ఎస్‌బీఐ రూ. 5,000 కోట్ల మొండిబకాయిల సేల్!
ముంబై: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని తగ్గించుకునే దిశగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చకాచకా అడుగులు వేస్తోంది. రెండు వందల సంవత్సరాల చరిత్రలో మొదటిసారి దాదాపు రూ. 5,000 కోట్ల ఎన్‌పీఏలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థలకు (ఏఆర్‌సీ-ఆర్క్స్) విక్రయించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినెల మార్చిఆఖరునాటికే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎస్‌బీఐ మొత్తం రూ. 11,39,326 కోట్ల అసెట్స్‌లో (బ్యాంకు ఇచ్చిన రుణాల్లో) స్థూల ఎన్‌పీఏలు 5.73 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. విలువ రూపంలో ఎన్‌పీఏల పరిమాణం దాదాపు రూ.67,799 కోట్లు. ఏప్రిల్ నుంచి ప్రొవిజనింగ్ నిబంధనల (నిర్వహణా లాభాల నుంచి ఎన్‌పీఏలకు జరిగే కేటాయింపు) కఠినతరం అవుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పునర్‌వ్యవస్థీకరణ రుణాలకు ప్రొవిజనింగ్ ప్రస్తుత 2 శాతం నుంచి 5 శాతానికి పెరగనుంది.
‘‘ప్రస్తుతం 14 ఏఆర్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మా మొండిబకాయిల మొత్తాల్లో దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ఎన్‌పీఏలను విక్రయించడానికి వీటిలో (ఏఆర్‌సీ) పలు సంస్థలను ఆహ్వానించాం. అధిక బిడ్డర్లకు ఎన్‌పీఏల్లో అధిక మొత్తాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరుకే ప్రక్రియను పూర్తిచేయాలన్న నిశ్చయంలో ఉన్నాం’’ అని సీనియర్ ఎస్‌బీఐ అధికారి వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయాన్ని బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య మార్చి 8వ తేదీనే ప్రకటించారు. అయితే నిర్దిష్టంగా ఎంతమొత్తమన్న విషయాన్ని వెల్లడించలేదు. కొనుగోలు చేస్తున్న మొండిబకాయిల్లో 5 నుంచి 10 శాతం వరకూ నగదు రూపంలో తక్షణం ఏఆర్‌సీలు చెల్లిస్తాయి. మిగిలిన మొత్తాలు సెక్యూరిటీ రిసిట్స్(ఎస్‌ఆర్) రూపంలో ఉంటాయని ఇంతక్రితం ఎస్‌బీఐ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి.