిపోయాయి. కానీ తమ ఆస్తుల నాణ్యత పెరగడానికి ప్రధాన కారణం, జూన్‌లో రాష్ట్రాలు ప్రకటించిన వ్యవసాయ రుణ మాఫీనేనని చెప్పడంతో బ్యాంకు షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. ప్రస్తుతం 1.59 శాతం జంప్‌చేసి, రూ.1,733 వద్ద ట్రేడవుతోంది. కాగ, బ్యాంకు స్థూల ఎన్‌పీఏల్లో 60 శాతం వ్యవసాయ రంగానివేనని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అన్ని దిగ్గజ బ్యాంకుల్లో కెల్లా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకే తక్కువ మొండిబకాయిలు ఉంటాయి.
నికర వడ్డీ ఆదాయాలు, ఇతర ఆదాయాల నుంచి బ్యాంకుకు లాభాలు చేకూరాయని హెచ్‌డీఎఫ్‌సీ సోమవారం బీఎస్‌ఈకి సమర్పించిన నివేదికలో తెలిపింది. నికర వడ్డీ ఆదాయం(వడ్డీ ద్వారా పొందే ఆదాయాలు, వడ్డీల రూపంలో పెట్టే ఖర్చుల మధ్య ఉన్న తేడా) బ్యాంకుకు 20.4 శాతం పెరిగి, రూ.9,370.4 కోట్లగా నమోదైంది. బ్యాంకు సగటు రుణాల వృద్ధి కూడా 20.7 శాతం పెరిగింది. కోర్ నికర వడ్డీ మార్జిన్లు ఈ క్వార్టర్‌లో 4.4 శాతంగా ఉన్నాయి. ఈ క్వార్టర్‌లో అడ్వాన్సులు 23.4 శాతం పెరిగి రూ.5.8 లక్షల కోట్లగా ఉండగా.. రిటైల్ రుణాల వృద్ధి 21.9 శాతం, హోల్ సేల్ రుణాలు 25.5 శాతం ఉన్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు డిపాజిట్లు కూడా 17 శాతం పెరిగి ఏడాది ఏడాదికి రూ.6.71 లక్షల కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. డిపాజిట్లలో సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు 26.5 శాతం పెరుగగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 34.1 శాతం పెరిగాయి.
Advertisement