న్యూఢిల్లీ : ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చూసిన వారికి ‘గాంధీగిరి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్యాయం చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పడానికి హింసామార్గంలో కాదు...గాంధీమార్గంలో కూడా బుద్ధి చెప్పవచ్చని చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే మొండి బకాయిలను వసూలు చేయాడానికి ప్రస్తుతం పీఎన్‌బీ ఇదే మార్గాన్ని ఎంచుకుంది. పీఎన్‌బీ ప్రస్తుత పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ ఇద్దరు కలిసి పంజాబ్ బ్యాంక్‌లో 13 వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.
పేరుకుపోయిన ఎన్‌పీఏల వసూళ్ల గురించి రోజురోజుకు ఆందోళనలు పెరగడంతో వాటి వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో పీఎన్‌బీ ఈ ‘గాంధీగిరి’కి శ్రీకారం చుట్టింది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ ‘గాంధీగిరి’ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసి నెలకు రూ.100-150 కోట్ల రూపాయల వరకు రుణాలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ‘గాంధీగిరి’ విధానంలో ఉద్యోగులు రుణం తీసుకుని చెల్లించని వారి నివాసాలు, కార్యలయాల ముందు మౌనంగా కూర్చుంటారు. ఉద్యోగులు ఇలా చేయడాన్ని అవమానంగా భావించి అయిన అప్పు తీసుకున్నవాళ్లు రుణం చెల్లిస్తారనే ఉద్దేశ్యంతో బ్యాంకు ‘గాంధీగిరి’ని ప్రారంభించింది. దీన్ని అమలు చేయడానికి 1,144 మంది ఉద్యోగులను కూడా నియమించింది.
ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల విషయంలో జారీ చేసిన ఆదేశాల మేరకు పీఎన్‌బీ గత కొన్ని వారాల నుంచి దీన్ని చాలా కఠినంగా అమలుచేస్తోంది. తాము ఇప్పటికే 1,084 వేల మందిని ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులుగా గుర్తించామని, వారిలో 260 ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఎగవేతదారుల విషయంలో తాము కఠిన చర్యలు తీసుకున్నామని, 150 మంది పాస్‌పోర్టులను సైతం స్వాధీనం చేసుకున్నామని, 37మందిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశామని చెప్పారు.
ఇకనుంచి రుణాల మంజూరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని అందుకు గాను ఒక ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీతో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ఈ భాగస్వామ్యం వల్ల రుణాల వసూలు సులభతరం అవ్వడమే కాక క్రెడిట్, ఫ్రాడ్ రిస్క్‌ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందిని బ్యాంకు అధికారులు చెప్పారు. ఎన్‌పీఏల వసూలు కోసం వన్ టైం సెటిల్మెంట్ విధానాలను తీసుకువచ్చామని, ఫలితంగా ఒక సంవత్సర కాలంలో 70-80 వేల ఎన్‌పీఏల దగ్గర రుణాలు వసూలు చేశామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. 2017, డిసెంబర్ నాటికి పీఎన్‌బీలో 57,519కోట్ల రూపాయల ఎన్‌పీఏలు ఉన్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment