ఎస్‌బీఐ ఉద్యోగులకు తక్కువ రేటుకే షేర్లు!
కోల్‌కతా: తమ ఉద్యోగులందరికీ మార్కెట్ ధరకంటే తక్కువ(డిస్కౌంట్)లో షేర్ల విక్రయాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ పేర్కొంది. తద్వారా రూ. 1,200 కోట్ల వరకూ సమీకరించనున్నట్లు బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. అయితే ఇది ఇసాప్(ఈఎస్‌వోపీ) వంటిదికాదని తెలిపారు. బ్యాంక్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఇక్కడకు విచ్చేసిన అరుంధతి ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం ఉద్యోగులకు జారీచేయబోయే షేరు ధర తదితర వివరాలను వెల్లడించలేనంటూ అశక్తతను వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులందరికీ షేర్ల కొనుగోలు అవకాశాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. అన్ని అనుమతులు లభించాక వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఉద్యోగులకు షేర్ల విక్రయాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఇక్కడ రాజహాట్‌లోని టాటా మెడికల్ సెంటర్‌కు స్కానింగ్ పరికరం కొనుగోలు కోసం బ్యాంకు రూ. 6 కోట్లను డొనేట్ చేసిన సందర్భంగా అరుంధతి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా షేర్ల విక్రయ విషయాలను వెల్లడించారు. డిసెంబర్ చివరికి బ్యాంకు 2.23 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది.