Net Interest Income
-
ఐడీఎఫ్సీ ఫస్ట్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ జూన్ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్ ఆవిష్కరణలతో మా రిటైల్ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ తెలిపారు. ఫండెడ్ అసెట్స్ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి. -
బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నిమ్ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. కనుక నిమ్ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే. రుణాల్లో చక్కని వృద్ధి డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్ రేటింగ్స్ ఈ వివరాలను రూపొందించింది. -
యస్ బ్యాంక్.. 80 % జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 266 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే లాభం ఏకంగా 80 శాతం ఎగిసింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ గణనీయంగా తగ్గడం ఇందుకు తోడ్పడింది. నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం వృద్ధి చెంది 2.4 శాతానికి పెరిగినప్పటికీ .. రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 31 శాతం క్షీణించి రూ. 1,764 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో రుణ వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్యూ3లో ప్రొవిజనింగ్ రూ. 2,089 కోట్ల నుంచి ఏకంగా 82 శాతం తగ్గింది. రూ. 375 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. భారీ విలువ రుణాలను తగ్గించుకోవడంతో పాటు కార్పొరేట్లు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి గైడెన్స్‌ను 10 శాతానికి కుదించుకున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఇది 15 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. -
సరికొత్త గరిష్టాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు అంచనాలకు తగ్గ ఫలితాలను విడుదల చేసింది. రెవెన్యూలో అన్ని వైపుల నుంచి బ్యాంకు గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. దీంతో బ్యాంకు లాభాలు 2017-18 తొలి క్వార్టర్లో 20.2 శాతం పైకి ఎగిసి, రూ.3,893.84 కోట్లగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు పెరిగినప్పటికీ, బ్యాంకు ఈ మేర లాభాలు నమోదుచేయడం గమనార్హం. తొలుత స్టాక్ మార్కెట్లో బ్యాంకు అసెట్ క్వాలిటీపై ఆందోళనలు రేకెత్తడంతో షేర్లు పడిపోయాయి. కానీ తమ ఆస్తుల నాణ్యత పెరగడానికి ప్రధాన కారణం, జూన్‌లో రాష్ట్రాలు ప్రకటించిన వ్యవసాయ రుణ మాఫీనేనని చెప్పడంతో బ్యాంకు షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. ప్రస్తుతం 1.59 శాతం జంప్‌చేసి, రూ.1,733 వద్ద ట్రేడవుతోంది. కాగ, బ్యాంకు స్థూల ఎన్‌పీఏల్లో 60 శాతం వ్యవసాయ రంగానివేనని హెచ్డీఎఫ్సీ తెలిపింది. అన్ని దిగ్గజ బ్యాంకుల్లో కెల్లా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకే తక్కువ మొండిబకాయిలు ఉంటాయి. నికర వడ్డీ ఆదాయాలు, ఇతర ఆదాయాల నుంచి బ్యాంకుకు లాభాలు చేకూరాయని హెచ్డీఎఫ్సీ సోమవారం బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో తెలిపింది. నికర వడ్డీ ఆదాయం(వడ్డీ ద్వారా పొందే ఆదాయాలు, వడ్డీల రూపంలో పెట్టే ఖర్చుల మధ్య ఉన్న తేడా) బ్యాంకుకు 20.4 శాతం పెరిగి, రూ.9,370.4 కోట్లగా నమోదైంది. బ్యాంకు సగటు రుణాల వృద్ధి కూడా 20.7 శాతం పెరిగింది. కోర్ నికర వడ్డీ మార్జిన్లు ఈ క్వార్టర్లో 4.4 శాతంగా ఉన్నాయి. ఈ క్వార్టర్లో అడ్వాన్సులు 23.4 శాతం పెరిగి రూ.5.8 లక్షల కోట్లగా ఉండగా.. రిటైల్ రుణాల వృద్ధి 21.9 శాతం, హోల్ సేల్ రుణాలు 25.5 శాతం ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు డిపాజిట్లు కూడా 17 శాతం పెరిగి ఏడాది ఏడాదికి రూ.6.71 లక్షల కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. డిపాజిట్లలో సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు 26.5 శాతం పెరుగగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 34.1 శాతం పెరిగాయి. -
ఐసీఐసీఐ లాభం 2,922 కోట్లు
క్యూ4లో 10 శాతం వృద్ధి... ⇒ నికర వడ్డీ ఆదాయం 5,079 కోట్లు; 17% అప్ ⇒ వదలని మొండిబకాయిల బెడద... ⇒ షేరుకి రూ. 5 డివిడెండ్ ప్రకటన... న్యూఢిల్లీ: దేశీ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు వెంటాడుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 10.2 శాతం వృద్ధి చెంది రూ.2,922 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,652 కోట్లుగా ఉంది. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్(కేటాయింపులు) పెరగడం, రుణ వృద్ధి మందగించడం వంటివి లాభాల వృద్ధిపై ప్రభావం చూపాయి. కాగా, క్యూ4లో బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం రూ.14,465 కోట్ల నుంచి రూ.16,235 కోట్లకు పెరిగింది. 12.2% వృద్ధి చెందింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17% పెరిగి రూ.5,079 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఎన్ఐఐ రూ.4,357 కోట్లుగా ఉంది. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.46 శాతం నుంచి 3.57 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి చూస్తే(2014-15) స్టాండెలోన్ లాభం రూ.10 వేల కోట్లను అధిగమించింది. 2013-14లో నమోదైన రూ.9,810 కోట్లతో పోలిస్తే 14% వృద్ధి చెంది రూ.11,175 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.54,606 కోట్ల నుంచి రూ.61,267 కోట్లకు ఎగసింది. 12.1% వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో విదేశీ మారక(ఫారెక్స్) లావాదేవీలకు సంబంధించిన లాభాలు 3 రెట్ల జంప్‌తో రూ.245 కోట్ల నుంచి రూ.726 కోట్లకు దూసుకెళ్లాయి. లేదంటే... లాభాల వృద్ధి మరింత మందగించేది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే...: బీమా, బ్రోకింగ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి చూస్తే(కన్సాలిడేటెడ్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ4లో 13.24% పెరిగి రూ.3,085 కోట్లకు చేరింది. ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.21,652 కోట్ల నుంచి రూ.24,914 కోట్లకు ఎగసింది. మొండిబకాయిలు పెరిగాయ్... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ4లో 3.78 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 3.03 శాతమే. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.82 శాతం నుంచి 1.4 శాతం పెరిగాయి. దీంతో ప్రొవిజనింగ్ మొత్తం కూడా రెట్టింపై రూ.714 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు చేరింది. క్యూ4లో కొత్తగా రూ.3,260 కోట్ల స్థూల ఎన్పీఏలు జతవగా.. ఇందులో పునర్వ్యవస్థీకరించిన రుణాల వాటా రూ.2,246 కోట్లుకావడం గమనార్హం. మరో రూ.1,500 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ బాటలో ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ బ్యాంక్ రుణ వృద్ధి క్యూ4లో 14%గా ఉంది. దీంతో మార్చి, 2015 నాటికి మొత్తం రుణాల పరిమాణం రూ.3,87,522 కోట్లు. కాగా, రిటైల్ రుణాల్లో 25, కార్పొరేట్ రుణాలు 10% వృద్ధి చెందాయి. ⇒ డిపాజిట్లు 9 శాతం ఎగసి రూ.3,61,563 కోట్లకు చేరాయి. ⇒ జీవిత బీమా అనుంబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం 2014-15లో స్వల్పంగా రూ.1,567 కోట్ల నుంచి రూ.1,634 కోట్లకు పెరిగింది. సాధారణ బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ నికర లాభం రూ. 511 కోట్ల నుంచి రూ.536 కోట్లకు చేరింది. ⇒ రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 5 డివిడెండ్ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1.85 శాతం క్షీణించి రూ.302.4 వద్ద స్థిరపడింది. కొన్ని వ్యాపార విభాగాలకు చెందిన రుణాల్లో సమస్యల కారణంగానే మొండిబకాయిలు పెరిగాయి. అయితే, ఎన్పీఏలకు ఇదే గరిష్టస్థాయి కావచ్చు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. అదే విధంగా రుణాల్లో 20 శాతం, డిపాజిట్ల విషయంలో 16% వృద్ధిని అంచనా వేస్తున్నాం. కార్పొరేట్ రంగం నుంచి ఇంకా డిమాండ్ పుంజుకోవాల్సి ఉంది. దీంతో రిటైల్ రుణాలపైనే అధికంగా దృష్టిపెడుతున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ -
ఎస్బీఐ లాభం 3,349 కోట్లు
ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) లాభాలు వృద్ధి బాటలోకి వచ్చాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 3.3 శాతం పెరిగి రూ.3,349 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,241 కోట్లుగా ఉంది. గత ఆరు క్వార్టర్లలో బ్యాంక్ తొలిసారి లాభాల్లో వృద్ధిని నమోదు చేయడం విశేషం. కాగా, క్యూ1లో ఎస్బీఐ రూ.40,739 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.36,193 కోట్లతో పోల్చిచూస్తే 12.5 శాతం వృద్ధి చెందింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మొండి బకాయిలపై ప్రొవిజనింగ్ మొత్తం ఏకంగా 72 శాతం ఎగబాకి... రూ.3,903 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే వ్యవధికి ఈ మొత్తం రూ.2,266 కోట్లు మాత్రమే. అయినప్పటికీ లాభాలు పెరగడం గమనించదగిన అంశం. కాగా, మార్చి-జూన్ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 15.12 శాతం వృద్ధి చెంది రూ.13,252 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే... అనుబంధ బ్యాంకులు, సంస్థలతో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ క్యూ1లో రూ.4,448 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో రూ.4,299 కోట్లతో పోలిస్తే 3.4 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 15.5 శాతం వృద్ధితో రూ.52,502 కోట్ల నుంచి రూ.60,621 కోట్లకు చేరింది. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ నికర లాభం 70 శాతం ఎగబాకి రూ.67 కోట్ల నుంచి రూ.114 కోట్లకు వృద్ధి చెందింది. మొండి బకాయిల విషయానికొస్తే... మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) ఈ ఏడాది జూన్ చివరినాటికి 4.9 శాతానికి(రూ.60,434 కోట్లు) తగ్గాయి. క్రితం జూన్ ఆఖరికి ఇవి 5.56 శాతంగా(రూ.60,891 కోట్లు) ఉన్నాయి. నికర ఎన్పీఏలు మాత్రం రూ.29,990 కోట్ల నుంచి రూ.31,884 కోట్లకు పెరిగాయి. అయితే, మొత్తం రుణాల్లో చూస్తే 2.83 శాతం నుంచి 2.66 శాతానికి తగ్గడం విశేషం. క్యూ1లో కొత్తగా ఎన్పీఏలుగా మారిన రుణాలు రూ.9,932 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,766 కోట్లతో పోలిస్తే 27 శాతం తగ్గాయి. రుణాల పునర్వ్యవస్థీకరణ కంపెనీ(ఏఆర్సీ)లకు క్యూ1లో ఎస్బీఐ రూ.5,556 కోట్ల ఎన్పీఏలను విక్రయించడం గమనార్హం. అయితే, జూన్ క్వార్టర్లో బ్యాంక్ రూ.3,185 కోట్ల రుణాలను రికవరీ చేసుకుంది. రూ.6,556 కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇక పునర్వ్యవస్థీకరించిన రుణాల విలువ రూ.5,700 కోట్లు కాగా, మరో రూ.3,500 కోట్ల రుణాలు ఈ బాటలో ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ... జూన్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల విలువ రూ.12,32,288 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలాఖరుకి ఈ మొత్తం రూ.10,95,145 కోట్లు. అంటే 12.52 శాతం పెరిగింది. ఇక మొత్తం డిపాజిట్ల విలువ జూన్ నాటికి 12.85శాతం వృద్ధితో రూ.12,57,389 కోట్ల నుంచి రూ.14.18,915 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) దేశీయ కార్యకలాపాలపై క్యూ1లో 3.44% నుంచి 3.54%కి పెరిగింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎస్బీఐ షేరు ధర 0.9 శాతం నష్టంతో రూ.2,415 వద్ద స్థిరపడింది. -
8 శాతం తగ్గిన ఎస్బీఐ నికర లాభం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం నాలుగో త్రైమాసికంలో 8 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 3,041 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. అంతకుముందు త్రైమాసికంలో రూ. 3,299 కోట్లు ఆర్జించింది. బ్యాంకు మొత్తం ఆదాయం ఏడాది కాలంలో రూ. 36,331 కోట్ల నుంచి రూ.42,443 కోట్లకు పెరిగింది. నెట్ ఇంట్రస్ట్ ఆదాయం 16.4 శాతం పెరిగి రూ.12,903 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇది రూ.11,591కోట్లకు పరిమితమైంది. మొండిబకాయిలు పెరగడం వల్ల ఎస్బీఐ నికర లాభం తగ్గిపోయింది.