రుణ వృద్ధి మందగమనానికి ఎన్పీఏలే కారణం
అధిక వడ్డీరేట్లు కారణం కాదన్న రాజన్
బెంగళూరు: మొండి బకాయిలకు (ఎన్‌పీఏ) సంబంధించి బ్యాంకింగ్ ఎదుర్కొంటున్న ఒత్తిడే బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగమనానికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం పేర్కొన్నారు. రుణ వృద్ధి మందగమనానికి అధిక వడ్డీరేట్ల వ్యవస్థ కారణమన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ‘బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల సమస్య పరిష్కారం’ అనే అంశంపై పారిశ్రామిక సంస్థ- అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజన్ మాట్లాడారు. వడ్డీరేట్లు తగ్గిస్తే... రుణ వృద్ధి బాగుంటుందని భావించడం సరికాదని పేర్కొన్నారు.
ఎన్‌పీఏల సమస్య ఉన్నప్పటికీ పరిశ్రమలకు ప్రత్యేకించి మౌలిక రంగానికి బ్యాంకింగ్ తగిన రుణ అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారమయితే.. అది వడ్డీరేట్ల తగ్గింపునకూ దోహదపడుతుందని వివరించారు. 2015-16లో రుణ వృద్ధి రేటు ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయిలో 8.6%కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇదే సంవత్సరంలో మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 % నుంచి 8%కి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటు తర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50% తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5%కి దిగివచ్చింది.
బ్యాంకింగ్ మూలధనానికి ఆర్‌బీఐ మిగులు నిధులు సరికాదు
కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన కల్పనకు ఆర్‌బీఐ మిగులు నిధులు సమకూర్చాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం రూపొందించిన ఆర్థిక సర్వే చేసిన సూచనలను రాజన్ తోసిపుచ్చారు. ఇది తగిన ఆలోచన కాదని, పరస్పర ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తుందన్నారు. అయితే వీలయినంత ఎక్కువ డివిడెండ్‌ను ఆర్‌బీఐ ప్రభుత్వానికి చెల్లిస్తే.. తద్వారా ప్రభుత్వం బ్యాంకింగ్‌కు తగిన మూలధనం సమకూర్చగలుతుందనీ వ్యాఖ్యానించారు. అంతేగానీ ఆర్‌బీఐ తనకుతానుగా ప్రత్యక్షంగా బ్యాంకింగ్‌కు నిధుల సమకూర్చడం సరైన ఆలోచన కాదని వివరించారు. 2010-11లో ఆర్‌బీఐ రూ.15,009 కోట్ల మిగులును కేంద్రానికి బదలాయించింది. 2014-15కి ఇది రూ.65,896 కోట్లకు పెరిగింది.
మోసాలపై నిఘా..: ఉద్దేశపూర్వక ఎగవేతదారులను గుర్తించేందుకు, బ్యాంకింగ్ మోసాల నివారణకు, ఆయా సమాచారాన్ని విచారణా సంస్థలకు అందించేందుకు ఒక కమిటీని ఆర్‌బీఐ ఏర్పాటు చేసినట్లు రాజన్ తెలిపారు. తప్పు చేసిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరని అన్నారు.
జాబితా నుంచి నన్ను తీసేయవద్దు..: తాను పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకున్నానన్న ధోరణిలో కొందరు రాస్తున్న వ్యాసాలను గత కొద్ది రోజులుగా చూస్తున్నానని రాజన్ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో నవ్వులు పూయిం చాయి. సెంట్రల్ బ్యాంక్ నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా పలు అంశాలపై దేశంతో తన అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘‘ఇంకా నేను బాధ్యతల్లోనే కొనసాగుతున్నాను. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఉంటాను. బహుశా భారత్‌లోనే ఎక్కువ కాలం గడపొచ్చు. కనుక నన్ను జాబితాలోనుంచి తీసేయకండి’’ అని రాజన్ నవ్వుతూ అన్నారు.