గాంధీగిరి గెలిచింది
గాంధీగిరి గెలిచింది
Published Sun, Aug 7 2016 11:50 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
యథాస్థానంలో గాంధీజీ విగ్రహం ఏర్పాటు
ఫలించిన వైఎస్సార్ సీపీ పోరాటం
ఇబ్రహీంపట్నం :
వైఎస్సార్ సీపీ ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. తమ తప్పును తెలుసుకున్నారు. కూల్చివేసిన స్థానంలోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి ఆదివారం ఏర్పాటుచేశారు. పుష్కర పనుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటీవల అర్ధరాత్రి అధికారులు తొలగించి సమీపంలో ఉన్న బుడమేరు కాలువలో పడేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కూల్చివేయించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండించారు.
ఫలించిన వైఎస్సార్ సీపీ పోరాటం
మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడంపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నేతృత్వంలో మహాత్ముడు చూపిన బాటలోనే శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆయనకు స్థానిక పార్టీ నాయకులు, ప్రజలు సహకారం అందించంతో పోరాటం ఫలించింది. సబ్ కలెక్టర్ సృజన, వెస్ట్ జోన్ ఏసీపీ జి.రామకృష్ణ తదితరులు జోగి రమేష్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తొలగించిన ప్రాంతంలోనే గాంధీజీ విగ్రహం ఏర్పాటుకు అంగీకరించారు. ఈ మేరకు రింగ్ సెంటర్‌లో ఆరున్నర అడుగుల గాంధీజీ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం పునర్‌ప్రతిష్టించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు ఆనందం వ్యక్తంచేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : జోగి రమేష్
గాంధీజీ నూతన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్ముని విగ్రహాన్ని కూల్చివేసి కాలువలో పడేసిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహాత్ముని విగ్రహం పునర్ ప్రతిష్టించేందుకు నిర్వహించిన ప్రజాందోళనలో పాల్గొన్న నాయకులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీలు జోగి మోహనరావు, చెరుకు మాధవరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి, సీనియర్ నాయకుడు మేడపాటి నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుకుమల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకులు ఆవుల సీతారామయ్య, కరుకుమల్లి వీరాంజనేయులు, సింగలూరి కేథారేశ్వరరావు, వార్డు సభ్యులు తదితరులు గాంధీజీకి నివాళులర్పించారు.
నేడు ఇబ్రహీంపట్నం రానున్న వైఎస్సార్ సీపీ నేతలు
మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నేతలు సోమవారం ఇబ్రహీంపట్నం రానున్నారని జోగి రమేష్ తెలిపారు. ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు కేపీ సారథి వస్తారని చెప్పారు.
Advertisement
Advertisement