ఎస్‌బీఐ లాభం 3,349 కోట్లు
ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) లాభాలు వృద్ధి బాటలోకి వచ్చాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 3.3 శాతం పెరిగి రూ.3,349 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,241 కోట్లుగా ఉంది. గత ఆరు క్వార్టర్లలో బ్యాంక్ తొలిసారి లాభాల్లో వృద్ధిని నమోదు చేయడం విశేషం.
కాగా, క్యూ1లో ఎస్‌బీఐ రూ.40,739 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.36,193 కోట్లతో పోల్చిచూస్తే 12.5 శాతం వృద్ధి చెందింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మొండి బకాయిలపై ప్రొవిజనింగ్ మొత్తం ఏకంగా 72 శాతం ఎగబాకి... రూ.3,903 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే వ్యవధికి ఈ మొత్తం రూ.2,266 కోట్లు మాత్రమే. అయినప్పటికీ లాభాలు పెరగడం గమనించదగిన అంశం. కాగా, మార్చి-జూన్ క్వార్టర్‌లో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 15.12 శాతం వృద్ధి చెంది రూ.13,252 కోట్లుగా నమోదైంది.
కన్సాలిడేటెడ్‌గా చూస్తే...
అనుబంధ బ్యాంకులు, సంస్థలతో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్‌బీఐ క్యూ1లో రూ.4,448 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో రూ.4,299 కోట్లతో పోలిస్తే 3.4 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 15.5 శాతం వృద్ధితో రూ.52,502 కోట్ల నుంచి రూ.60,621 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ నికర లాభం 70 శాతం ఎగబాకి రూ.67 కోట్ల నుంచి రూ.114 కోట్లకు వృద్ధి చెందింది.
మొండి బకాయిల విషయానికొస్తే...
మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) ఈ ఏడాది జూన్ చివరినాటికి 4.9 శాతానికి(రూ.60,434 కోట్లు) తగ్గాయి. క్రితం జూన్ ఆఖరికి ఇవి 5.56 శాతంగా(రూ.60,891 కోట్లు) ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం రూ.29,990 కోట్ల నుంచి రూ.31,884 కోట్లకు పెరిగాయి. అయితే, మొత్తం రుణాల్లో చూస్తే 2.83 శాతం నుంచి 2.66 శాతానికి తగ్గడం విశేషం. క్యూ1లో కొత్తగా ఎన్‌పీఏలుగా మారిన రుణాలు రూ.9,932 కోట్లుగా ఉన్నాయి.
క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,766 కోట్లతో పోలిస్తే 27 శాతం తగ్గాయి. రుణాల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీ(ఏఆర్‌సీ)లకు క్యూ1లో ఎస్‌బీఐ రూ.5,556 కోట్ల ఎన్‌పీఏలను విక్రయించడం గమనార్హం. అయితే, జూన్ క్వార్టర్‌లో బ్యాంక్ రూ.3,185 కోట్ల రుణాలను రికవరీ చేసుకుంది. రూ.6,556 కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇక పునర్‌వ్యవస్థీకరించిన రుణాల విలువ రూ.5,700 కోట్లు కాగా, మరో రూ.3,500 కోట్ల రుణాలు ఈ బాటలో ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది.
ఇతర ముఖ్యాంశాలివీ...
జూన్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల విలువ రూ.12,32,288 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలాఖరుకి ఈ మొత్తం రూ.10,95,145 కోట్లు. అంటే 12.52 శాతం పెరిగింది.
ఇక మొత్తం డిపాజిట్ల విలువ జూన్ నాటికి 12.85శాతం వృద్ధితో రూ.12,57,389 కోట్ల నుంచి రూ.14.18,915 కోట్లకు ఎగబాకింది.
నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) దేశీయ కార్యకలాపాలపై క్యూ1లో 3.44% నుంచి 3.54%కి పెరిగింది.
ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎస్‌బీఐ షేరు ధర 0.9 శాతం నష్టంతో రూ.2,415 వద్ద స్థిరపడింది.