రూ.8 లక్షల కోట్ల ఎన్‌పీఏలపై ‘దివాలా’ చర్యలు!
♦ 2019 మార్చికల్లా దివాలా చట్టం ప్రకారం పరిష్కారానికి అవకాశం
♦ అసోచామ్ అధ్యయన నివేదిక
న్యూఢిల్లీ: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దివాలా చట్టం ప్రకారం మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యను పరిష్కరించేందుకు ఆర్‌బీఐ చర్యలను వేగవంతం చేస్తోందని అసోచామ్ పేర్కొంది. 2019 మార్చిలోపు దాదాపు రూ.8 లక్షల కోట్ల ఎన్‌పీఏలను ఈ దివాలా చట్టాన్ని ప్రయోగించి బ్యాంకులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. దీనివల్ల వ్యవస్థలో ఎన్‌పీఏల పరిమాణం తగ్గడంతోపాటు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుందని అభిప్రాయపడింది.
ప్రభుత్వం, ఆర్‌బీఐ చేపడుతున్న కొన్ని చర్యలతోపాటు ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడుతుండటం(టర్న్‌ఎరౌండ్) వంటి పలు అంశాలు కూడా ఈ ఎన్‌పీఏల సమస్యనుంచి గట్టెక్కేందుకు దోహదం చేస్తాయని అసోచామ్ పేర్కొంది. కాగా, దివాలా చట్టాన్ని ప్రయోగించినప్పటికీ.. ఈ ఎన్‌పీఏలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి ఎంత త్వరగా తొలగిపోతాయన్నది చూడాల్సి ఉందని.. ఎందుకంటే కొన్ని బ్యాంకులు ప్రస్తుతం మొండిబకాయిలను భరించలేని పరిస్థితుల్లో ఉన్నాయని నివేదికలో ప్రస్తావించింది.
కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి...: బ్యాంకుల ఆర్థిక పరిస్థితితో పాటు పనితీరుపైన కూడా ఎన్‌పీఏలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2016–17లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.5 లక్షల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించాయి. అయితే, ఎన్‌పీఏలకు భారీ ప్రొవిజనింగ్ కారణంగా వీటి నికర లాభం రూ.574 కోట్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి కొత్తగా రుణాలిచ్చేందుకు బ్యాంకులకు అవకాశం లేకుండా పోతోందని నివేదక తెలిపింది.
దివాలా కోడ్(ఐబీసీ) ద్వారా ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. కాగా, ఇప్పటికే 12 అతిపెద్ద రుణ ఎగవేత కంపెనీలపై దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు ఈ దిశగా చర్యలు ప్రారంభించాయి కూడా. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం ఎన్‌పీఏల్లో ఈ 12 కంపెనీలవే 25 శాతం(దాదాపు రూ.2లక్షల కోట్లు) కావడం గమనార్హం.