ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం
* ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం
* రికార్డు స్థాయిలో లోక్‌సభ సభ్యుల ప్రమాణం
* సంప్రదాయ దుస్తులు, పలకరింపులు, అభినందనలతో ఉల్లాస వాతావరణం
* మోడీ సహా 300 మందికిపైగా తొలిసారి ఎన్నికైన వారే
* నేడు మిగతా వారితో ప్రమాణం.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక
గురువారం లోక్‌సభలో ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక
న్యూఢిల్లీ: ప్రధానితో సహా రికార్డు స్థాయిలో 510 మంది కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు, నేతల పలకరింపులు, పరస్పర శుభాకాంక్షలతో 16వ లోక్‌సభ సమావేశాల రెండో రోజు పండుగ వాతావరణం నెలకొంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 300 మందికిపైగా ఎంపీలు తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన వారే కావడం విశేషం. దీంతో సభలో ఏకత్వంలో భిన్నత్వం ప్రస్ఫుటించింది. ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ గురువారం భారీ సంఖ్యలో ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక్క రోజులోనే 510 మంది ప్రమాణం చేయడం మరో విశేషం. చాలా మంది తమ మాతృభాషలోనే ప్రమాణం చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు. తెల్లటి కుర్తా పైజామాలో సభకు వచ్చిన ప్రధాని మోడీ సభ్యుల హర్షధ్వానాల మధ్య తొట్టతొలిగా దేవునిసాక్షిగా హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.
తర్వాత బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రమాణం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు హిందీలో ప్రమాణం చేయగా.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జలవనరుల మంత్రి ఉమాభారతి, మరో మంత్రి హర్షవర్ధన్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత్‌కుమార్, సిద్ధేశ్వర కన్నడలో... సర్వానంద సోనోవాల్ అస్సామీలో.. జుయల్ ఓరం ఒడియాలో ప్రమాణ పత్రాన్ని చదివారు. వరుసకు సోదరులైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కూడా ఒకరి తర్వాత మరొకరు హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక వరుణ్ తన సీటు వద్దకు వెళ్తూ సోనియాకు వందనం చేశారు.
అయితే ఆయన రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడంతో సోనియా ఆ విషయాన్ని గుర్తు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌తో పాటు ఆయన కోడలు డింపుల్, ఇద్దరు మేనల్లుళ్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అన్నాడీఎంకే సభ్యుల్లో అత్యధికులు తమిళంలో.. పశ్చిమబెంగాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషల్లోనే ప్రమాణం చేశారు. కొత్త రాష్ర్టం తెలంగాణ నుంచి ప్రమాణం చేసిన మొదటి ఎంపీగా జి. నగేశ్ (టీఆర్‌ఎస్) ప్రత్యేకంగా నిలిచారు. మొత్తానికి అధికార, విపక్ష సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకోవడంతో లోక్‌సభలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. శుక్రవారం మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఎన్నిక జరగ నుంది. రెండో రోజు దాదాపు 30 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. తెలంగాణకు చెందిన మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 37 మంది ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోక్‌సభ సభ్యులు కూడా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలకు గాను తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ హాజరుకాలేదు. తెలంగాణలో 17 స్థానాలుండగా.. మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన 16 మంది ఎంపీల్లో ఇద్దరు గైర్హాజరయ్యారు. ముందుగా కేంద్ర మంత్రులు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్‌గజపతి రాజు హిందీలో ప్రమాణం చేశారు. తర్వాత మధ్యాహ్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిగతా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఎంపీలు కొత్తపల్లి గీత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డాక్టర్ రవీంద్రబాబు, గోకరాజు గంగరాజు, మాగంటి వెంకటేశ్వరరావు, కేశినేని శ్రీనివాస్, జయదేవ్ గల్లా, మాల్యాద్రి శ్రీరాం, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, వి.వరప్రసాద్‌రావు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయగా.. డాక్టర్ కంభంపాటి హరిబాబు, తోట నర్సింహం, మురళీమోహన్, కొనకళ్ల నారాయణ రావు, రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ైవె..ఎస్.అవినాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు. ఇక కింజారపు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 4.25 గంటలకు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. బాల్క సుమన్, బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత , కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.పి.జితేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కడియం శ్రీహరి ఆంగ్లంలో ప్రమాణం చేయగా సి.హెచ్.మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగులో.. జి.నగేశ్, బండారు దత్తాత్రేయ, నంది ఎల్లయ్య హిందీలో.. అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.