న్యూఢిల్లీ: బ్యాంకులు ఎన్‌పీఏల భారాన్ని తగ్గించుకునే కసరత్తులో భాగంగా తమ మధ్య కుదిరిన ఒప్పందాల (ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్/ఐసీఏ)ను అమల్లోకి తీసుకురానున్నాయి. తద్వారా మధ్య స్థాయి ఎన్‌పీఏ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయనున్నాయి. ఏడు నెలల క్రితం బ్యాంకులు అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ప్రకారం మైనారిటీ రుణదాతలు మెజారిటీ రుణదాతల నిర్ణయాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ లిమిటెడ్ కేసుల విషయంలో ఈ అంతర్గత ఒప్పందాలను అమలు చేయనున్నట్టు సీనియర్ బ్యాంకర్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లోనూ పరిష్కార ప్రణాళికలను ఒప్పందాలకు ముందే రుణదాతలు ఖరారు చేయడం గమనార్హం. అయితే, కొన్ని బ్యాంకులు ఇంకా తమ ఆమోదం తెలియజేయాల్సి ఉంది. జీఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీ కేసు విషయంలో ఈ కంపెనీని అదానీ పవర్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు రుణదాతలు అంగీకరించారు. మొత్తం రూ.8,000 కోట్ల రుణంలో 53 శాతాన్ని బ్యాంకులు ‘హేర్‌కట్’ రూపంలో నష్టపోనున్నాయి. అయితే, జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీకి తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు ఈ పరిష్కార ప్రణాళికను ఇంకా ఆమోదించాల్సి ఉంది. హెచ్‌సీసీకి సంబంధించిన రుణ పరిష్కార ప్రణాళికకు మాత్రం చాలా వరకు రుణదాతలు అంగీకారం తెలిపారు. అయితే, రుణమిచ్చిన ఒక సంస్థ మాత్రం తొలుత అంగీకారం తెలిపి ఆ తర్వాత పరిష్కార ప్రణాళికకు ఆమోదం విషయంలో వెనక్కి తగ్గింది. ఈ ప్రణాళిక కింద రూ.4,900 కోట్ల రుణంలో సగాన్ని దీర్ఘకాలిక క్యుములేటివ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లుగా మార్చడంతోపాటు, మిగిలిన రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించేలా పరిష్కారం ఉంది. ఈ రెండు పరిష్కార ప్రణాళికలు ఇప్పుడు తుది ఆమోదం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ పరిశీలన కమిటీ ముందున్నాయి. కాగా ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కమిటీ జెట్ ఎయిర్‌వేస్ కేసులో సంయుక్త ప్రణాళికను అమల్లో పెడుతోంది. ఇదీ అంతర్గత ఒప్పందమే.
ఐసీఏ కీలకం..
ఎన్‌పీఏల పరిష్కారానికి గతేడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ తీసుకొచ్చిన నూతన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల మధ్య అంతర్గత ఒప్పందాలు అనేవి ఎంతో కీలకం కానున్నాయి. రుణాల చెల్లింపుల్లో విఫలమైన సంస్థకు సంబంధించిన ఎన్‌పీఏల పరిష్కార ప్రణాళికకు, రుణాలిచ్చిన అన్ని సంస్థలు తప్పనిసరిగా ఆమోదం తెలియజేడం ద్వారానే అవి విజయవంతం అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదన్నది బ్యాంకర్ల అభిప్రాయం. అయితే, బ్యాంకుల మధ్య ఒప్పందం ప్రకారం 66 శాతం రుణదాతలు ఆమోదం తెలిపినా అమలు చేయడం సాధ్యపడుతుంది. పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలియజేయడం ఇష్టం లేని సంస్థలు తమ ఎక్స్‌పోజర్‌ను విక్రయించి తప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేటు రంగంలోని పెద్ద బ్యాంకులు ఐసీఏపై ఇప్పటికే సంతకాలు చేశాయి. రుణాల్లో తక్కువ వాటాలు ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంకు ఈ ప్రక్రియకు దూరంగా ఉంది. అలాగే, విదేశీ బ్యాంకులు కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2018 జూలైలో ఐసీఏపై 34 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సంతకాలు చేయగా, ఇటీవలే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కూడా ఇందులో చేరింది. దీంతో సంఖ్య 35కు చేరింది.
బ్యాంకుల అంతర్గత ఒప్పందాలు
Published Sat, Feb 23 2019 12:56 AM | Last Updated on Sat, Feb 23 2019 4:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment