ఎన్‌పీఏల పరిష్కారానికి ప్రాధాన్యం: జైట్లీ
న్యూయార్క్: మొండిబకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. మంగళవారమిక్కడ విదేశీ వ్యవహారాల మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య భారత్ బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. ‘‘ఇది ఒక సవాలే. అయినా, పరిష్కరించగలమన్న నమ్మకం ఉంది.
20 నుంచి 30 పెద్ద అకౌంట్ల వల్లే ఈ సమస్య తలెత్తింది. భారత్ ఆర్థిక వ్యవస్థలో ఇదేమీ పరిష్కరించలేనంత పెద్ద సమస్య కాదు. ప్రపంచం మందగమనంలో ఉన్నా... భారత్ 15 నుంచి 18 శాతం వార్షిక ఆదాయ వృద్ధిని నమోదుచేసుకుంటోంది. ఇదే తీరు మున్ముందూ కొనసాగుతుంది. భారత్ ఆర్థిక వ్యవస్థకు జీఎస్‌టీతో పలు లాభాలు కలుగుతాయి’’ అని వ్యాఖ్యానించారు.
2016 డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రూ.6,06,911 కోట్లుకు చేరాయి. ఒత్తిడిలో ఉన్న రుణ పరిమాణం (పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు, స్థూల ఎన్‌పీఏలు) మొత్తం రూ. 9.64 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నాటికి ఈ మొత్తం రూ.8,97,000 కోట్లు. అంటే నాలుగు నెలలు గడిచే సరికే ఈ పరిమాణం దాదాపు 7.5 శాతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.