
ఆ పాపం బడాబాబులదే: వెంకయ్య
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిల పెరిగిపోవడానికి కారణం సంపన్న కార్పొరేట్లే తప్ప పేదలు కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తీసుకున్న రుణాల చెల్లింపులో పేదల ట్రాక్ రికార్డు చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అట్టడుగు వర్గాల వారిపై బ్యాంకులు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ‘బ్యాంకుల దృక్పథం మారుతోంది. ఇది మరింతగా మారాలి. అల్లయ్యలు.. మల్లయ్యలకే (మాల్యాలు) కాదు.. ఊళ్లల్లో .. చిన్న చిన్న పట్టణాల్లో ఉండే పుల్లయ్యలకు కూడా రుణాలివ్వడంపై దృష్టి పెట్టాలి.
మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పేదల వల్ల రాలేదు.. దీనికి కారణం చాలా చాలా పెద్దోళ్లే. స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు 98–99 శాతం దాకా కట్టేస్తూనే ఉన్నారు‘ అని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ చట్టం రెరా అమలుకు అవసరమయ్యే యంత్రాంగాన్ని జూలై 30 నాటికల్లా సిద్ధం చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్లు నేషననల్ హౌసింగ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు.