ఎన్‌పీఏలు ఇంకా పెరుగుతాయి  | Banks treating RBI 15-day window as grace period on NPAs | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఏలు ఇంకా పెరుగుతాయి 

Published Thu, Aug 30 2018 1:27 AM | Last Updated on Thu, Aug 30 2018 8:52 AM

 Banks treating RBI 15-day window as grace period on NPAs - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు ఇప్పటికే భారీ స్థాయిలో మొండి బకాయిల (ఎన్‌పీఏలు) భారాన్ని మోస్తుండగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవింకా పెరుగుతాయని ఆర్‌బీఐ స్వయంగా పేర్కొంది. అలాగే, జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని అంచనా చేసింది. ఎఫ్‌డీఐలకు భారత్‌ ఇక ముందూ స్వర్గధామంగా ఉంటుందని, రద్దయిన పెద్ద నోట్లలో 99.3 శాతం మేర తిరిగి వ్యవస్థలోకి ప్రవేశపెట్టామని వివరించింది. ఈ మేరకు 2017–18 వార్షిక నివేదికను ఆర్‌బీఐ బుధవారం విడుదల చేసింది. ఆర్‌బీఐ అకౌంటింగ్‌ సంవత్సరం జూలైతో ప్రారంభమై జూన్‌తో అంతమవుతుంది.  

ఎన్‌పీఏలు పెరుగుతాయి... 
2018 మార్చి నాటికి బ్యాంకింగ్‌ రంగంలోని మొత్తం రుణాల్లో... స్థూల ఎన్‌పీఏలు, పునరుద్ధరించిన ఒత్తిడిలోని రుణాలు కలిపి 12.1 శాతానికి చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఏలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపులు పెరగడం, మార్క్‌ టు మార్కెట్‌ (ఎంటీఎం) ట్రెజరీ నష్టాలు పెరగడం వల్లే బ్యాంకులు గడిచిన ఆర్థిక సంవత్సరానికి నికరంగా నష్టాలు ప్రకటించాల్సి వచ్చిందని వివరించింది. నివారణ చర్యగా మూడో త్రైమాసికం నుంచి ఎంటీఎం నష్టాలను నాలుగు త్రైమాసికాల పరిధిలో చూపించుకునేందుకు బ్యాంకులను అనుమతించినట్టు తెలిపింది. ఆర్‌బీఐ నిర్వహించే పరిశీలనలతో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్‌పీఏల రేషియో 2018–19 ఆర్థిక సంవత్సరానికి మరింత పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. వసూలు కాని ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్‌పీఏలుగా గుర్తించే పారదర్శకత విధానం కారణంగా... 2015 మార్చి నాటికి రూ.2,23,464 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలు... 2018 మార్చి నాటికి రూ.10,35,528 కోట్లకు పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆస్తుల నాణ్యత (రుణాలు) క్షీణించడం, బాసెల్‌–3 అమలు బ్యాంకుల మూలధన నిధులకు ఇబ్బంది కలుగుతుందని, అయితే, రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా సమస్యలు ఎదుర్కొనే ప్రభుత్వరంగ బ్యాంకులకు బడ్జెట్‌ మద్దతు లభించనుందని తెలిపింది. ఆర్‌బీఐ దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) 2017 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రాగా, ఇందులో 11 ప్రభుత్వరంగ బ్యాంకులను చేర్చడం జరిగిందని, వాటి క్యాపిటల్‌ మరింత తుడిచిపెట్టుకుపోకుండా ఈ చర్య తీసుకున్నట్టు వివరించింది.  

వృద్ధి 7.4 శాతం...
గత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతానికి పుంజుకుంటుందని ఆర్‌బీఐ మరోసారి పేర్కొంది. పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వర్షాలు బాగుండడం ఇందుకు తోడ్పడతాయని పేర్కొంది. సాధారణ వర్షాలతో వరుసగా మూడో ఏడాది వ్యవసాయ ఉత్పత్తి పెరగనుందని అంచనా వ్యక్తం చేసింది. మధ్య కాలానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యంతో (రెండు పాయింట్లు అటూ, ఇటుగా) మానిటరీ పాలసీ కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.  

ఎఫ్‌డీఐలపై ఆశాభావం 
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలు) ఇకపైనా భారత్‌ చిరునామాగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ‘‘తయారీ రంగం ఊపులో ఉండటం, సేవల రంగం, వ్యవసాయ రంగాల తోడ్పాటుతో వినియోగ డిమాండ్‌ బలంగా ఉంటుంది. ఇదే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుంది. 2017–18లో 37.3 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు మన దేశంలోకి వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐలు 36.3 బిలియన్‌ డాలర్లు, 36.06 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి’’ అని ఆర్‌బీఐ తెలిపింది. విదేశీ పెట్టుబడుల రాక మారిషస్, సింగపూర్‌ నుంచే 61% ఉన్నట్టు పేర్కొంది.  

కేంద్రానికి రూ.50,000 కోట్లు 
2018 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ తన మిగులు నిల్వలు రూ.50,000 కోట్లను డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 63.08 శాతం ఎక్కువ. 2016–17లో రూ.30,659 కోట్లనే కేంద్రానికి జమ చేసింది. 

నోట్ల రద్దు లక్ష్యాలు   చాలా నెరవేరాయి: కేంద్రం 
పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా వరకు లక్ష్యాలు నెరవేరాయని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. నల్లధన ప్రవాహానికి కళ్లెం వేసేందుకు ఇది సాయపడిందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. రద్దయిన పెద్ద నోట్లలో 99.3% వెనక్కి వచ్చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటనతో, కేవలం రూ.13,000 కోట్ల కోసం దేశం ఎంతో మూల్య ం చెల్లించాల్సి వచ్చిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రశ్నలకు గార్గ్‌ స్పందిస్తూ... ‘‘ఉగ్రవాదులకు నిధుల సాయానికి డీమోనిటైజేషన్‌ చెక్‌ పెట్టింది. డిజిటల్‌ చెల్లింపులను పెంచింది. గతంతో పోలిస్తే వ్యవస్థలో ఇప్పుడు రూ.3–4 లక్షల కోట్ల మేర నగదు తక్కువగా ఉంది’’ అని పేర్కొన్నారు. నల్లధనం అంతా నగదు రూపంలోనే లేదని, రియల్టీ, బంగారం, ఇతర మార్గాల్లోనూ ఉందని పేర్కొన్నారు.

పెద్ద నోట్లన్నీ తిరిగొచ్చేశాయి... 
2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్‌ కారణంగా రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లలో 99.3 శాతం మేర బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చేశాయని ఆర్‌బీఐ తెలిపింది. ‘‘2016 నవంబర్‌ 8 నోట్ల రద్దు నాటికి రూ.500, రూ.1,000 నోట్లు రూ.15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉండగా, బ్యాంకులు రూ.15.31 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను స్వీకరించాయి. అంటే కేవలం రూ.10,720 కోట్ల మేర రద్దయిన నోట్లే తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాలేదు’’ అని ఆర్‌బీఐ తన నివేదికలో వివరించింది. రద్దయిన నోట్ల స్థానంలో తిరిగి రూ.500, రూ.2,000 నోట్లతోపాటు ఇతర నోట్ల ముద్రణకు గాను 2016–17లో రూ.7,965 కోట్లు, 2017–18లో మరో రూ.4,912 కోట్ల మేర ఖర్చు చేసినట్టు తెలిపింది. 2015–16లో నోట్ల ముద్రణకు గాను రూ.3,421 కోట్లు ఖర్చు పెట్టినట్టు నివేదిక తెలియజేస్తోంది. ఈ నోట్ల ముద్రణ ఖర్చు పెరగడం వల్ల ఆర్‌బీఐ లాభాలు కూడా తగ్గాయి. బ్యాంకుల ద్వారా తనకు చేరిన రద్దయిన నోట్ల లెక్కింపునకు రెండేళ్లకు పైగా సమయం పట్టిందని, ఎట్టకేలకు ఈ కార్యక్రమం ముగిసిందని నివేదికలో
ఆర్‌బీఐ పేర్కొంది. తగ్గిన నకిలీ నోట్లు: నల్లధనం, అవినీతి నియంత్రణ, నకిలీ కరెన్సీకి చెక్‌ పెట్టాలన్నది డీమోనిటైజేషన్‌ లక్ష్యమన్న ఆర్‌బీఐ.. రూ.500, రూ.1,000 నోట్లకు సంబంధించి గుర్తించిన నకిలీ నోట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 59.7 శాతం మేర తగ్గినట్టు తెలిపింది. కానీ, రూ.100 నోట్ల విషయంలో మాత్రం నకిలీ నోట్ల గుర్తింపు 35 శాతం, రూ.50 నోట్ల విషయంలో నకిలీ నోట్లు 154 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement