కలసికట్టుగా పోరాడదాం రండి | YS Jagan Mohan Reddy Fight for AP Special Status | Sakshi
Sakshi News home page

కలసికట్టుగా పోరాడదాం రండి

Published Fri, Jan 27 2017 1:42 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

కలసికట్టుగా పోరాడదాం రండి - Sakshi

కలసికట్టుగా పోరాడదాం రండి

రాజకీయ పార్టీలకు వైఎస్‌ జగన్‌ పిలుపు
ప్రత్యేకహోదాకు చంద్రబాబు వెన్నుపోటు
నిరసనగా నేడు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన
పోలీసులకు జీతాలిస్తున్నది ప్రభుత్వమే కాని చంద్ర బాబు కాదు
సెల్యూట్‌ కొట్టాల్సింది సింహాలకు... గుంట నక్కలకు కాదు
విద్యార్థులపై కేసులా... ప్రతి కేసునూ ఎత్తివేస్తాం
చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే  
రానున్న ప్రజా ప్రభుత్వంలో అన్నిటిపైనా విచారణ


సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, హైదరాబాద్‌ :
‘‘జల్లికట్టు అనేది ఆటే కావచ్చు... కానీ ఆ ఆటను కొనసాగించుకోవడానికి అందరూ కలిసికట్టుగా సాధించుకున్నా రు. దానిని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ఒక్క తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని అడ్డుకున్న తీరుకు నిరసనగా, ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన ఆందోళనలు నిర్వహిద్దాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో గురువారం జరిగే కొవ్వొత్తుల ర్యాలీ లో పాల్గొనడానికి అక్కడి ఎయిర్‌పోర్టులో విమానం దిగిన వెంట నే జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు విజయసాయి రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, నాయకులు అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు చుట్టుముట్టి బయటకు అడుగు కూడా వేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. విశాఖ నుంచి హైదరాబాద్‌ రాత్రి 8.30 గంటలకు చేరుకున్న జగన్‌ తన నివా సం వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అడుగడు గునా అడ్డుతగులుతున్న చంద్రబాబును చూసి సిగ్గుతో తలదిం చుకోవాల్సి వస్తోందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే...

ప్రత్యేక హోదాకు చంద్రబాబు వెన్నుపోటు...
ప్రత్యేక హోదా కోసం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు, చదువుతున్న విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు పుణ్యాన పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని 1.06 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుండగా... వాటిలో 26 వేలు మూతపడ్డాయని కేపీఎంజీ, ఆర్‌బీఐ లాంటి సంస్థలు నివేదికలు ఇస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించడం మాట దేవుడెరుగు.. వరుసగా ఉద్యోగాలు పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఒక సంజీవని అని తెలిసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ప్రత్యేకహోదా కోసం ఎవరు నినదించినా, ఎవరు పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణచివేయాలన్నట్లుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేకహోదాకోసం పోరాడాల్సిన వ్యక్తే పార్లమెంటు సాక్షిగా విభజన నాడు ఇచ్చిన హామీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం బాధాకరం. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. రాజ్యాంగం ప్రకారం రిపబ్లిక్‌ డేగా ప్రకటించుకుని 68 సంవత్సరాలు అయిన  రోజున ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా, వైజాగ్‌లో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. ప్రత్యేకహోదా అన్న డిమాండ్‌ను కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి గుర్తుచేయడం కోసం గాంధేయ పద్ధతిలో సాగుతున్న యువకులను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. కాకినాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో విద్యార్థులను దారుణంగా కొట్టారు... కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్‌అరెస్ట్‌ చేశారు. సీపీఎం నేత మధును శ్రీకాకుళంలో అరెస్టు చేశారు. ఇవన్నీ చంద్రబాబు చేయాల్సిన పనులేనా అని అడుగుతున్నా.

పోలీసులూ సెల్యూట్‌ చేయాల్సింది సింహాలకు...
విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే రన్‌వే మీదనే మమ్మల్ని అడ్డుకున్నారు. మేమున్నది ఐదారుగురమే అయినా వందలకొద్దీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్షనాయకుడు, ఇద్దరు ఎంపీలు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని కూడా చూడలేదు. సాధారణ ప్రయాణికుడికి కూడా దేశీయ మార్గం ద్వారా బైటకు వెళ్లే హక్కు ఉంటుంది. విమానాశ్రయం సీఐఎస్‌ఎఫ్‌ అధీనంలో ఉంటుంది. పోలీసులకు సంబంధమే ఉండదు. కానీ పోలీసులు లోనికి ప్రవేశించి మమ్మల్ని అడ్డుకున్నారు. డొమెస్టిక్‌ టెర్మినల్‌ వద్దనే రెండు గంటలసేపు నిర్బంధించారు. అక్కడే మేం ధర్నాలు చేయాల్సి వచ్చింది. మీకు జీతాలిస్తున్నది ప్రభుత్వమే గానీ చంద్రబాబు కాదని పోలీసు అధికారులకు చెబుతున్నా. మీరు సెల్యూట్‌ కొట్టాల్సింది మీ నెత్తిపైనున్న మూడు సింహాలకే తప్ప, వాటి వెనుకనున్న గుంటనక్కలకు కాదు. చంద్రబాబే ఎల్లకాలం ఉంటాడని అనుకోవద్దు. దయచేసి ప్రజల పక్షాన నిలబడండి. ప్రజలకు అండగా నిలబడండి. పిల్లలు, నాయకులు రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఆరాటపడుతున్నారు. అందులో పోలీసుల పిల్లల భవిష్యత్‌ కూడా ఉంది. కొంతమంది పోలీసు అధికారులు చంద్రబాబు మనుషుల్లా వ్యవహరిస్తున్నారు. నిజంగా వీటన్నిటి మీద కచ్చితంగా విచారణ జరుగుతుంది. తగిన సమయం వచ్చినపుడు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

ప్రతి పిల్లాడికీ తోడుగా ఉంటా
చదువుకుంటున్న పిల్లలపై కేసులు పెడుతున్నారు. కేసులకు ఎవ్వరూ భయపడవద్దు. ప్రతిపిల్లాడికి తోడుగా ఉంటాం. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది... ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఈ కేసులన్నీ తీసేస్తాం. ప్రత్యేక హోదాను ఖూనీ చేసిన, ఇంకా చేస్తున్న చంద్రబాబు నాయుడ్ని దేవుడు, ప్రజలు క్షమించరు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే వస్తుంది. ప్రత్యేక హోదాకు అడ్డు తగులుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నా.

ప్రత్యేక హోదా మన శ్వాస...
ప్రత్యేకహోదా అన్నది మన శ్వాస. మనకు రాజ్యాంగబద్ధంగా ఇస్తామన్న హామీ. దాన్ని నీరు గార్చడానికి మనం ఒప్పుకోకూడదు. అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా... అందరం ఒకటవుదాం... కలిసికట్టుగా పోరాడదాం... ప్రత్యేకహోదాను సాధించుకుందాం. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపేద్దాం. తమిళనాడులో జల్లికట్టుకు, ఇక్కడి హోదా ఆందోళనకు సంబంధం లేదని చంద్రబాబు, ఆయన మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్నారు. అది జల్లికట్టు కాదు... కలిసికట్టు. ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడి వరకూ కలిసికట్టుగా ఉద్యమించి, పోరాడి సాధించుకున్నారు. సా«ధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలాగే సాధించుకున్నారు. అదే స్ఫూర్తితో మనమూ ఉద్యమించి ప్రత్యేకహోదాను సాధించుకుందాం. చంద్రబాబులాంటి ముఖ్యమంత్రి ఉండి ఉంటే... మనకు స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదు.

ఇలాంటి ముఖ్యమంత్రి పోతేనే మంచి జరిగేది. గతంలో జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం జాబు రావాలంటే బాబు పోవాలి. ఇందుకు అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. చంద్రబాబు, సుజనా చౌదరి... అసలు వీరంతా మనుషులేనా అనిపిస్తోంది. రాష్ట్రాన్ని విడగొట్టేప్పుడు ప్రత్యేక హోదా అయిదు కాదు 15 ఏళ్లు కావాలని అడగలేదా? పరిశ్రమలు కట్టడానికే రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. అయిదేళ్లు హోదా ఏం సరిపోతుందని వెంకయ్యనాయుడు లాంటి వారు మాట్లాడలేదా? పార్టీల మేనిఫెస్టోల్లో ఇవన్నీ చెప్పలేదా? ఎన్నికలు, ప్రజలతో పని అయిపోయిన తరువాత ఇన్ని మోసాలు, అబద్ధాలా? ఇలాంటి వారు నాయకులని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement