gandhi giri
-
హైదరాబాద్‌లో పీఎన్బీ ‘గాంధీగిరి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు (ఎన్పీఏ) రికవరీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సంధించిన గాంధీగిరి అస్త్రం బాగానే పనిచేస్తోంది. గతేడాది కాలంగా హైదరాబాద్‌లో మిషన్ గాంధీగిరితో రూ.27.27 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఇందులో హైదరాబాద్, వైజాగ్‌లల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రూ.12.52 కోట్లు, ప్రముఖ జువెల్లరీ షాప్ నుంచి రూ.9 కోట్లు రికవరీ చేసినట్లు బ్యాంక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో 1,084 మంది ఎగవేతదారులు.. రుణ రికవరీ, రిస్క్ మేనేజ్మెంట్, డాటా అనలిటిక్స్ వంటి నిర్వహణ కోసం ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 1,084 మంది రుణ ఎగవేతదారుల పేర్లను ప్రకటించింది. ఇందులో 260 మంది ఫొటోలను డిఫాల్టర్లంటూ వార్తా పత్రికల్లో ప్రచురించింది కూడా. గత కొన్ని నెలలుగా 150 మంది డిఫాల్టర్ల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుంది. గత 9 నెలల కాలంలో 37 మంది డిఫాల్టర్ల మీద ఎఫ్ఐఆర్ కేసులను నమోదు చేసింది కూడా. ప్లకార్డులతో గాంధీగిరి ప్రదర్శన.. గతేడాది మేలో పీఎన్బీ మిషన్ గాంధీగిరిని ప్రారంభించింది. పీఎన్బీ అన్ని సర్కిళ్లలో మిషన్ గాంధీగిరి కోసం ప్రత్యేక బృందాలను నియమిం చారు. ప్రస్తుతం 1,144 ఫీల్డ్ స్టాఫ్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. రుణ ఎగవేతదారుల పేర్లను, ఫొటోలను సమాజంలోకి తీసుకొచ్చి వారి పరువును బజారుకీడ్చి రుణ వసూలు చేయడమే ఈ మిషన్ గాంధీగిరి లక్ష్యం. సర్కిల్లోని ఎన్పీఏ సంఖ్యను బట్టి రోజు లేదా వారం వారీగా బృందం పర్యటన ఉంటుంది. మిషన్ గాంధీగిరి ఎలా పనిచేస్తుందంటే.. ఎగ వేతదారుల ఇళ్లకు, ఆఫీసులకు గాంధీగిరి బృందం వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఎగవేతదారుడని తెలిసేలా ప్లకార్డులు, టీ–షర్టులు, క్యాప్‌లను ప్రదర్శిస్తుంటారు. ‘‘ఇది ప్రజల సొమ్ము– దయచేసి తిరిగి రుణాన్ని కట్టేయండని’’ ప్లకార్డుల మీద రాసి ఉంటుంది. ఎగవేతదారుల కార్ల మీద రికవరీ టీం డిఫాల్టర్ అని రాసిపెట్టేస్తారు. -
పీఎన్బీ ‘గాంధీగిరి’, ఇక వారికి చుక్కలే..!
న్యూఢిల్లీ : ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చూసిన వారికి ‘గాంధీగిరి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్యాయం చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పడానికి హింసామార్గంలో కాదు...గాంధీమార్గంలో కూడా బుద్ధి చెప్పవచ్చని చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే మొండి బకాయిలను వసూలు చేయాడానికి ప్రస్తుతం పీఎన్బీ ఇదే మార్గాన్ని ఎంచుకుంది. పీఎన్బీ ప్రస్తుత పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ ఇద్దరు కలిసి పంజాబ్ బ్యాంక్‌లో 13 వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. పేరుకుపోయిన ఎన్పీఏల వసూళ్ల గురించి రోజురోజుకు ఆందోళనలు పెరగడంతో వాటి వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో పీఎన్బీ ఈ ‘గాంధీగిరి’కి శ్రీకారం చుట్టింది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ ‘గాంధీగిరి’ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసి నెలకు రూ.100-150 కోట్ల రూపాయల వరకు రుణాలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ‘గాంధీగిరి’ విధానంలో ఉద్యోగులు రుణం తీసుకుని చెల్లించని వారి నివాసాలు, కార్యలయాల ముందు మౌనంగా కూర్చుంటారు. ఉద్యోగులు ఇలా చేయడాన్ని అవమానంగా భావించి అయిన అప్పు తీసుకున్నవాళ్లు రుణం చెల్లిస్తారనే ఉద్దేశ్యంతో బ్యాంకు ‘గాంధీగిరి’ని ప్రారంభించింది. దీన్ని అమలు చేయడానికి 1,144 మంది ఉద్యోగులను కూడా నియమించింది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల విషయంలో జారీ చేసిన ఆదేశాల మేరకు పీఎన్బీ గత కొన్ని వారాల నుంచి దీన్ని చాలా కఠినంగా అమలుచేస్తోంది. తాము ఇప్పటికే 1,084 వేల మందిని ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులుగా గుర్తించామని, వారిలో 260 ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఎగవేతదారుల విషయంలో తాము కఠిన చర్యలు తీసుకున్నామని, 150 మంది పాస్‌పోర్టులను సైతం స్వాధీనం చేసుకున్నామని, 37మందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశామని చెప్పారు. ఇకనుంచి రుణాల మంజూరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని అందుకు గాను ఒక ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీతో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ఈ భాగస్వామ్యం వల్ల రుణాల వసూలు సులభతరం అవ్వడమే కాక క్రెడిట్, ఫ్రాడ్ రిస్క్‌ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందిని బ్యాంకు అధికారులు చెప్పారు. ఎన్పీఏల వసూలు కోసం వన్ టైం సెటిల్మెంట్ విధానాలను తీసుకువచ్చామని, ఫలితంగా ఒక సంవత్సర కాలంలో 70-80 వేల ఎన్పీఏల దగ్గర రుణాలు వసూలు చేశామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. 2017, డిసెంబర్ నాటికి పీఎన్బీలో 57,519కోట్ల రూపాయల ఎన్పీఏలు ఉన్నాయని సమాచారం. -
గాంధీగిరి గెలిచింది
యథాస్థానంలో గాంధీజీ విగ్రహం ఏర్పాటు ఫలించిన వైఎస్సార్ సీపీ పోరాటం ఇబ్రహీంపట్నం : వైఎస్సార్ సీపీ ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. తమ తప్పును తెలుసుకున్నారు. కూల్చివేసిన స్థానంలోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి ఆదివారం ఏర్పాటుచేశారు. పుష్కర పనుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటీవల అర్ధరాత్రి అధికారులు తొలగించి సమీపంలో ఉన్న బుడమేరు కాలువలో పడేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కూల్చివేయించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండించారు. ఫలించిన వైఎస్సార్ సీపీ పోరాటం మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడంపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నేతృత్వంలో మహాత్ముడు చూపిన బాటలోనే శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆయనకు స్థానిక పార్టీ నాయకులు, ప్రజలు సహకారం అందించంతో పోరాటం ఫలించింది. సబ్ కలెక్టర్ సృజన, వెస్ట్ జోన్ ఏసీపీ జి.రామకృష్ణ తదితరులు జోగి రమేష్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తొలగించిన ప్రాంతంలోనే గాంధీజీ విగ్రహం ఏర్పాటుకు అంగీకరించారు. ఈ మేరకు రింగ్ సెంటర్లో ఆరున్నర అడుగుల గాంధీజీ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం పునర్ప్రతిష్టించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు ఆనందం వ్యక్తంచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : జోగి రమేష్ గాంధీజీ నూతన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్ముని విగ్రహాన్ని కూల్చివేసి కాలువలో పడేసిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహాత్ముని విగ్రహం పునర్ ప్రతిష్టించేందుకు నిర్వహించిన ప్రజాందోళనలో పాల్గొన్న నాయకులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీలు జోగి మోహనరావు, చెరుకు మాధవరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి, సీనియర్ నాయకుడు మేడపాటి నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుకుమల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకులు ఆవుల సీతారామయ్య, కరుకుమల్లి వీరాంజనేయులు, సింగలూరి కేథారేశ్వరరావు, వార్డు సభ్యులు తదితరులు గాంధీజీకి నివాళులర్పించారు. నేడు ఇబ్రహీంపట్నం రానున్న వైఎస్సార్ సీపీ నేతలు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నేతలు సోమవారం ఇబ్రహీంపట్నం రానున్నారని జోగి రమేష్ తెలిపారు. ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు కేపీ సారథి వస్తారని చెప్పారు.