డల్లాస్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం గణతంత్ర దినోత్సవం రోజున చేసిన నిరసనకి సంఘీబావంగా అమెరికాలోని వైఎస్ఆర్‌సీపీ డల్లాస్ విభాగం నేతలు డల్లాస్ మెట్రో అర్వింగ్ లో ఉన్న గాంధీ పార్కులో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎముకలు కొరికే చలిలో సైతం డల్లాస్ లో ఉన్న తెలుగువారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
కోడూరు కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేటపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పారని, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇస్తామంటే బీజేపీ 10 సంవత్సరాలు కావాలని అడిగారని గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీ రెండూ కూడా ఎన్నికల సందర్భంగా 10-15 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో పాటు వారి మేనిఫెస్టోలో కూడా చేర్చి నేడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఇది తగదని చెప్పారు. రాష్ట్ర యువతకి ఉపాధి దొరకాలంటే పరిశ్రమలు రావాలని, పరిశ్రమలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాజకీయ నాయకుల ప్యాకెట్లు నిండుతాయేమో కాని ప్రజలకు ఒనకురేదేమి లేదన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకులను, ఇతర రాజకీయ పార్టీ నేతలను కలుపుకొని అఖిల పక్షం ఏర్పాటు చేసి వీరిని డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు తీసుకెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ప్రయత్నించాలని డాక్టర్ పవన్ పామదుర్తి డిమాండ్ చేసారు. డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే రాజకీయ నాయకులు కావాలని మోదీ దగ్గర మోకరిల్లి స్వప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. అన్నపూర్ణగా వర్దిల్లిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారని, ముఖ్యమంత్రి స్పందించి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని రమణ కిష్టపాటి, నరసింహా రెడ్డి టంగుటూరి, సుబ్బారెడ్డి కొండు, శివమణి అన్నపురెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమానికి కృష్ణారెడ్డి కోడూరు, డాక్టర్ పవన్ పామదుర్తి, బాస్కర్ గండికోట, కృష్ణమోహన్ రెడ్డి, రవి కోన, సుబ్బారెడ్డి కొండు, రమణ పుట్లూరు, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, రమణ పుట్లూరు, పల్గున రెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, రఘు కుమ్మెత్త, శశి పల్లా, శ్రీనివాస్ బర్రె, రామకృష్ణ జాజుల, యుగంధర్ తిప్పిరెడ్డి, వెంకట్ తిప్పిరెడ్డి, రవితేజ సిద్ది, రమణ కిష్టపాటి, నరసింహా రెడ్డి టంగుటూరి, ఉమా మహేష్ కుర్రి, ఉమా మహేష్ పార్నపల్లి, శివ మణి అన్నపురెడ్డి, తిరుమల కంభం, ప్రబంద్ తోపుదుర్తి, రవి అరిమండ, శ్రీనివాసుల రెడ్డి వీరభద్ర, మహేష్ ఆదిబట్ల, శ్రీకాంత్ జొన్నల, చందు చింతల, అవినాష్, ప్రవీణ్, హేమంత్ నల్లా, వెంకటరెడ్డి, దేవేందర్, సుధాకర్ విప్పాల, మోహన్ మల్లంపాటి తదితరులు పాల్గొన్నారు.